టీహబ్ వేదికగా ” స్కిల్ మఖ్తల్ ” లోగో ఆవిష్కరణ

ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవాన లాంఛింగ్…

నియోజకవర్గ యువతకు స్కిల్స్ అందించేందుకు కృషి…
జైమఖ్తల్ ట్రస్ట్ అధ్యక్షుడు సందీప్ కుమార్ మఖ్తల.

జులై 15 (జనంసాక్షి): ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం (వరల్డ్ యూత్ స్కిల్ డే) పురస్కరించుకుని జైమఖ్తల్ ట్రస్ట్, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మఖ్తల… సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మఖ్తల్ నియోజకవర్గంలోని యువతకు స్కిల్స్ డెవలప్ మెంట్ లో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రమైన టీహబ్ వేదికగా స్కిల్ మఖ్తల్ అనే కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురావడంతోపాటు ఇందుకు సంబంధించిన స్కిల్ మఖ్తల్ లోగోను టీహబ్ వేదికగా ఆవిష్కరించారు. మక్తల్ మెమొరీ ఎక్స్ పర్ట్ శాలివాహన శ్రీనివాస్, తెలంగాణ నిక్ అవార్డు గ్రహీత లింగప్ప పాల్గొన్నారు. నియోజకవర్గంలో యువత చాలా మంది ఉపాధి లభించక సతమతమవుతున్నారని, వారికి వివిధ రంగాల్లో స్కిల్స్ డెవలప్ మెంట్ అందించి, వారిని స్కిల్ డ్ యూత్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు.

మఖ్తల్ నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులకు సైబర్ సెక్యూరిటీ మీద పూర్తి ఉచితంగా శిక్షణ అందించడంతోపాటు వారికి మల్టీ నేషనల్ సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఉద్యోగాలు సైతం కల్పించినట్లు సందీప్ కుమార్ మఖ్తల తెలిపారు. ఇక మఖ్తల్ నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలకు చెందిన స్కూల్ విద్యార్థులకు కంప్యూటర్ లిటరసీతోపాటు ఉచితంగా కోడింగ్ శిక్షణ అందించి, వారే సొంతంగా వీడియో గేమ్ లు తయారుచేసే స్థాయికి తీసుకువచ్చామని అన్నారు. ఇక మల్టీ మీడియా రంగంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా లక్షల విలువ చేసే యానిమేషన్ లో మఖ్తల్ ప్రాంత యువతకు ఉచితంగా శిక్షణ అందజేస్తున్నట్లు తెలిపారు. ఎడవెల్లి గ్రామంలోని అంగన్ వాడీ చిన్నారులకు కృత్రిమ మేథ ఆధారిత టీవీని అందించి, వారికి అంతర్జాతీయ ప్రమాణాలతో స్కిల్స్ నేర్పించే దిశగా శ్రీకారం చుట్టామని అన్నారు.

వ్యవసాయ రంగంలోని అత్యాధునిక పద్దతులపై మఖ్తల్ ప్రాంత యువరైతులను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు తీసుకువచ్చి, స్కిల్స్ పై అవగాహన , సాయిల్ టెస్ట్, ఇతర నూతన పద్దతుల గురించి వివరించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో అత్యధికంగా ఉపాధి పొందుతున్న వ్యవసాయ రంగంలో ఐటీని సైతం ఉపయోగించి, ఎక్కువ దిగుబడులు ఎలా రాబట్టాలి అనే దిశగా మరిన్ని చర్యలు చేపడుతున్నట్లు సూచించారు. ఇక హెల్త్ కేర్ రంగంలో జనరల్ డ్యూటీ అసిస్టెంట్స్ శిక్షణ అందించి, కరోనా సమయంలో నర్సులతో సమానంగా శిక్షణ అందించి, ఉపాధి కల్పించే కార్యక్రమం చేపట్టామన్నారు. అర్టిఫియల్ ఇంటలిజెన్స్ పై యువకులకు శిక్షణ అందించి, ప్రపంచస్థాయిలో రాణించేలా తర్ఫీదు ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సాంప్రదాయ నృత్యంలో శిక్షణ అందించి, హైదరాబాద్ లోని రవీంద్రభారతి వేదికగా నృత్య ప్రదర్శన గావించామన్నారు. ఇటు నియోజకవర్గంలో క్రీడల అభివృద్దికి సైతం టీటా ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

మఖ్తల్ నియోజకవర్గంలోని యువతకు ఉపాధికల్పనలో బాగంగా వారికి నచ్చిన రంగంలో అవసరమైన స్కిల్స్ అందించి, అవసరమైతే సొంతంగా ఉపాధి లేదా ఉద్యోగాలు పొందేలా సహకరిస్తున్నట్లు జై మఖ్తల్ ట్రస్ట్ అధ్యక్షుడు సందీప్ కుమార్ మఖ్తల తెలిపారు. వందశాతం స్కిల్స్ అందించి, స్కిల్ మఖ్తల్ గా తయారుచేయాలన్నదే తమ ఉద్దేశమని, ఆ దిశగా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జైమఖ్తల్ ట్రస్ట్ ప్రతినిధులు తిమ్మప్ప, తదితరులు పాల్గొన్నారు.