టీఎస్‌ఆర్టీసీ లూటీ

ఆదాయానికి సీమాంధ్ర ప్రయివేటు బస్సుల గండి

పటన్‌చెరు నుంచి లక్డీకపూల్‌ దాకా అడుగడుగున ట్రాఫిక్‌ జాంలు1

రోజుకు సగటున రూ.3కోట్లమేర నష్టం

పుట్టగొడుగుల్లా వెలుస్తున్న సీమాంధ్ర ట్రావెల్‌ ఏజెన్సీలు

స్టేజీ క్యారేజీలుగా నడుపుతూ నిలువునా మోసం

యథేచ్ఛగా సాగుతున్న అక్రమ దందా

నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేట్‌ బస్సులు

ఇప్పటికైనా టిప్రభుత్వం, ఆర్టీఏ అడ్డుకట్ట వేయాలి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 20, (జనంసాక్షి) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా సీమాంధ్రుల దోపిడీ నేటికీ కొనసాగుతోంది. ఏ రంగంలో చూసినా వారి దోపిడీ ఇంకా ఆగలేదు. విభజన చట్టం ప్రకారం.. తెలంగాణకు నిర్దేషించిన విద్యుత్‌ సరఫరా చేయడంలో కుట్రలు చేస్తున్నారు. అదేకోవలో.. తెలంగాణ ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే ఆర్టీసిని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ రూపంలో కొల్లగొడుతున్నారు. తెలంగాణ ఆర్టీసికి ఇవ్వాల్సిన పర్మిట్లను ఇవ్వకుండా.. సీమాంధ్ర బస్సులను యథేచ్ఛగా డుపుతున్నారు. ఈ విధంగా రోజుకు సగటున 1500 ప్రైవేట్‌ బస్సులను నడుపుతూ.. తెలంగాణ ఆర్టీసికి దాదాపుగా రూ.3 కోట్ల మేర గండికొడుతున్నారు. ఈ దోపిడీని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యజమానులు ఏ విధంగా చేస్తున్నారు..? అందుకు ప్రభుత్వాన్ని, ఆర్టీఏను ఏ విధంగా మోసం చేస్తున్నారు..? ఆ వివరాలను తెలుసుకుందాం.

సీమాంధ్రులకే ప్రైవేట్‌ ట్రావెల్స్‌…

1987లో ఎన్టీరామారావు కాలంలో ఎపిఎస్‌ఆర్టీసి 90 శాతం వరకు జాతీయీకరణ జరిగింది. మిగతా 10 శాతం ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఉన్నాయి. అవికూడా సీమాంధ్ర రాజకీయ నాయకుల అనుచరులు, అనుయాయులు, రక్తసంబంధీకులు, సీమాంధ్ర పెట్టుబడిదారులకే ఉన్నాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక్కరంటే ఒక్కరికి ఈ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నేటికీ లేవు. అంటే వారిపెత్తనం ఏ మేరకు ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వాటితో ఆర్టీసికి సమాంతరంగా తెలంగాణ ప్రజల ఆదాయాన్ని సీమాంధ్రులు కొల్లగొట్టుకుపోతున్నారనడానికి ఇదొక నిదర్శనం. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ అన్నీ కేశినేని, పోతుల, కేళేశ్వరి, జెసి దివాకర్‌రెడ్డికి చెందిన పలు పేర్లతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి నేటి నూతన తెలంగాణ రాష్ట్రంలో కూడా చెలామణి అవుతున్నాయి. ఇవన్నీ సీమాంధ్ర రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే నడుస్తుండడం గమనార్హం.

ఇష్టారాజ్యంగా అక్రమ రవాణా…

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యజమానులు సీమాంధ్రుల రాజకీయ నాయకుల పలుకుబడిని ఉపయోగించుకుని అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. తమ బస్సులకు పర్మిట్లు లేకున్నా ఉన్నట్లు చూపించి తెలంగాణ ప్రభుత్వాన్ని, ఆర్టీఏను మోసం చేస్తున్నారు. ఒక్క బస్సుకు పర్మిట్లు తీసుకుని దానిపేర నాలుగైదు బస్సులకు వర్తింపచేసి అక్రమ రవాణా నడిపిస్తున్నారు. ఒక్క నంబర్‌తో నాలుగైదు బస్సులను తిప్పుతున్నారు. ఇలాంటి డొల్లతనం గతంలో ఆర్టీఏ అధికారులు చేసిన తనిఖీల్లో అనేక సార్లు బయటపడింది. అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకోకుండా అక్కడి రాజకీయ పెద్దలు అండగా నిలిచారు.

ప్రయాణికుల రవాణాకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు పర్మిట్లు లేవు…

ఆర్టీఏ నిబంధనల ప్రకారం… ప్రయాణికులను స్టేజిక్యారేజీ విధానంలో రవాణా చేసేందుకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు ఇప్పటికీ పర్మిట్లు లేవు. కేవలం పెళ్లిళ్లు, పేరంటాలు, ఫంక్షన్లు, రాజకీయ సభలకు ప్రజలను చేరవేసేందుకు మాత్రమే ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు పర్మిట్లు ఉన్నాయి. (స్టేజిక్యారేజీ అంటే… బస్సు బయలు దేరిన ప్రాంతం నుంచి గమ్యస్థానానికి మధ్యలో ఉండే స్టేజీల్లో ప్రయాణికులను ఎక్కించుకోవడం, దించడం అని అర్థం. అయితే ట్రావెల్స్‌కు చెందిన బస్సు బయలు దేరిన ప్రదేశం నుంచి మధ్యలో ఎక్కడా ఆగకుండా గమ్యస్థానం వరకు వెళ్లాలి.) కానీ.. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ అధిపతులు ఆర్టీఏ నిబంధనలను అతిక్రమిస్తూ స్టేజిక్యారేజీ విధానంలో ప్రజారవాణా కొనసాగిస్తున్నారు.

గల్లీకో ట్రావెల్‌ ఏజెన్సీ… ఆన్‌లైన్లో టికెట్‌ బుకింగ్‌…

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఏజెన్సీలు హైదరాబాద్‌ నగరంలో గల్లీకొకటి వెలుస్తున్నాయి. రకరకాల పేర్లతో దర్శనమిస్తున్నాయి. వాటి బుకింగ్‌ కోసం ఆన్‌లైన్‌ సెంటర్లు కూడా అదే తరహాలో పుట్టుకొస్తున్నాయి. ఏజెంట్ల ద్వారా ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేయిస్తున్నారు. తద్వారా ప్రయాణికులకు కుచ్చుటోపీ పెడుతున్నారు. అదే సందర్భంలో తెలంగాణ ఆర్టీసి ఆదాయానికి ఖన్నం వేస్తున్నారు.

సీజన్‌ను బట్టి ఛార్జీలు వసూలు…

ట్రావెల్స్‌ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల నుంచి ట్రావెల్స్‌ యాజమాన్యాలు నిర్ధిష్టమైన ఛార్జీలు కాకుండా సీజన్‌ను బట్టి వసూలు చేస్తున్నారు. పండగలు, పబ్బాలు వచ్చినప్పుడు సాధారణ రోజుల్లో ఉండే ప్రయాణ ఛార్జీలను రెట్టింపు చేసి ప్రయాణికుల ముక్కుపిండి తీసుకుంటున్నారు. దీంతో ప్రయాణికుల జేబులకు పెద్దమొత్తంలో చిల్లులు పడుతున్నాయి. వీరి దోపిడీ ప్రయాణికులకు మింగుడుపడకపోయినా తప్పని పరిస్థితుల్లో వారు నిర్ణయించిన ఛార్జీలు చెల్లించక తప్పడం లేదు.

రోజుకు రూ.3 కోట్ల ఆదాయం వెళ్లిపోతోంది…

తెలంగాణలో సీమాంధ్రులు రోజుకు సగటున 1500 ట్రావెల్స్‌ బస్సులను నడుపుతున్నారు. ఒక్కో బస్సుకు సుమారుగా రూ.20 వేల ఆదాయం వస్తోంది. ఇలా రోజుకు రూ.3 కోట్ల మేరకు తెలంగాణ ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు. ఈ లెక్క ప్రకారం ఒక్క నెలకు రూ.90 కోట్లు అక్రమంగా తీసుకుపోతున్నారు. జూన్‌ 2న తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి  అక్టోబర్‌ వరకు రూ.450 కోట్ల తెలంగాణ ఆర్టీసి ఆదాయాన్ని దోచుకెళ్లారని అర్థమవుతోంది.

ట్రావెల్స్‌ బస్సుల్లో భద్రత డొల్ల…

లాభార్జనే ధ్యేయంగా నడుపుతున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల్లో ప్రయాణికులకు భద్రత కొరవడింది. అందుకు ట్రావెల్‌ యాజమాన్యాలు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. బస్సుల ఫిట్‌నెస్‌ను పట్టించుకోరు. పైపై మెరుగులు దిద్ది ప్రయాణికులను ఆకర్షిస్తున్నారు తప్ప భద్రత విషయంలో పకడ్బంధీ చర్యలు తీసుకోవడం లేదని పలు సందర్భాల్లో జరిగిన ప్రమాదఘటనలు తెలుపుతున్నాయి. ఇద్దరు డ్రైవర్లకు ఒక్క డ్రైవర్‌తోనే బస్సు నడిపించడం. లైసెన్స్‌ క్లీనర్లతో పని చేయించుకోవడం. బస్సుల్లో సాధారణంగా 51 సీట్లు మాత్రమే ఉండాలి. ఈ సంఖ్యనే ఆర్టీఏకు చూపి పర్మిట్లు పొందుతారు. కానీ.. బస్సుల్లో సీట్ల సంఖ్యను 51 నుంచి 60, 65 వరకు పెంచుతారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడడం వల్ల తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ ప్రమాదాలు ట్రావెల్స్‌ బస్సులతోనే సంభవించడం పరిశీలించాల్సిన అంశం. దీన్నిబట్టి ట్రావెల్స్‌ బస్సుల్లో భద్రత ఎంత కట్టుదిట్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. షిరిడీ వెళ్తూ లోయలో పడిన కాలేశ్వరి బస్సు దుర్ఘటన, పాలెం వద్ద తగలబడిన బస్సు ప్రమాదం.. ఇలా చెప్పుకుంటూ పోతే ట్రావెల్స్‌ ప్రమాదాల లిస్టు చాంతాడంత ఉంది. ఇలాంటి ప్రమాదాల్లో వందల మంది తెలంగాణ బిడ్డలు ప్రాణాలు కోల్పోతే ఏ ఒక్కరి కుటుంబానికైనా ఆర్థిక సాయం చేసిన పాపానపోలేదు.

తక్షణమే తెలంగాణ సర్కార్‌ స్పందించాలి : టిఎన్‌యు

తెలంగాణలో సీమాంధ్రుల ట్రావెల్స్‌ చేస్తున్న అక్రమ రవాణాపై తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీఏ అధికారులు, ఆర్టీసి ఎండి తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని ఆర్టీసి తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. సీమాంధ్రుల దోపిడీని తెలంగాణ వచ్చాక కూడా అడ్డుకోకపోతే తెలంగాణ ఆర్టీసికి భవిష్యత్‌లో కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని ఆ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు మారంరెడ్డి థామస్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం.. సీమాంధ్రలో ఉన్న 1500 పర్మిట్లలో 750 పర్మిట్లను తక్షణమే తెలంగాణకు బదిలీ చేయాలని, ఆ స్థానంలో తెలంగాణ బస్సులను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం సీమాంధ్ర నుంచి 1500 ఆర్టీసి బస్సులు  తెలంగాణకు వస్తున్నాయి. తెలంగాణలో ఎన్ని కిలోమీటర్లలో ఎన్ని ఎపి బస్సులు తిరుగుతున్నాయో.. ఎపిలో కూడా అన్ని కిలోమీటర్లలో అన్ని తెలంగాణ బస్సులు తిరగాలి.  కానీ.. ఎపి ప్రభుత్వం విభజన చట్టం నిబంధనలను పట్టించుకోకుండా ఈ బస్సులను యథేచ్చగా నడుపుతూ తెలంగాణ ఆర్టీసి ఆదాయాన్ని భారీ మొత్తంలో దోచుకుపోతోందని విమర్శించారు. తెలంగాణలో సీమాంధ్రుల ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులను, వాటి ఏజెన్సీలను రద్దు చేసి వాటిస్థానంలో తెలంగాణ ఆర్టీసి బస్సులను నడిపేలా తెలంగాణ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాదు.. ఆర్టీసికి నష్టం చేకూర్చే ఏ ట్రావెల్స్‌ అయినా.. వారు ఏ ప్రాంతం వారైనా తమ వారిని అడ్డుకుంటుందన్నారు. తెలంగాణ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ కూడా వద్దని, కేవలం ఆర్టీసి మాత్రమే నడవాలని కోరారు.