ట్రంప్ ఫేక్ న్యూస్ అవార్డులు.. విజేతలెవరో తెలుసా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొంతకాలంగా చెప్పుకుంటూ వస్తున్న ‘ఫేక్ న్యూస్ అవార్డు’లను తాజాగా ప్రకటించారు. 2017 సంవత్సరానికి గానూ.. ఫేక్ న్యూస్ అవార్డ్ విజేత ‘ది న్యూయార్క్ టైమ్స్’ అని ట్రంప్ అన్నారు. ఈ మేరకు జీవోపీ.కామ్ వెబ్సైట్లో ఈ అవార్డుల జాబితా వివరాలను పేర్కొన్నారు. న్యూయార్క్ టైమ్స్‌తో పాటు ఏబీసీ న్యూస్, సీఎన్ఎన్, టైమ్, ది వాషింగ్టన్ పోస్ట్ కూడా ఈ అవార్డు దక్కించుకున్నట్లు చెప్పారు.
‘2017.. ఓ నిరాధార, చెత్త న్యూస్ కవరేజీ, ఫేక్ న్యూస్ నామ సంవత్సరం. 90శాతం మీడియా కవరేజీ ట్రంప్‌కు వ్యతిరేకంగానే ఉందని అనేక అధ్యయనాలు తెలిపాయి’ అని సదరు వెబ్సైట్లో పేర్కొన్నారు. ఈ వెబ్సైట్ లింక్‌ను ట్రంప్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. అయితే నిజాయతీ లేని, అత్యంత అవినీతి మీడియా కవరేజీ ఉన్నప్పటికీ.. కొందరు గొప్ప విలేకరులు కూడా ఉన్నారని.. వారిని తాను గౌరవిస్తున్నానని ట్రంప్ మరో ట్వీట్లో చెప్పుకొచ్చారు.
ట్రంప్ ప్రకటించిన అవార్డుల వివరాలు ఇలా ఉన్నాయి..
* ఈ జాబితాలో న్యూయార్క్ టైమ్స్‌కు మొదటి స్థానం ఇచ్చారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో న్యూయార్క్ టైమ్స్‌కు చెందిన పాల్ క్రుగ్మన్ ‘ఆర్థిక వ్యవస్థ ఇక ఎప్పటికీ కోలుకోదు’ అంటూ కథనం రాశారు. దానికి తొలి ర్యాంక్ ఇస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
* ఇక రెండో స్థానం ఏబీసీ న్యూస్‌కు ఇచ్చారు.
* సీఎన్ఎన్కు మూడో ర్యాంక్, టైమ్ మ్యాగజీన్‌కు నాలుగు, ది వాషింగ్టన్ పోస్ట్‌కు ఐదో స్థానం ఇచ్చారు.
అధ్యక్ష ఎన్నిల సమయం నుంచే ట్రంప్ తనకు వ్యతిరేకంగా ఉన్న మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అప్పటి నుంచే ఫేక్ న్యూస్ అనే పదం ఉపయోగించారు. ఫాక్స్ న్యూస్ మినహా మిగతా మీడియాపై ట్రంప్ కోపంగా ఉన్నారు. కావాలనే ఆ మీడియా సంస్థలు తనకు వ్యతిరేకంగా కథనాలు ప్రచురిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు అందుకే అలాంటి మీడియాకు ఫేక్ న్యూస్ అవార్డులు ఇస్తానని గతేడాది నవంబర్లోనే ప్రకటించారు.