తగ్గని భానుడి భగభగలు

130 మందికిపైగా మృతి
హైదరాబాద్‌, మే 25 (జనంసాక్షి) :
భానుడి ప్రతాపానికి రాష్ట్రం అగ్నిగోళంగా మారింది. తెల్లవారక ముందు నుంచే ఎండలు మండుతున్నాయి. ఆరు గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఎండ వేడిమికి వడగాల్పులు తోడు కావడంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. గత రెండ్రోజుల్లో 600 మందికి పైగా చనిపోగా, శనివారం 130 మంది మృత్యువాత పడ్డారు. గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది. గుంటూరు జిల్లాలో 18, తూర్పుగోదావరిలో 13, ప్రకాశంలో 13 మంది, నల్లగొండలో ఎనిమిది, కృష్ణా లో 10 మంది, విశాఖ, కరీంనగర్‌ జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున, విజయనగరం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఆరుగురు చొప్పున, మెదక్‌ జిల్లాలో ఐదుగురు, నిజామాబాద్‌, అనంతపురం, ఖమ్మం, శ్రీకాకుళం జిల్లాలో నలుగురు చొప్పున, చిత్తూరు, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో ముగ్గురు చొప్పున, కడప, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు. నిజామాబాద్‌ జిల్లాలో ఓ యువకుడు బస్సులో ప్రయాణిస్తూ వడదెబ్బ సోకడంతో బస్సులోనే కన్నుమూశాడు. కరీంనగర్‌ బస్టాండ్‌ ఆవరణలో మరో వ్యక్తి మృత్యువాత పడ్డాడు. శ్రీకాకుళం జిల్లా హరిండలం కంపలో వృద్ధురాలు, విజయనగరం జిల్లా బొబ్బిలిలో యువకుడు, కడప జిల్లా వేంపల్లిలో గొర్రెల కాపరి మృతిచెందారు.
రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
భానుడి ప్రతాపానికి రాష్ట్రంలో గతంలో ఎన్నడు లేని రీతిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం రికార్డు స్థాయిలో ఖమ్మం జిల్లా మణుగూరులో 51 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ సాధారణం కంటే 4-8 డిగ్రీల మేర ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. కొత్తగూడెం, రెంటచింతలలలో 49.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయవాడలో 47, రామగుండం, కాకినాడలలో 46, నిజిమాబాద్‌ 44, నెల్లూరులో 43.5, హైదరాబాద్‌లో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండ్రోజుల పాటు ఇదే పరిస్తితి అని పేర్కొంది. రాగల 48 గంటల రవకు వడగాల్పుల తీవ్రత కొనసాగుతుందని వెల్లడించింది. పశ్చిమ, వాయవ్య దిశల నుంచి వీస్తున్న గాలుల కారణంగా రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది. మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో అధికంగా వడగాల్పులు వీచే అవకాశం ఉంటుందని ఓ ప్రకటనలో వెల్లడించింది. ఖమ్మం, వరంగల్‌, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, నల్లగొండ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.