జులై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారాన్ని విజయవంతం చేయండి

– గ్రీన్‌హంట్‌ ఆపరేషన్‌ అంతా ఓ బూటకం
– సహజ వనరులను కొల్లగొట్టడమే అసలు లక్ష్యం
– విదేశీ పెట్టుబడిదారులకు ప్రభుత్వం దాసోహం
– బూటకపు ఎన్‌కౌంటర్లతో రక్త దాహం తీర్చుకుంటున్న పాలకవర్గం
– మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ అధికార
ప్రతినిధి ఉసెండీ
హైదరాబాద్‌,జూలై 17(జనంసాక్షి): మావోయిస్టు పార్టీ సంస్థాపక నేత చారు మజుం దార్‌ అమరుడైన జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారంగా నిర్వహిం చనున్నట్లు, దీన్ని దేశ ప్రజలందరూ విజయవం తం చేయాలని, మజుందార్‌ వర్ధంతి సాక్షిగా ఇటీవలే ప్రభుత్వ బలగాల చేతిలో హతమైన పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు మల్లోజుల కోటేశ్వరరావు ఆశయాలకు కృషి చేయాలని ఆ పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ అది óకార ప్రతినిధి గుడ్సా ఉసెండీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఓ లేఖను పశ్చిమ బెంగాల్‌లోనిబురిషోల్‌ అడవుల్లో పోలీసు, పారామిలిటరీ బలగాలు కోవర్టు ఆపరేషన్‌ నిర్వహించి పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్‌ కిషన్‌జీని హత్య చేశారని ఉసెండీ లేఖలో ఆరోపించారు. 45 ఏళ్ల మావోయిస్టు ఉద్యమ చరిత్రలో 15 వేల మంది ఉద్యమకారులను ప్రభుత్వం అనేక బూటకపు ఎన్‌కౌంటర్లలో హతమార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క పోయినేడాదిలోనే మావోయిస్టు పార్టీతో సంబంధమున్న 150 మందిని ప్రభుత్వ బలగాలు ఊచకోత కోశారని ఆరోపించారు. ఇలా ఎన్నో బూటకపు ఎన్‌కౌంటర్లు చేసి ప్రభుత్వం రక్తదాహం తీర్చుకుంటున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం మావోయిస్టునే పార్టీనే అంతం చేసేందుకు ప్రభుత్వం విఫల ప్రయత్నాలు చేస్తూ కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. ఇందులో భాగంగానే ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ పేరుతో దండకారణ్యం చుట్టూ లక్షలాది పారామిలిటరీ బలగాలను, శిక్షణ క్యాంపు పేరుతో సైన్యాన్ని మోహరిస్తున్నదని ఉసెండీ ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని కుతంత్రాలు చేసినా మావోయిస్టు పార్టీకి వాటిని తిప్పికొట్టే సామర్థ్యం ఉన్నదని ఆయన వెల్లడించారు. ప్రజలు కూడా ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. మావోయిస్టులను బూచిగా చూపుతూ, ప్రజల దృష్టి మరల్చి, దండకారణ్యంలో ఉన్న సహజ వనరులను, ఖనిజ నిక్షేపాలను దోచి పెట్టుబడిదారులకు అప్పగించాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం పని చేస్తున్నదని ఉసెండీ లేఖలో తీవ్రస్థాయిలో విమర్శించారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం కొమ్ముకాస్తూ పేదలను అణగదొక్కాలని చూస్తున్నదని, కానీ, ఎంతగా అణిచివేస్తే ఉద్యమం అంతగా బలపడుతుందని పాలకులు తెలుసుకోవాలన్నారు. మావోయిస్టు ప్రభుత్వపు ఈ దుశ్చర్యలకు వ్యతిరేకంగా పోరాడుతున్నదని, ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకించాలని ఆయన అభ్యర్థించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను బహిర్గతం చేసేందుకే, చారు మజుందార్‌ వర్ధంతి రోజైన జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారం నిర్వహిస్తున్నట్లు, అమరుల ఆశయ సాధనకు అందరు కలిసి రావాలని గుడ్సా ఉసెండీ ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.