టెన్త్‌ పరీక్షలకు నిముషం నిబంధన

తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
నిజామాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి):  జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.ఈ నెల 27వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 44 కేంద్రాల్లో పరీక్షలు జరుగనున్నాయి.  ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన మొత్తం 38 వేల 561 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఇంటర్మీడియట్‌ బోర్డుతోపాటు పోలీస్‌, రెవెన్యూ శాఖల సహకారంతో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. పరీక్షలకు నిమిషం నిబంధన అమలు చేస్తున్నందున విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు అన్నారు. కళాశాలల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు విద్యార్థులకు ఈ విషయంలో అవగాహన కల్పించాలన్నారు. పరీక్షా కేంద్రాన్ని ఒకరోజు ముందుగానే చూసుకుంటే పరీక్ష రోజు కేంద్రాన్ని గురించి వెదుకులాడే అవసరం ఉండదన్నారు. పరీక్ష సమయానికంటే ముందుగానే పరీక్షా కేంద్రానికి వెళ్లేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా పరీక్ష సమయం కంటే ముందుగానే బయల్దేరాలన్నారు. ఒక్క విద్యార్థి కూడా ఆలస్యంగా వచ్చి, పరీక్ష రాయకుండా తిరి గి వెళ్లే పరిస్థితి రాకుండా చూడాలన్నారు. మరోవైపు పరీక్షలపై అధికారలతో  కలెక్టర్‌ ఎంఆర్‌ఎంరావు సవిూక్షించి తగు సూచనలు చేశారు.  పరీక్ష రాసే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏ పరీక్షా కేంద్రంలో విధులు కేటాయించారో అక్కడికి వెళ్లి సదుపాయాలను సరిచూసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఇంటర్మీడియట్‌ బోర్టు ఆదేశాలు, నియమ నిబంధనలను పాటించాలన్నారు.  ప్రశ్నపత్రాలు వంద శాతం సీసీ కెమెరాల పర్యవేక్షణలో మాత్రమే తెరవాలని, ఖచ్చితంగా సమయం కనిపించేలా చూడాలన్నారు. స్క్వాడ్స్‌ నిబంధనల మేరకు పనిచేయాలని, సమస్యాత్మక పరీక్షా కేంద్రాలపై దృష్టిసారించాలన్నారు.