డెక్కన్ ఛార్జర్స్‌కు ఊరట
బీసిసిఐ నిర్ణయంపై ముంబై హైకోర్ట్ స్టే
ముంబై ,సెప్టెంబర్ 17 ;ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఐపీఎల్ హైదరాబాద్ ఫ్రాంచైజీ డెక్కన్ ఛార్జర్స్‌కు ఊరట లభించింది. డిసిని రద్దు చేస్తూ బీసిసిఐ తీసుకున్న నిర్ణయంపై ముంబై హైకోర్టు స్టే ఇచ్చింది. గత నెలరోజులుగా ఛార్జర్స్ భవితవ్యంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఛార్జర్స్ తమ ఫ్రాంచైజీని తాకట్టు పెట్టి కోట్లాది రూపాయలు బ్యాంకులో రుణాలు తీసుకుంది. ఐపిఎల్ నిబంధనల ప్రకారం ఫ్రాంచైజీని తనఖా పెట్టకూడదు. అలాగే ఐదో సీజన్‌లో ఆడిన ఆటగాళ్ళకు ఛార్జర్స్ ఇప్పటివరకూ జీతాలు కూడా చెల్లించలేదు. దీంతో బీసీసీఐ సెప్టెంబర్ 15 వరకూ అన్ని సమస్యలూ పరిష్కరించుకోవాలని డిసికి అల్టిమేటం ఇచ్చింది. అయితే ఒకరోజు ముందుగానే బోర్డు ఛార్జర్స్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు వచ్చే సీజన్ కోసం కొత్త ఫ్రాంచైజీని ఎంపిక చేసుకునేందుకు టెండర్ దాఖలు చేయాలన్న యోచనలో ఉంది. ఈ పరిణామాలపై డెక్కన్ ఛార్జర్స్ ఫ్రాంచైజీ యజమాని డెక్కన్ క్రానికల్ ¬ల్డింగ్స్ లిమిటెడ్ న్యాయపోరాటానికి దిగింది. బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ముంబై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై ఇవాళ విచారించిన కోర్టు బోర్డు తీసుకున్న నిర్ణయంపై స్టే విధించింది. అలాగే సెప్టెంబర్ 24 వరకూ కొత్త ఫ్రాంచైజీ కోసం టెండర్ దాఖలు చేయకూడదని బీసిసిఐని ఆదేశించింది. విచారణలో భాగంగా ఇరు వర్గాల వాదనలు కోర్టు వినిపించారు. తాము ఛార్జర్స్‌పై వేటు ఎందుకు వేసిందీ బోర్డు తరపు న్యాయవాది వివరించారు. ఆటగాళ్లకు జీతాలు ఇవ్వకపోవడం , నిబంధనలు ఉల్లంఘించి ఫ్రాంచైజీని బ్యాంకులో తాకట్టు పెట్టడం వంటి వివాదాలను ఉదాహరణగా చూపించారు. అటు తమ ప్రస్తుత ఆర్థిక స్థితిపై డిసి వర్గాలు కూడా వాదనను వినిపించాయి. ఆటగాళ్లు జీతాలు చెల్లింపుల కోసం యెస్‌బ్యాంక్ నుండి అప్పు తీసుకుంటున్నట్టు కూడా వివరించాయి. దీంతో హైకోర్టు ఛార్జర్స్ వైపే తీర్పును వెలువరించింది.