తక్షణం తెలంగాణ ప్రకటించండి
లేదా మా రాజీనామాలు ఆమోదించండి
స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు
నేడు సోనియాకు లేఖ
టీ ఎంపీల నిర్ణయం
హైదరాబాద్, జనవరి 28 (జనంసాక్షి):
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ కాంగ్రెస్ ఎంపిలు తమ పదవులకు రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని ఎంపి వివేక్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపిలు సమావేశమై తెలంగాణ కోసం పార్టీ అధిష్ఠానం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాజీనామాలే శరణ్యమని నిర్ణయించారు. మంగళవారంనాడు మరోమారు భేటీ జరిపి రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటామని వివేక్ మీడియాతో అన్నారు. తమ రాజీనామాలను ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి, స్పీకర్‌కు పంపు తామని అన్నారు. స్పీకర్ పార్మెట్‌లోని రాజీనామాలు సమర్పిస్తామని అన్నారు. తెలంగాణ కోసం ఎంపి పదవులను తృణప్రాయంగా వదులుకుంటామని అన్నారు. తెలంగాణపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరితో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కేంద్రం తెలంగాణను ప్రకటించాలని అప్పుడే తాము గౌరవప్రదంగా తెలంగాణ ప్రాంతంలో పర్యటించే వీలుంటుందని అన్నారు. మరో ఎంపి మధు యాష్కి మాట్లాడుతూ పదవులకు రాజీనామాలు చేయడం గొప్ప పనికాదని అన్నారు. అయితే రాజీనామాలు చేసినంత మాత్రాన తెలంగాణ అంశాన్ని పార్లమెంట్‌లో వినిపించే నాదుడే ఉండడని, అందుకే రాజీనామాలపై ముందు వెనకలు ఆలోచిస్తున్నామని అన్నారు. తమ రాజీనామాలు చిత్తుకాగితాలాంటివని, వాటిని చెత్తబుట్టలో వేసేందుకు సిద్ధంగా ఉన్నామని మధుయాష్కి అన్నారు. తమకు తెలంగాణయే ముఖ్యమని, 2014 ఎన్నికలు కావని అన్నారు కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డిని కూడా తెలంగాణ ఉద్యమంలోకి హాజరుకావాలని కోరతామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమస్థాయి నుంచి పార్టీగా ఎదిగిందని అన్నారు. తెలంగాణ బిడ్డలుగా పార్లమెంట్‌లో పోరాటం చేసేందుకు రాజీనామాలు చేసేందుకు వెనకాడబోమని అన్నారు. తమ నిజాయితీని ఎవరూ ప్రశ్నించవద్దని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు జాగ్రత్తగా వ్యవహరించాలని శత్రువులు ఎవరో గుర్తించాలని అన్నారు.
కేశవరావు మాట్లాడుతూ తెలంగాణ విషయంలో పార్టీ అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకుంటామని అన్నారు. ముఖ్యంగా సీమాంధ్ర నేతల చెప్పుడు మాటలవల్లే అధిష్ఠానం తెలంగాణపై నాన్చుడు ధోరణి అవలంబిస్తుందని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు సమష్టిగా కలిసి ఉద్యమిస్తే వారం రోజుల్లో తెలంగాణ రాష్ట్రం వస్తుందని కేశవరావు అన్నారు. ప్రజలు తెలంగాణ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలను అనుమానించడం సహజమేనని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.