డిపెండెంట్‌ ఉద్యోగాలు బాధితులకివ్వాల్సిందే

స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌
ఖమ్మం, ఏప్రిల్‌ 1 (జనంసాక్షి) :
భూగర్భంలోకి వెళ్లి నల్లబంగారాన్ని వెలికితీసే కార్మికులు ప్రమాదవశాత్తు మృతిచెందితే బాధితు లకు డిపెండెంట్‌ ఉద్యోగాలు ఇవ్వాల్సిం దేనని శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ఖమ్మం జిల్లాలో రెండురోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు సోమవారం కొత్తగూడెంలోని ఇల్లెందు అతిథి గృమంలో సింగరేణి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సింగరేణి నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో యాజమాన్యం సరిగా వ్యవహరించడం లేదని, పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై స్పీకర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపరితల గనుల విస్తరణ కోసం చేస్తున్న బ్లాస్టింగ్‌లు ఏ ప్రాతిపదికన చేస్తున్నారో అధికారులు నివేదిక ఇవ్వాలని కోరారు. సింగరేణి నిర్వాసితులకు కుటుంబానికి ఒక ఉద్యోగం తప్పనిసరిగా ఇవ్వాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ సింగరేణి అధికారులను ఆదేశించారు. స్పీకర్‌ కమిటీ, ఎస్టీ కమిటీ, వన్యప్రాణి సంరక్షణ, పర్యావరణ కమిటీల ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌తోపాటు ఎస్టీ కమిటీ చైర్మన్‌ రాజన్నదొర, ఉపసభాపతి భట్టి విక్రమార్క, మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ బలరాంనాయక్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.  సింగరేణి సంస్థకు వచ్చే లాభాల్లో 20శాతం నిర్వాసిత, ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధికి ఖర్చుచేయాలని, సింగరేణి ఉద్యోగాల కల్పనలో అధికారు తీరు మారాలని ఆదేశించారు.