జూలూరుపాడు ఆసుపత్రిలో వైద్యం అంతంతమాత్రం

వైద్యులు, సిబ్బందిని తగ్గించిన జిల్లా అధికారులు
* ఇబ్బందులు పడుతున్న ప్రజలు

జూలూరుపాడు, అక్టోబర్ 11, జనంసాక్షి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాల జబ్బులకు ప్రభుత్వ వైద్యం అందించేందుకు కృషి చేస్తుంది. కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి ఆరోగ్య సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. జూలూరుపాడు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య వైద్యశాలలో నిన్నటి వరకు పూర్తిస్థాయిలో రోగులకు వైద్యం అందిందని చెప్పవచ్చు. ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులు, ఆరుగురు స్టాఫ్ నర్సులు ఒకరు హెడ్ నర్స్ సిబ్బంది రోగులకు వైద్యం అందించేవారు. పగలు, రాత్రి సమయంలో సైతం రోగులకు వైద్యం అందించేందుకు శ్రమించారు. కానీ ఇటీవల జిల్లా వైద్యశాఖ తీసుకున్న నిర్ణయంతో ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది తక్కువగా ఉండటంతో రోగులకు వైద్యం సకాలంలో అందడం లేదు. మండలంలోని మారుమూల గ్రామాల నుంచి నిత్యం ఏదో ఒక జబ్బుతో వైద్యం కోసం ఆసుపత్రికి సుమారు 150 మంది రోగులు వస్తుంటారు. వీరికి సరిపడా వైద్యులు, సిబ్బంది ఉండటంతో సకాలంలో వైద్య సేవలు అందేవి. ప్రస్తుతం ఆస్పత్రిలో ఒక్క డాక్టర్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఆరుగురు స్టాఫ్ నర్సులు ఉండగా వీరిలో ముగ్గురిని వేరే ప్రాంతాలకు డిప్యూటేషన్ పై బదిలీ చేశారు. దీంతో ముగ్గురు స్టాఫ్ నర్సులు మాత్రమే ఇక్కడ సేవలు అందించాల్సి వస్తుంది. రాత్రి పగలు వైద్యం అందించాల్సి ఉండడంతో వీరికి కొంత సమస్యగా మారింది. డిప్యూటేషన్ పై స్టాఫ్ నర్స్ లను బదిలీ చేసిన స్థానంలో గ్రామాల్లో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ఏఎన్ఎం లకు విధులు పురమాయించారు. ఉన్న ఒక్క డాక్టర్ ఏదైనా సమయంలో అందుబాటులో లేకపోతే రోగులకు వైద్య పరీక్షలు అందడం లేదు. రాత్రి సమయంలో ఆసుపత్రికి వచ్చే రోగులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి జిల్లా అధికారులు తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందిని కొందరు ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగానే డిప్యూటేషన్ పై వేరే ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారనే ఆరోపణలు చర్చనీయంశంగా మారాయి. ఇటీవల ఆసుపత్రిలో చేపట్టిన డిప్యూటేషన్ బదిలీలను కూడా రద్దు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగం సత్వర చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.