తుది దశలో తెలంగాణ

అసెంబ్లీ తీర్మానం అక్కర్లేదు
మూడు రాష్ట్రాల విభజన అసెంబ్లీ తీర్మాన ప్రాతిపదికనే
ఏ నిర్ణయం వచ్చినా కట్టుబడాల్సిందే : దిగ్విజయ్‌
తెలంగాణపై నిర్ణయం జరుగుతుంది : గవర్నర్‌
హైదరాబాద్‌, జూలై 1 (జనంసాక్షి) :
తెలంగాణ అంశంపై కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ వెల్లడిరచారు. రాష్ట్ర పరిస్థితులపై హైకమాండ్‌ తీవ్రంగా ఆలోచిస్తుందని, వారం పది రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశముందని చెప్పారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులైన అనంతరం తొలిసారిగా సోమవారం హైదరాబాద్‌కు వచ్చిన దిగ్విజయ్‌సింగ్‌ గాంధీభవన్‌లో పీసీసీ కార్యవర్గ సభ్యులతో సమావేశమయ్యారు. అనంతరం ఇరు ప్రాంతాలకు చెందిన నేతలతోనూ భేటీ అయ్యారు. పీసీసీ ఆఫీస్‌ బేరర్ల సమావేశంలో దిగ్విజయ్‌సింగ్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు అడగక ముందే.. ఆయనే రాష్ట్ర విభజన అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణపై అతి త్వరలోనే హైకమాండ్‌ ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నేతలంతా కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ‘హైకమాండ్‌ అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటుంది, అధిష్టానం తీసుకొనే ఏ నిర్ణయానికైనా ఇరు ప్రాంతాల కాంగ్రెస్‌ నేతలు కట్టుబడి ఉండాలని’ స్పష్టం చేశారు. తెలంగాణ అంశంపై వారం పది రోజుల్లో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ ప్రత్యేక సమావేశం జరుగుతుందని వెల్లడిరచారు. ఈ ప్రత్యేక సమావేశంలో అధినేత్రి సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, గులాంనబీ ఆజాద్‌ తదితరులు ఈ సమావేశానికి హాజరవుతారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణలను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక భేటీలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా పాల్గొంటారన్నారు. ఆ సమావేశంలోనే తుది నిర్ణయం జరుగుతుందని, ఏ నిర్ణయం జరిగినా ఇరు ప్రాంతాల్లోని కాంగ్రెస్‌ నేతలు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. అన్ని విషయాలను ఆలోచించే నిర్ణయం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం అక్కర్లేదని పేర్కొన్నారు. గతంలో ఏర్పడిన మూడు రాష్ట్రాల కోసం ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో తీర్మానం చేసినా అది తెలంగాణ విషయంలో అవసరం లేదన్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ ఆమోదించాల్సిందేనని స్పష్టం చేశారు.
పార్టీ నేతలకు దిశానిర్దేశం
రానున్న స్థానిక ఎన్నికలు, ఆ తర్వాత జరిగే సాధారణ ఎన్నికల కోసం సన్నద్ధం కావాలని దిగ్విజయ్‌సింగ్‌ పార్టీ నేతలకు సూచించారు. స్థానిక ఎన్నికల్లో అనురించాల్సిన వ్యూహాలు, మార్గనిర్దేశకాలను వెల్లడిరచారు. తెలంగాణ, సీమాంధ్రలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన డిగ్గీ రాజా… పార్టీ పటిష్టతకు కృషి చేయాలని ఉద్బోధించారు. ఎన్నికల కోసం పార్టీని ఇప్పటి నుంచే బలోపేతం చేయాలని నేతలకు సూచించారు. జిల్లా సమన్వయకర్తలుగా ఉన్న నేతలు ప్రతి నెలా జిల్లాలకు వెళ్లి పరిస్థితిని సవిూక్షించాలని కోరారు. రాజకీయాల్లో ఉన్న వారు వ్యాపారాలు చేయకూడదని, ఒకవేళ వ్యాపారాల్లో ఉంటే మానుకోవాలని పార్టీ నేతలకు సూచించారు.
తెలంగాణపై త్వరలోనే నిర్ణయం: గవర్నర్‌
రాజమండ్రి : తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే స్పష్టమైన నిర్ణయం వెలువరించనుందని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ప్రకటించారు. అన్ని ప్రాంతాల వారికి ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం కసరత్తు జరుగుతోందని తెలిపారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన గవర్నర్‌ రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడారు. మరో వారం పదిరోజుల్లో తెలంగాణపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ నిర్ణయం తీసుకోనుందని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా, గవర్నర్‌ స్పందిస్తూ.. నిర్ణయం తీసుకొనేందుకు ముమ్మర కసరత్తు కొనసాగుతోందన్నారు. దిగ్విజయ్‌సింగ్‌ నివేదిక ఇచ్చిన తర్వాతే రాష్ట్ర విభజనపై నిర్ణయం ఉంటుందన్నారు. దిగ్విజయ్‌సింగ్‌ తన పర్యటనలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నేతలతో మాట్లాడుతున్నారని, ఆయన ఇచ్చే నివేదిక తర్వాత కేంద్ర తెలంగాణపై నిర్ణయం వెలువరించే అవకాశం ఉందన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని చెప్పారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని తాను ఆశిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ప్రశాంతంగా ఉందన్నారు. రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకొనే సమయం ఆసన్నమైందని చెప్పారు.