డెప్యుటీ సీఎం రాజయ్యపై వేటు
సీఎం కేసీఆర్ కఠిన నిర్ణయం
కడియం శ్రీహరికి చోటు
పలువురు మంత్రుల శాఖల మార్పు
లక్ష్మారెడ్డికి వైద్య,ఆరోగ్యం, కడియంకు విద్యాశాఖ
జగదీశ్‌కు విద్యుత్ శాఖ
హైదరాబాద్, జనవరి 25(జనంసాక్షి) : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్యను సీఎం కేసీఆర్ మంత్రివర్గం నుంచి తప్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సిఫార్సుతో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించినట్లు ప్రకటించారు. గవర్నర్ ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువరించారు. ఆదివారం ఉదయం నుంచి క్రమంగా దీనికి సంబంధించిన పరిణామాలు వడివడిగా జరిగిపోయాయి. వైద్య ఆరోగ్యశాఖలో అవినీతి విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్న నేపధ్యంలో ఆ
శాఖను నిర్వర్తిస్తున్న డాక్టర్ రాజయ్యను పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో ఎంపీ కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
కడియం శ్రీహరికి విద్యా శాఖను కేటాయించి, మరో మంత్రి లక్ష్మారెడ్డికి వైద్య ఆరోగ్య శాఖను కేటాయించారు. ఇప్పటిదాకా విద్యాశాఖను నిర్వహింఛిన జగదీష్‌రెడ్డికి విద్యుత్‌శాఖను కేటాయించారు. స్వైన్ ఫ్లూ విజృంభనను అరికట్టలేకపోయారని రాజయ్య పేషీలోని అధికారులందరినీ తప్పించిన కేసీఆర్.. ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎంను కూడా తొలగించడం తీవ్ర నిర్ణయమేనని విశ్లేషకులు అ ంటున్నారు. అవినీతికి పాల్పడితే తన సొంత కుటుంబ సభ్యులనైనా వదిలేది లేదని కేసీఆర్ గతంలోనే ప్రకటించారు.