జిల్లా వరదబాధితులను ఆదుకోవాలి

మంచిర్యాల,జూలై20(జ‌నంసాక్షి): మంచిర్యాల జిల్లా వరద బాధితులపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ అన్నారు. వరదలతో నష్టపోయిన ప్రతీ కుటుంబానికి పరిహారాన్ని అందచేయాలని అన్నారు. సీఎం కేసీఆర్‌ ఇతర జిల్లాలకు నష్టపరిహారం ప్రకటించి మంచిర్యాల జిల్లాకు ప్రకటించకపోవడంలో ఆంతర్యమేమిటని అన్నారు. జిల్లాపై ప్రభుత్వానికి వివక్ష తగదని అన్నారు.
ముంపునకు గురైన వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌తో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. వారికి ఎలాంటి నష్టపరిహారం అందించడం లేదన్నారు. వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఇండ్లు కూలిపోయాయని అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వరద బాధిత ప్రజలను, రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇదిలావుంటే మంచిర్యాల పట్టణంలోని వరద బాధితులను పునరావాస కేంద్రాల్లో ఉండనివ్వాలని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు. మున్సిపల్‌, రెవెన్యూ సిబ్బంది పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న బాధితులను ఖాళీ చేయిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకులు మున్సిపల్‌ కమిషనర్‌లకు వినతిపత్రం అంద జేశారు. వరదల వల్ల అనేక మంది ఇండ్లు కూలి పోయి నిరాశ్రయలైనందున మరికొంత కాలం వారికి ఆశ్రయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.