జాలర్ల హంతకులను ఇండియాకు పంపం

ఇటలీ దుస్సాహసం
ఇది మాకు ఆమోదయోగ్యం కాదు : ప్రధాని
న్యూఢిల్లీ, మార్చి 12 (జనంసాక్షి): ఇద్దరు కేరళ జాలర్లను చంపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇటలీ అధికారులను భారత్‌కు తిరిగి పంపేందుకు ఇటలీ నిరా కరించడాన్ని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఇటలీ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిశీలిసుతున్నామని చెప్పారు. గతేడాది కేరళ తీర ప్రాంతంలో ఇద్దరు జాలర్లను కాల్చి చంపిన ఘటనలో ఇద్దరు ఇటలీ నావికాదళ అధికారులను కేరళ పోలీసులు అరెస్టు చేసి, జైలులో పెట్టారు. ఇటలీ జాతీయ ఎన్నికల్లో పాల్గొనేందుకు నిందితులు సుప్రీంకోర్టు అనుమతితో వారి స్వదేశానికి వెళ్లారు. ఇప్పుడు వారిని తిరిగి పంపేందుకు ఇటలీ ప్రభుత్వం తిరస్కరించింది. ఈ మేరకు ఆ దేశం భారత్‌కు సోమవారం ఓ లేఖ రాసింది. దీన్ని నిరసిస్తూ వామపక్ష ఎంపీలు మంగళవారం ప్రధానిని కలిశారు. తాము ఈ అంశంపై దృష్టి సారించామని, ఇటలీతో చర్చలు జరిపాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌కు సూచించినట్లు చెప్పారు. మరోవైపు, ఇటలీ పంపించిన లేఖను ప్రభుత్వ న్యాయాధికారులు పరిశీలిస్తున్నారని, వారి సలహాతో తదుపరి చర్యలు చేపడతామని సల్మాన్‌ ఖుర్షీద్‌ తెలిపారు. ఇటలీ అధికారులను వెనక్కు రప్పించి, కోర్టులో ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే, కేరళ ముఖ్యమంత్రి ఉమెన్‌ చాందీ ఇటలీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉదంతాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఈ మేరకు ఆయన ప్రధానికి ఓ లేఖ రాశారు. మరోవైపు, ఈ అంశంపై కేంద్రంతో చర్చించేందుకు ఆయన మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. తాజా ఉదంతంపై బీజేపీ, సీపీఎం ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డాయి.