తాలిపేరు ప్రాజెక్టులోకి వరద నీరు
ఖమ్మం, జూలై 12 : జిల్లాలోని చర్ల మండలంలో గల తేగడ గ్రామం సమీపంలో తాలిపేరువాగుపై నిర్మించిన ప్రాజెక్టుకు వరద నీరు వచ్చిచేరుతుంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతమైన ఛత్తీస్గఢ్లో ఆశించిన మేర వర్షాలు పడకపోవడంతో జలాశయంలోకి వరద నీరు కొద్దికొద్దిగా చేరుతుంది. గురువారం సాయంత్రానికి జలాశయ నీటి మట్టం 73 మీటర్లకు చేరుకుంది. దీంతో ఆయకట్లు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నిన్నమొన్నటివరకు ఆశించిన మేర వరద నీరు రాకపోవడంతో రైతుల్లో ఆందోళన ప్రారంభమైంది. ఎగువ ప్రాంతాల్లోనైనా ఛత్తీస్గఢ్లో తేలికపాటి వర్షాలు పడుతుండడంతో జలాశయంలోకి నీరు చేరుతుంది. దీంతో మొన్నటివరకు వెలవెలబోయిన తాలిపేరు రిజర్వాయర్ ప్రస్తుతం నీటితో కళకళలాడుతోంది. రిజర్వాయర్లోకి నీరువచ్చి చేరుతుండడంతో ఇటీవల ప్రధాన కాల్వకు సాగునీరు విడుదల చేసిన అధికారులు బుధవారం కుడికాల్వకు సాగునీటిని విడుదల చేశారు. మరో పక్క డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నందున సాగునీటి సరఫరా సవ్యంగా సాగదన్న ఆందోళనతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు పరిధిలో చర్ల, దుమ్ముగూడెం మండలంలో ఈ ఏడాది వరిసాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు.