మార్చిలోనే మండుతోంది

` తెలంగాణలో 40 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు
` ఈ సీజన్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు
` వాడగాలులు వీచే అవకాశం
` అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ హెచ్చరిక
హైదరాబాద్(జనంసాక్షి): మార్చి ప్రథమార్ధంలోనే తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్రంలో పలు చోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. గతేడాది కంటే ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ చెప్పింది. చిన్న పిల్లలు, వద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ ఏడాది అధిక వర్షపాతం, ఎక్కువ చలి తీవ్రత వల్లే ఎండలు అధికంగా ఉంటాయని పేర్కొంది.
ఈ సీజన్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు
రాష్ట్రం నిప్ప్పుల కొలిమిలా మారుతున్నది. ఈ సీజన్‌లోనే అత్యధిక గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి మొదటి వారంలోనే ఎండలు మండుతున్నాయి. రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకావం ఉందని వాతావరణ శ²ఖ హెచ్చరించింది. తీవ్రమైన ఎండలతో పాటు వడగాల్పులు వీచే అవకాశమున్నదని హెచ్చరించింది.రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2`3 డిగ్రీలు పెరుగనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ సూచించింది. తరుచుగా తగిన మోతాదులో నీరు తాగాలని సూచించారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ప్రయాణాలను తగ్గించుకోవాలని కోరారు.ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి`కొత్తగూడెం, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ కేంద్రం రెడఅలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రత 39 నుంచి 41 డిగ్రీలకు చేరిందని, రాబోయే నాలుగు రోజులు ఇవే గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని పేర్కొంది. హైదరాబాద్ నగరంలో కూడా గతంలో కంటే భిన్నంగా మార్చిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37`38 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఆదిలాబాద్ అర్బన్, ధర్మపురి, ఖమ్మం అర్బన్ ప్రాంతాల్లో 38.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 14 జిల్లాల్లో 38.5 డిగ్రీలపైనే రికార్డు అయ్యింది. మరోవైపు ఎండలు పెరుగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిదని అధికారులు హెచ్చరించారు.ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న పొడిగాలుల కారణంగానే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా యని వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణంగా మార్చి మూడో వారం తర్వాత ఎండలు పెరుగుతాయి. కానీ ఈసారి తొలి వారంలోనే వేడి తీవ్రత మొదలైంది. శనివారం ఆరు జిల్లాల్లో 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నదని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. జయశంకర్`భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, భద్రాద్రి`కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.