తాలిబన్లకు సవాలు విసురుతున్న మాజీ ఉపాధ్యక్షుడు

తిరుగుబాటు చేస్తున్న అమ్రుల్లా సలేప్‌ా
కాబూల్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌ లో తాలిబన్ల రాజ్యాన్ని తట్టుకోలేక అధ్యక్షుడితోపాటు వేల మంది పౌరులు కూడా పారిపోతున్నారు. కానీ ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేప్‌ా మాత్రం తాలిబన్లకు సవాలు విసురుతున్నారు. వాళ్లపై తిరుగుబాటు చేస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ను మింగేసేంత సీన్‌ పాకిస్థాన్‌కు, పాలించేంత సీన్‌ తాలిబన్లకు లేదని అమ్రుల్లా సవాలు విసిరారు. ఉగ్ర మూకలకు తలవంచొద్దని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశాలు చట్టాలను గౌరవించాలి తప్ప హింసను కాదు. మీ చరిత్రలో అవమానాలకు, ఉగ్ర మూకలకు తలవంచారన్న తలవంపులకు తావు లేకుండా చూసుకోండి అని అమ్రుల్లా సలేప్‌ా ఆఫ్ఘన్‌ ప్రజలను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుతం తాలిబన్ల చేతుల్లో పడకుండా ఉన్న పంజ్‌షిర్‌ లోయ నుంచే అమ్రుల్లా తిరుగుబాటు ప్రారంభించారు. నన్ను నమ్మిన కోట్ల మందిని ఎప్పటికీ నిరాశ పరచను. నేను ఎప్పుడూ తాలిబన్లతో చేతులు కలపను అని కూడా అమ్రుల్లా స్పస్టం చేశారు. తాలిబన్లకు వ్యతిరేకంగా ఫైట్‌ చేసిన తన మాజీ గురువు అహ్మద్‌ షా మసౌద్‌ తనయుడితో అమ్రుల్లా చేతులు కలిపారు. ఇప్పుడీ ఇద్దరూ కలిసి తాలిబన్లపై గెరిల్లా ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఈ పంజ్‌షిర్‌ను ఇప్పటి వరకూ అటు విదేశీ శక్తులు కానీ, ఇటు తాలిబన్లు కానీ జయించలేకపోయారు. ఇప్పటికే తాలిబన్ల నుంచి బయటపడిన ఆఫ్ఘన్‌ సైన్యంలోని జవాన్లు కూడా పంజ్‌షిర్‌కు చేరుకుంటున్నారు.

తాజావార్తలు