టీఆర్‌ఎస్‌ సింగిల్‌ ఎజెండా

తెలంగాణ తీర్మానం : ఈటెల
హైదరాబాద్‌, జూన్‌ 9 (జనంసాక్షి) :
మలి విడత బడ్జెట్‌ సమావేశాల్లో టీఆర్‌ఎస్‌ సింగిల్‌ ఎజెండాతో ముందుకు వెళ్లనుందని ఆ పార్టీ శాసనసభ పక్షనేత ఈటెల రాజేందర్‌ పేర్కొన్నారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ కోసం తీర్మానం చేయాల్సిందేనని, ఇందుకోసం తెగేదాక పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం అనంతరం రాజేందర్‌ మీడియాతో మాట్లాడారు. ప్రజల హక్కులను హరించేవిధంగా సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. 13వ అసెంబ్లీ చరిత్రలో ఈసారి చిట్టచివరి బడ్జెట్‌ సమావేశాలు ఇవే అయినందున తెలంగాణ కోసం తీర్మానం పెట్టాలని రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ తెలంగాణ ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని తుంగలో తొక్కిందని ఆరోపించారు. నేటికి కూడా రోజుకోవేశం వేస్తూ పూటకోమాట మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తోందని ద్వజమెత్తారు. సీమాంధ్ర నేతల మోచేతుల నీళ్లు తాగుతూ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కన్నతల్లుల గుండెల్లో పోట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. దేశ ప్రజల సాక్షిగా చిదంబరం తెలంగాణా ప్రకటన చేసి అమలు విషయంలో విస్మరించారని ఈటెల ఆరోపించారు. కళ్లుతలపైకెక్కిన రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి పూటకో మాట మాట్లాడుతూ తెలంగాణా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. తెలంగాణాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అసెంబ్లీలో భరతం పడుతామన్నారు. చలో అసెంబ్లీకి అనుమతులు ఇవ్వాల్సిందేనని ఈటెల డిమాండ్‌ చేశారు.