జూన్‌ రెండోవారంలో చలో అసెంబ్లీ

నేటి నుంచి బస్సుయాత్ర
కోదండరామ్‌
హైదరాబాద్‌, మే 26 (జనంసాక్షి) :
జూన్‌ రెండోవారంలో చలో అసెంబ్లీ నిర్వహిస్తామని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ప్రకటించారు. ఆదివారం నగరంలో టీజేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం కోదండరామ్‌ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలను కేంద్రం దృష్టికి మరోమారు తీసుకెళ్లేందుకు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు పేర్కొన్నారు. తెలంగాణలోని పది జిల్లాల ప్రజల ఆకాంక్షను పలు సందర్భాల్లో పలు విధాలుగా వ్యక్తపరిచినా కేంద్రం ప్రభుత్వం కావాలని కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. వెయ్యికి మందికి పైగా విద్యార్థులు, యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నా స్పందించని ప్రభుత్వాన్ని ఏమనాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రకటనలు జారీ చేసి వెనక్కి పోయిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి మూడేళ్లు గడిచినా ఇంతవరకూ ఒక్క అడుగూ ముందుకు వేయలేదన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. తెలంగాణ ప్రజల పక్షన ఉద్యమపథాన సాగే అందరూ చలో అసెంబ్లీకి మద్దతు పలకాలని కోరారు. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా విజయవంతం చేసి తీరుతామన్నారు. సోమవారం నుంచి తెలంగాణ ఇనుప ఖనిజం ఈ ప్రాంతానికి దక్కాలనే డిమాండ్‌ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపడుతున్నామని తెలిపారు. కరీంనగర్‌ జిల్లా భీమదేవరపల్లిలో ప్రారంభమయ్యే యాత్ర వరంగల్‌ జిల్లా గూడూరు మీదుగా ఖమ్మం జిల్లా బయ్యారానికి చేరుకుంటుందని తెలిపారు. బయ్యారంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట జేఏసీ నేతలు దేవీప్రసాద్‌ తదితరులు ఉన్నారు.