తలతెగినా వెనక్కుపోను

cc

అనుకున్నది సాధిస్తా

2018 నాటికి కరెంటు కోతలుండవు

పెన్షన్లు అందనివారు తహశీల్దారుకు దరఖాస్తు చేయండి

ముఖ్యమంత్రి కేసీఆర్‌

కరీంనగర్‌,మార్చి2(జనంసాక్షి): అనుకున్నది సాధించే వరకు తాను నిద్రపోనని, రాష్ట్ర అభివృద్దికి పట్టుదలతో పనిచేసి అనుకున్నద సాధిస్తానని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.తనకు ఆత్మవిశ్వాసం ఎక్కువని అందుకే నమ్మకంగా పని చేస్తానని అన్నారు. తెలంగాణ రాక ముందు తాను ఢిల్లీకి వెళ్లేటప్పుడు తెలంగాణలోనే అడుగుపెడుతానని చెప్పా. చెప్పినట్లుగానే తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెట్టా. నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ.. తల తెగినా అనుకున్నది సాధిస్తానని’ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. కరీంనగర్‌ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ విూడియాతో మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అంకిత భావంతో ఉందన్నారు. పెన్షన విషయంలో తీవ్రంగా ఆలోచించి ఆలనా పాలనా లేనివాళ్ల కోసమే రూ. వెయ్యి పెన్షన్‌ ఇస్తున్నామని తెలిపారు. పెన్షన్లు రానివారు అధైర్య పడకుండా తహశీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి అర్హునికి పెన్షన్లు ఇస్తామని ఉద్ఘాటించారు. గత ప్రభుత్వాలు ఒక్కో కుటుంబానికి 20 కిలోల బియ్యం మాత్రమే ఇచ్చేవారు.. ఇప్పుడు కుటుంబంలోని ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నామని గుర్తు చేశారు. బీడీ కార్మికుల సమస్యలు తనకు తెలుసు.. వారి ఇళ్లలో ఉండి తాను చదువుకున్నానని తెలిపారు. చెరుకు రైతుల బకాయిలు త్వరలోనే చెల్లిస్తామని చెప్పారు. జగిత్యాల, మెట్‌పల్లిలో బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్నారు.. పెన్షన్లు రాని వారికి సర్పంచ్‌లు సహకరించి వారి పేర్లు నమోదు చేయాలని సూచించారు. మిషన్‌ కాకతీయ పేరిటి చెరువుల పూడికలు తీసి పూర్వ వైభవం తెస్తామని వెల్లడించారు. విూ ఊరి చెరువు నిండితే.. విూ ఊరి కడుపు నిండినట్టే అని తెలిపారు. 2017 నాటికి తెలంగాణ రైతాంగానికి ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్‌ అందిస్తామన్నారు. 2018 నాటికి రాష్ట్రంలో కరెంట్‌ కోతలు ఉండవు అని స్పష్టం చేశారు. దేశంలోనే ఆదర్శంగా ఉంది 2.3 వేల మెగావాట్ల విద్యుత్‌ను అవసరమైతే పక్క రాష్టాల్రకు అందిస్తామని పేర్కొన్నారు. వాటర్‌గ్రిడ్‌ ద్వారా 2019 లోపు పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతీ చోట పరిశుభ్రమైన మంచినీరు అందిస్తామని ఉద్ఘాటించారు.  2018 లో పుట్టిన పిల్లలకు కరెంటు కోత అంటే ఏమిటో తెలియనివ్వబోమని ఆయన ప్రకటించారు. 2017 నాటికి తెలంగాణలో రైతులకు 12 గంటల విద్యుత్‌ ఇస్తామని, అది కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా ఇస్తామని ఆయన అన్నారు. తెలంగాణ లో మరో మూడేళ్లలో ఇరవై మూడు వేల మెగావాట్ల మిగులు విద్యుత్‌ ఉంటుందని అంచనా వేస్తున్నామని ఆయన చెప్పారు. 2019లోగా ప్రతి గ్రామానికి మంచినీరు అందిస్తామని, నీళ్లు ఇవ్వకుంటే 2019లో ఓట్లు అడిగేది లేదనే మాటకు కట్టుబడి ఉంటామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ప్రభుత్వం ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సి ఉంది.. పార్టీలకతీతంగా కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. జగిత్యాలను జిల్లా కేంద్రంగా చేస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాయికల్‌లో కొమరం భీమ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చినజీయర్‌ ట్రస్టు భవన్‌ ఆధ్వర్యంలో విద్యాభవనాన్ని ఆయన ప్రారంభించార. గిరిజన ఆడిటోరియం, కల్యాణ మండపం నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. చెరకు రైతుల బకాయిలను ప్రభుత్వమే చెల్లిస్తుందని, 2017 నాటికి విద్యుత్‌ కోతలు లేకుండా చూస్తామని ఆయన తెలిపారు. 2018 నాటికి రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ సాధిస్తామన్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ల కేటాయింపు పూర్తయ్యాక జగిత్యాలను జిల్లా చేస్తామన్నారు. జిల్లాలో రూ. 10 వేల కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్లు పూర్తి చేస్తామన్నారు. రూ. 5 వేల కోట్లతో పంచాయతీ రోడ్లు పూర్తి చేస్తామని, 2019 వరకు రాజకీయాలకు అతీతంగా జిల్లాను అభివృద్ధి చేస్తామని కేసీఆర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు, కేంద్రమంత్రి జోలారం. చినజీయర్‌ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే మంగళవారం  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. జైపూర్‌లో 600 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.