జోడేఘాట్ లో కుమ్రం భీంకు నివాళులర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
నిర్మల్ బ్యూరో, అక్టోబర్09,జనంసాక్షి,,, ఆదివాసీల ఆరాధ్యదైవం కుమ్రం భీం 82వ వర్ధంతిని పురస్కరించుకుని అటవీ, పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఘన నివాళులర్పించారు. జోడేఘాట్‌లో కొమురం భీం సమాధికి, ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రాంతం గురించి అప్పటి పాలకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. సీఎం కేసీఆర్ ఈ ప్రాంత అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. కుమ్రం భీం జయంతి, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.. అమరుడు కుమ్రం భీం పోరాట ప్రదేశం జోడేఘాట్‌ను అన్ని హంగులతో అభివృద్ది చేశాం. కుమ్రం భీం స్మారక చిహ్నం, స్మృతి వనం, గిరిజన మ్యూజియం ఏర్పాటు చేసి, భీం పోరాట పటిమను భవిష్యత్ తరాలకు తెలియపరిచే విధంగా, అన్ని సౌకర్యాలను జోడెఘాట్‌లో కల్పించాం. పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం.
హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్ బండ్ పై కుమ్రం భీం విగ్రహాన్ని ప్రతిష్టించాము. ఆదివాసీల ఆత్మగౌరవాన్ని తెలిపేలా రూ.55 కోట్లతో ఆదివాసీ భవనాన్ని నిర్మించి, ప్రారంభించుకున్నాం. గిరిజనులకు విద్యా, ఉపాధి అవకాశాల్లో 6% ఉన్న రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆదివాసీల ఆరాధ్య దైవం కుమ్రం భీం చేసిన సేవలకు గుర్తుగా కుమ్రం భీం- ఆసిఫాబాద్ జిల్లాను ఏర్పాటు చేసుకున్నాం.వట్టి వాగు, చెలిమెల వాగు ప్రాజెక్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. రెండవ దశలో మరికొన్ని చెక్ డ్యాముల నిర్మాణానికి త్వరలోనే అనుమతులు మంజూరు చేస్తాం. హట్టి నుంచి జోడేఘాట్ వరకు 15 కిలోమీటర్ల మేర తారు రోడ్డును నిర్మింకున్నాం. గిరిజనులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పోడు సమస్య పరిష్కారానికి సీఎం కేసీఅర్ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలోసమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసింది. ప్రస్తుతం దీనిపై హై కోర్ట్ స్టే విధించింది. ప్రస్తుతానికి పోడు భూముల సర్వే పనులు కొనసాగుతున్నాయి. కోర్టు తదుపరి ఉత్తర్వులననుసరించి అర్ఓఎఫ్ ఆర్ పట్టాలు జారీ చేస్తాం.ప్రతీ సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా దండారీ ఉత్సవాలకు కోటి రూపాయలు మంజూరు చేశాం.
స్థానిక నేతల విజ్ఞప్తి మేరకు ఆదివాసీల గూడేల్లో కొత్తగా 100 దేవాలయాల నిర్మాణాలకు ఒక్కొక్క దేవాలయానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేసేందుకు దేవాదాయ శాఖ అనుమతినిచ్చింది.
గిరిజన తెగల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. సీఎం కేసీఅర్ దృష్టికి వారి సమస్యలను తీసుకెళ్లి త్వరలోనే సమస్యలు పరిష్కారం అయ్యేలా కృషి చేస్తాం..ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కోవా లక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప, ఎమ్మెల్సీ దండే విఠల్, ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి, మాజీ ఎంపీ నగేష్, ఇతర ప్రజాప్రతనిధులు, తదితరులు పాల్గొన్నారు.