జేఎన్‌టీయూలో సిబ్బంది బంపర్‌ ఆఫర్‌

విద్యార్థులు ఇంటి వద్దే చూచిరాతకు బేరం
జేఎన్‌టీయూలో భారీ కుంభకోణం
సూత్రధారులను అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్‌, డిసెంబర్‌ 13 (జనంసాక్షి):
జెఎన్‌టియూ పరీక్షల విభాగంలో గోల్‌మాల్‌ వెలుగుచూసింది. జవాబు పత్రాలను విద్యార్థుల ఇంటికే పంపి పరీక్షలు రాయించేందుకు కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పాడి వారి నుంచి భారీగా సొమ్ము వసూలు చేస్తున్న ఉదంతం బయట పడింది. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వల పన్ని ఈ కుంభకోణానికి పాల్పడిన ముఠాను గురువారం నాడు అరెస్టు చేశారు. జెఎన్‌టియూ జవాబు పత్రాల ఇన్‌ఛార్జీ బాలు మహేంధర్‌తో సహా 12మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదంతంతో విద్యార్థి, అధికార వర్గాలు ఉలిక్కిపడ్డాయి. పరీక్షలు రాయకుండానే ఇంటివద్దే జవాబు పత్రాలను నింపేలా ఈ కుంభకోణం సూత్రధారులు ప్రణాళిక రూపొందించారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.3000చొప్పున వసూలు చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే కొందరు విద్యార్థుల నుంచి
సొమ్ములు వసూలు చేసినట్టు సమాచారం. ఈ కుంభకోణానికి సంబంధించి అరెస్టు చేసిన వారిని పోలీసులు ఈ సాయంత్రం మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారని సమాచారం. ఇదిలా ఉండగా, ఈ కుంభకోణంపై విచారణకు కమిటీని ఏర్పాటు చేశామని, నివేదిక అందినతరువాత బాధ్యులపై తగినచర్యలు తీసుకుంటామని జెఎన్‌టియూ రిజిస్ట్రార్‌ రమణారావు తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి సిబ్బంది ప్రమేయం ఉండకపోవచ్చునని అన్నారు. ఒకవేళ సిబ్బంది ప్రమేయం ఉందని విచారణలో తేలితే వారిపై క్రిమినల్‌ కేసులు పెడతామని ఆయన తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం, నివేదిక ఇంకా తమకు అందలేదన్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న విద్యార్థులను డిబార్‌ చేస్తామని, వారిపై జీవితకాల నిషేధానికి సిఫార్సు చేస్తామని చెప్పారు. ఈ కుంభకోణానికి సహకరించిన కాలేజీలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. దీనిలో సంబంధం ఉందని తేలితే ఆయా కాలేజీల గుర్తింపును కూడా రద్దు చేస్తామని ఆయన తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. కాగా, జెఎన్‌టియూ జవాబు పత్రాల కుంభకోణం వార్తలు వెలుగు చూడడంతో గురువారం ఆ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ఛాంబర్‌ ఎదుట ఎబివిపి ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. వైస్‌ ఛాన్సలర్‌ ఛాంబర్‌ కిటికి అద్దాలను పగులగొట్టారు. కుంభకోణానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులకు న్యాయంచేయాలని నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆందోళన కారులను చెదరగొట్టారు.