టిఆర్‌టిలో కొత్త నిబంధన సరికాదు

నల్లగొండ,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): కొత్తగా టిఆర్‌టి ద్వారా డిఎస్పీ ప్రకటన జారీ చేసినా కొన్నివర్గాలు ఇంకా ఆందోళన చెందుతున్నాయి. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రకటన జారీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో నిరుద్యోగుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. అయితే అర్హతల నిబంధనలు ఉపాధ్యాయ శిక్షణ (బీఈడీ, డీఈడీ, టీపీఎఫ్‌) పూర్తిచేసుకున్న నిరుద్యోగులకు ఆందోళన, మానసికక్షోభ కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఇంటర్‌, డిగ్రీలలో ఓసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45 శాతం మార్కులుండాలనే నిబంధన లక్షల మందిని అనర్హులుగా చేస్తుంది. వీరందరూ ఉపాధ్యాయ శిక్షణ ప్రవేశ పరీక్షల సమయంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేసుకున్న వారే. అప్పుడు లేని నిబంధనలు ఇప్పుడు పెట్టడంతో అర్హులు కాకుండా పోతున్నారు. ఇంటర్‌, డిగ్రీలలోని శాతాల నిబంధనను తొలగించి ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేసిన అందరికీ డీఎస్సీ (టీఆర్‌టీ)లో అవకాశం ఇవ్వాలని నిరుద్యోగ యువత కోరుకుంటోంది. ఎలాంటి నిబంధనలు పెట్టాలన్నా ఉపాధ్యాయ శిక్షణ ప్రవేశ పరీక్షల సమయంలోనే పెట్టాలి. ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేశాక అనర్హులుగా పరిగణించడం సరికాదంటున్నారు.