జూన్‌ మూడోవారంలోగా పంచాయతీ ఎన్నికలు

రాష్ట్ర ఈసీ రామాకాంత్‌రెడ్డి
హైదరాబాద్‌, మే 7 (జనంసాక్షి) : ఎట్టకేలకు జూన్‌లో స్థానిక ఎన్నికల నగరా మోగించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితాను పూర్తి చేయించిన అధికారులు ఇప్పుడు ఇక అసలు రంగంలోకి దిగబోతున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల పక్రియను జూన్‌ మూడో వారానికల్లా పూర్తిచేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం ఓ అవగాహనకు వచ్చాయి. రిజర్వేషన్ల ఆధారంగా ప్రభుత్వం నుంచి గెజిట్‌ నోటిఫికేషన్‌ అందిన వెంటనే 17 రోజుల్లోగా మొత్తం ఎన్నికల పక్రియను పూర్తిచేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి వెల్లడించారు. పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికను రెండు దశల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారమే పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగానూ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పార్టీ గుర్తులతోనూ నిర్వహించనున్నట్లు రమాకాంత్‌రెడ్డి స్పష్టంచేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించేందుకు తహశీల్దారు, ఎంపీడీవో, ఎస్‌హెచ్‌వోలతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇదిలావుంటే ఇప్పటికే తాను వివిధ జిల్లాల కలెక్టర్లతో సమీక్షలు జరిపి ఎన్నికలకు సిద్ధం చేశానన్నారు. జిల్లా యంత్రాంగం కూడా ఎన్నికలకు అన్ని ఏర్పాటు చేసుకుందన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ నెలాఖరులోగా రిజర్వేషన్ల ఆధారంగా గెజిట్‌ నోటిఫికేషన్‌ అందజేయనున్నట్లు పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ రాంగోపాల్‌ తెలిపారు. కేంద్ర జనగణన లెక్కలకు, స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్‌కు వ్యత్యాసం ఉన్నందున లోటుపాట్లను సవరించి ఈ నెల 18లోగా నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఈ పక్రియలను పూర్తిచేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పూర్తిస్థాయి నివేదిక అందజేస్తామని రాంగోపాల్‌ తెలిపారు. ఎన్నికలపై సిఎం కిరణ్‌ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల నాయకులతో నేరుగా చర్చిస్తున్నారు. జూన్‌లో రుతుపవనాల ఆగమనం తరవాత పరిస్తితి అనుకూలంగా ఉంఉటందని భావిస్తున్నారు.