టీ ఎంపీల రాజీనామా తర్వాత కేంద్రంలో కదలిక

కోర్‌ కమిటీలో తెలంగాణపై చర్చ
న్యూఢల్లీి, జూన్‌ 1 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీల రాజీనామా తర్వాత కేంద్రంలో, కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానంలో కదలిక వచ్చింది. ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నివాసంలో శనివారం ఉదయం నిర్వహించిన పార్టీ కోర్‌ కమిటీ సమావేశంలో తెలంగాణ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర మంత్రులు సుశీల్‌ కుమార్‌ షిండే, చిదంబరం, ఏకే ఆంటోనీ, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ పాల్గొన్నారు. ఈ సమావేశానికి పార్టీ ఆంధప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. తెలంగాణకు చెందిన ఇద్దరు ఎంపీలు, మాజీ పీసీసీ చీఫ్‌ పార్టీని వీడడంపై సమావేశంలో చర్చించారు. తెలంగాణతో పాటు రాష్టాన్రికి చెందిన పలు అంశాలపై కోర్‌ కమిటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడి, పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. యాభై ఏళ్లుగా కాంగ్రెసులో ఉంటూ వచ్చిన కె. కేశవరావుతో పాటు ఇద్దరు పార్లమెంట్‌ సభ్యులు మందా జగన్నాథం, జి. వివేక్‌ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ స్థితిలో తెలంగాణలో పరిణామాలపై కోర్‌ కమిటీలో చర్చించారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కనుక తెలంగాణవాదానికి అనుకూలంగా ఫలితాలు వస్తే అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని, అప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అలాగే సీమాంధ్ర ప్రాంతంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రాబల్యం గురించి ఆజాద్‌ నుంచి వివరాలు సేకరించనట్టుగా సమాచారం. మరో వైపు, ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ మంత్రివర్గంలో 14 మంత్రి పదవులు ఖాళీ అయ్యాయి. వాటిని భర్తీ చేయలేదు. కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని మన్మోహన్‌ సింగ్‌ శుక్రవారం చెప్పారు. కోర్‌ కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రి వర్గ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవలే ఇద్దరు మంత్రులు బన్సల్‌, న్యాయశాఖ మంత్రి రాజీనామాలతో ఏర్పడ్డ ఖాళీలను కూడా భర్తీ చేయాల్సి ఉండటంతో వాటిపై కోర్‌కమిటీలో చర్చించారు. త్వరలో జరగబోయే ప్రత్యేక సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని అనుకున్న ప్రస్తుతానికి వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. ప్రధాని జపాన్‌ పర్యటన విశేషాలను కూడా కోర్‌ కమిటీ ఎదుట ఉంచిన ప్రధాని త్వరలో అమల్లోకి రాబోయే అణు ఒప్పందంపై చర్చించారు.