తీరం వెంట పటిష్ట రక్షణ

నేవీ సేవలలోకి మిగ్‌-29కెే విమానాలు : ఆంటోని
పనాజీ, (జనంసాక్షి) : మిగ్‌-29కె యుద్ధ విమానాలతో కూడిన బ్లాక్‌ పాంథర్‌ దళాన్ని రక్షణమంత్రి ఏకే ఆంటోని శనివారం భారతనౌకదళ సేవలలోకి ప్రవేశపెట్టారు. గోవాలోని పనాజీ సముద్రజలాలలో విమాన వాహకనౌక ఐఎన్‌ఎస్‌ హంస ఉపరితలంపై ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇతర యుద్ధ విమానాల దళాలతో పాటు బ్లాక్‌ పాంథర్‌ దళానిక ికూడా ఐఎన్‌ఎస్‌ హంస స్థావరంగా ఉంటుంది. ఐఏఎన్‌ఎస్‌ 303గా వ్యవహరించే ఈ దాళంలో 16 యుద్ధ విమానాలు ఉంటాయి. కొత్తతరం యుద్ధ విమానంగా పరిగణిస్తున్న ఈ మిగ్‌-29కెను 2010 ఫిబ్రవరిలో భారత నౌకాదళంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత దీనిని పలు పర్యాయాలు ప్రయోగాత్మకంగా పరీక్షించి ఇప్పుడు అధికారికంగా నౌకాదళ సేవలలోకి ప్రవేశపెట్టారు. ఇది నౌకలనుంచి ప్రయోగించే విమానాల విభాగంలో అత్యంత బలమైనదని, ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యతో దీనిని అనుసంధానిస్తే భారత నౌకాదళ సామర్ధ్యం ఎన్నోరెట్లు పెరుగుతుందని అధికారులు చెప్పారు. ఈ విమానంలో అత్యాధునిక యాంటీ ఎయిర్‌క్రాస్ట్‌, యాంటీ షిప్‌ క్షిపణులు సూక్ష్మమైన బాంబులు ఉంటాయని తెలిపారు. ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య వచ్చే ఏడాది నౌకాదళ సేవలలోకి ప్రవేశపెడతారు.