జులై 20న రాష్ట్రవ్యాప్త పాఠశాలలు కళాశాలల బంద్.

వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు.
———————————————————
హనుమకొండ జిల్లా ప్రతినిధి జనంసాక్షి జులై19:-
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జులై 20న పాఠశాలలు,కళాశాలల బంద్ కు పిలుపునిస్తున్నట్లు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు.
మంగళవారం  హనుమకొండ లోని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలలో “రేపు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ( జులై 20న)జరిగే రాష్ట్రవ్యాప్త విద్యా సంస్థల బంద్ “జయప్రదం చేయాలని కోరుతూ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మొగిలి వెంకటరెడ్డి (పి.డి.ఎస్.యు) బొంబాయిలో సంతోష్ ( ఏ.ఐ.ఎస్.ఎఫ్), బి నరసింహారావు( పి.డి.ఎస్.యు), మంద శ్రీకాంత్( ఎస్.ఎఫ్.ఐ),  మధు (పి.డి.ఎస్.యు), బండారు చిరంజీవి (ఎ. ఐ.ఎఫ్.డి.ఎస్)., సత్యనారాయణ (ఎ.ఐ.డి.ఎస్.ఓ), లు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో విద్యార్థి వ్యతిరేక సంస్కరణలు తీసుకువస్తూ దళిత, గిరిజన, బడుగు, బలహీన, ముస్లిం, మైనారిటీ వర్గాల విద్యార్థులను విద్యారంగానికి దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యారంగాన్ని కార్పొరేట్ యాజమాన్యాలు వ్యాపారమయం చేస్తుంటే అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. పాలకవర్గాలు ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించడం నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా పాలకులు ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ అందించాలని, విద్యారంగ వ్యతిరేక నూతన జాతీయ విద్యా విధానం 2020ని రద్దు చేయాలని, హై స్కూల్ కళాశాలల విద్యార్థులకు ఉచితంగా బస్ పాస్ సౌకర్యం కల్పించాలని, కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ ,కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించాలని, మన ఊరు- మనబడి పథకంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను చేర్చి అధిక నిధులు కేటాయించాలని, ఎస్.ఎం.హెచ్. హాస్టల్ విద్యార్థులకు సొంత భవనాలు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.

. పై డిమాండ్ల సాధన కోసం జులై 20న జరిగే పాఠశాల, కళాశాలల  విద్య సంస్థల బంద్ కు ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు వేల్పుల చరణ్, బి. గోవర్ధన్, ప్రవీణ్, నవీన్, ముషారప్, రవితేజ, శశిధర్, నితిన్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.