టెట్‌, ఎంసెట్‌ తేదీల ఖరారు

4

– 15న ఎంసెట్‌, 22న టెట్‌ పరీక్షలు

– షెడ్యూల్‌ ప్రకటించిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి

హైదరాబాద్‌,మే2(జనంసాక్షి):  తెలంగాణలో వాయిదా పడ్డ ఎంసెట్‌, టెట్‌ పరీక్షల తేదీలను ఖరారు చేశారు. ఎంసెట్‌, టెట్‌ కొత్త తేదీలను తెలంగాణ  ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేట్‌ విద్యాసంస్థల సహాయ నిరాకారణతో వీటిని తొలుత వాయిదా వేశారు. ఈ నెల1,2న జరగాల్సిన పరీక్షలను రీ షెడ్యూల్‌ చేశారు. మే 15న ఎంసెట్‌, మే 22న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. ఉదయం ఇంజినీరింగ్‌ విద్యార్థులకు, మధ్యాహ్నం అగ్రికల్చరల్‌, మెడిసిన్‌ విద్యార్థులకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 12నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చనితెలిపారు. ఎంసెట్‌, టెట్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 13 నుంచి టెట్‌ హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. ఎంసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షల కోసం హైదరాబాద్‌, వరంగల్‌లో సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మే 27న ఎంసెట్‌ ర్యాంకులను ప్రకటిస్తామన్నారు. జూన్‌లో ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ఉంటుందని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరాల నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యాశాఖ అధికారులతో సోమవారం చర్చించిన అనంతరం తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విూడియా సమావేశంలో తేదీలను ప్రకటించారు. ఎంసెట్‌ రాసే అభ్యర్థులు ఈ నెల 12 నుంచి, టెట్‌ అభ్యర్థులు 13 నుంచి హాల్‌ టికెట్లను నెట్లో డౌన్లోడ్‌ చేసుకోవచ్చని కడియం శ్రీహరి సూచించారు. ఈ నెల 27న ఎంసెట్‌ ఫలితాలను ప్రకటిస్తారు. జూన్‌ నెలలో ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. జూలై నుంచి ఇంజనీరింగ్‌ క్లాసులు ప్రారంభం అవుతాయి.

వాస్తవానికి ఏపీ ఎంసెట్‌ ఏప్రిల్‌ 29న నిర్వహించగా, ఆ తర్వాత సోమవారమే.. అంటే మే 2వ తేదీనే తెలంగాణ ఎంసెట్‌ నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. మే 1వ తేదీ ఆదివారం నాడు టెట్‌ నిర్వహిస్తామన్నారు. అయితే  కళాశాలలపై తెలంగాణ ప్రభుత్వం విజిలెన్సు దాడులు చేయిస్తుండటంతో.. దానిపై తెలంగాణ ప్రైవేటు  కళాశాలల యాజమాన్యాల జేఏసీ భగ్గుమంది. టెట్‌, ఎంసెట్‌ నిర్వహణకు సహకరించేది లేదని, కళాశాలలు తెరవబోమని అల్టిమేటం ఇచ్చింది. దాంతో తప్పనిసరిగా ఈ రెండు ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక ప్రభుత్వకళాశాలల్లోనే ఈ పరీక్షలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. దానికి తగినట్లుగా విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తాజా షెడ్యూలు ప్రకటించారు. ఇంతకుముందు ప్రైవేటు కళాశాలల్లో కూడా పలువురు విద్యార్థులకు సెంటర్లు ఉండటంతో, అవన్నీ మారుతాయి కాబట్టి ఈ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులంతా కొత్తగా మళ్లీ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఇచ్చిన సెంటర్‌లో మాత్రమే పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇదిలావుంటే రాష్ట్రంలో సాక్షరతా మిషన్‌, కస్తూరిబా పాఠశాలల్లో వేలాది మంది కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే తమ సంఘం ఆధ్వర్యంలో ఎంట్రెన్స్‌ పరీక్షల నిర్వహణలో సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌

ఉద్యోగుల అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రవీణ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో సంస్కరణ విషయంలో సీఎం కేసీఆర్‌ నిర్ణయం సమర్థనీయమని పేర్కొన్నారు.

పాలిసెట్‌ ఫలితాలు విడుదల

పాలిసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. పాలిసెట్‌ ఫలితాల్లో 82.57 శాతం ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. ఈనెల 20 నుంచి పాలిసెట్‌ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ పక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. జూన్‌ 9 నుంచి కాలేజీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. కాగా, ఏప్రిల్‌ 21న నిర్వహించిన ఈ పరీక్షకు 1,27,972 మంది దరఖాస్తు చేసుకోగా 1,24,747 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 82.57 శాతం అనగా 1,03,001 అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. హాజరైన బాలురు 80,123కు గాను 64,784 మంది అనగా 80.86 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 44,624 మంది బాలికలు హాజరుకాగా 38,217 మంది బాలికలు అంటే 85.67 శాతం ఉత్తీర్ణులయ్యారు.