ఢిల్లీలో సీఎం గజి’బిజి’ అధిష్టానంతో చర్చలు

మంత్రివర్గ ప్రక్షాళణకు అనుమతివ్వాలని వినతి
కలంకిత మంత్రులను కొనసాగించాలా? వద్దా ?
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 17 (జనంసాక్షి) :
హస్తిన పర్యటనలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం రోజంతా గజి’బిజి’గా గడిపారు. పార్టీ పెద్దల తో వరుసగా సమావేశమయ్యారు. అధినేత్రి సోనియా గాంధీతో పాటు సీనియర్‌ నేతలు గులాం నబీ ఆజాద్‌, కేబీ కృష్ణమూర్తి తదితరులతో భేటీ అయ్యారు. కళంకిత మంత్రుల వ్యవహారం, రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై చర్చించారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో అభియోగాలు మంత్రుల వ్యవహారం పై ఏం చేయాలనే దానిపై కిరణ్‌ ఈ సందర్భంగా హైకమాండ్‌ నేతల సలహాలు కోరినట్లు తెలిసింది. అలాగే, తెలంగాణ ప్రాంత ఎంపీల వలస లపైనా అధిష్టానానికి నివేదిక సమర్పించినట్లు సమాచారం. కళంకిత మంత్రులను కొనసాగించాలా? లేక, తొలగించాలా? అన్న దానిపై మార్గనిర్దేశకం చేయాలని సీఎం సోనియాకు విన్నవించారు. మంత్రులను తొలగించాలని భావిస్తే.. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకు అనుమతి ఇవ్వాలని హైకమాండ్‌ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్‌ పదవుల భర్తీ, పీసీసీ సంస్థాగత మార్పుల వంటి అంశాలపైనా సత్వరమే నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు తెలిసింది.బుధవారం ఉదయం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌.. పార్టీ అధినేత్రితో సమావేశమయ్యారు. పార్టీ, ప్రభుత్వ పరిస్థితి, రాష్ట్ర వ్యవహారాలపై సీఎం సోనియాకు ఓ నివేదిక సమర్పించారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ సమావేశంలో.. ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాల గురించి వివరించిన కిరన్‌.. కళంకిత మంత్రుల వ్యవహారంలో ఏం చేయాలనే దానిపై అధినేత్రి సలహా కోరినట్లు తెలిసింది. మంత్రులను తొలగిస్తే పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే పరిస్థితి ఉందని, తొలగించకపోతే ప్రభుత్వం అప్రతిష్ట పాలయ్యే అవకాశముందని.. ఈ వ్యవహారంలో హైకమాండ్‌ మార్గనిర్దేశనం చేయాలని కోరినట్లు తెలిసింది. మంత్రులను తొలగించాలని భావిస్తే.. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకు అవకాశం కల్పించాలని విన్నవించినట్లు సమాచారం. ఎన్నికలకు మరో ఏడాది గడువే ఉన్నందున మంత్రిమండలి ప్రక్షాళనకు అనుమతివ్వాలని సోనియాకు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. పార్టీ నుంచి వలసలు, తెలంగాణ ఎంపీల వ్యవహారంపై సోనియా సీఎంను ఆరా తీసినట్లు సమాచారం. ఎంత మంది ఎంపీలు పార్టీ విడిచే అవకాశముందని అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. అలాగే, జగన్‌ పార్టీ పరిస్తితి ఏమిటని ఆరా తీసినట్లు తెలిసింది. అదే సమయంలో ముందస్తు ఎన్నికలకు వెళ్తే రాష్ట్రంలో ఎన్ని స్థానాలు గెలిచే అవకాశముందని ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీని బలోపేతం చేయాలని, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సీఎంకు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే, పార్టీ వర్గాలు మాత్రం దీన్ని ధ్రువీకరించలేదు. కళంకిత మంత్రుల వ్యవహారంలో నిర్ణయాన్ని అధినేత్రి సీఎం కిరణ్‌కే అప్పగించినట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.సోనియాతో భేటీ ముగిసిన అనంతరం సీఎం కిరణ్‌తో పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ, కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శి కృష్ణమూర్తి భేటీ అయ్యారు. అధినేత్రితో జరిగిన భేటీ వివరాలపై ఆరా తీశారు.

ఆజాద్‌తో బొత్స భేటీ

అంతకు ముందు ఢిల్లీ చేరుకున్న బొత్స పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌తో సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యవహారాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగింది. ప్రధానంగా కళంకిత మంత్రుల వ్యవహారంలో ఏం చేయాలనే దానిపై చర్చించినట్లు సమాచారం. మంత్రులను కొనసాగిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముందని బొత్స ఆజాద్‌ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిసింది. దీనిపై హైకమాండ్‌తో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు సమాచారం. అయితే, ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత ఓ నిర్ణయం తీసుకొనే అవకాశముందని ఆజాద్‌ పేర్కొన్నట్లు తెలిసింది.