తెగిపోయిన బంధం

ఎన్‌డీఏ నుంచి జేడీయూ బయటకు
17 ఏళ్ల మైత్రికి రాం రాం
భాజపా మంత్రుల బర్తరఫ్‌
ఎన్‌డీఏ చైర్‌పర్సన్‌ పదవికి శరద్‌ రాజీనామా
మా ప్రస్థానం ముగిసింది : శరద్‌, నితీశ్‌
పాట్నా, జూన్‌ 16 (జనంసాక్షి) :
బీజేపీ, జేడీయూ బంధం తెగిపోయింది. ఎన్‌డీఏ నుంచి బయటకు వస్తున్నట్లు జేడీయూ ఆదివారం ప్రకటించింది. ‘బిజెపితో రాంరాం..17 ఏళ్ల స్నేహబంధానికి కటీఫ్‌.. బిజెపి జాతీయ స్థాయి పరిణామాల వల్లే వీడుతున్నాం..’ అని బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ అన్నారు. ఆదివారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ యశ్వంతరావు పాటిల్‌ను కలిశారు. ఆయనతో కొద్దిసేపు భేటీ అయ్యారు. అనంతరం జేడీయూ అధ్యక్షుడు శరద్‌యాదవ్‌, సీఎం నితీష్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు. నితీష్‌ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రధాని కావాలంటే బీజేపీ 270 స్థానాలను సాధించాల్సి ఉందన్నారు. అయితే గోవా నిర్ణయం వల్ల బీజేపీితో ఏ పార్టీ కూడా జత కట్టేందుకు సిద్ధంగా లేదని అన్నారు. బీహార్‌ బీజేపీ నేతలతో ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. తాము తీసుకున్న నిర్ణయం సరైనదో కాదో ఈ నెల 19న తేలుతుందన్నారు. 19న విశ్వాస పరీక్షకు అనుమతి ఇవ్వాలని కోరామన్నారు. బీజేపీ`జేడీయూ మధ్య పొత్తు ముగిసిందని గవర్నర్‌కు చెప్పామన్నారు. అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరానని వివరించారు. వాస్తవ పరిస్థితులకు బీజేపీ దూరమవ్వడం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని నితీష్‌ తెలిపారు. మా పొత్తుకు పునాదులైన సిద్ధాంతాలను బీజేపీ వీడడం వల్లే తాము తాజా నిర్ణయం తీసుకున్నామని అన్నారు. మా పొత్తులపై 2003లోనూ క్లిష్ట పరిస్థితులు తలెత్తాయన్నారు. మేం బీహార్‌ ప్రజల విశ్వాసం కోల్పోదల్చుకోలేదన్నారు. తమ మంత్రి మండలి సభ్యులతో పొత్తు వీడడంపై క్షుణ్నంగా చర్చించామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగుతున్న బీజేపీకి చెందిన మంత్రులను బర్తరఫ్‌ చేసినట్లు నితీశ్‌కుమార్‌ ఈ సందర్భంగా ప్రకటించారు.
17 ఏళ్ల పొత్తు ముగిసింది : శరద్‌యాదవ్‌
బీజేపీ`జేడీయూ బంధం 17ఏళ్ల నాటిది.. ఆదివారంతో ఆ బంధానికి తెరపడిరదని జేడీయూ అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌ అన్నారు. బీజేపీతో 17 ఏళ్ల పొత్తు ముగిసిందన్నారు. ఎన్డీఏ కన్వీనర్‌ పదవికి రాజీనామా చేశానని తెలిపారు. పొత్తు వీడే నిర్ణయం తామిద్దరిదే కాదని, అన్ని వర్గాల నేతలతో తమ పార్టీ నిండి ఉందన్నారు. బీజేపీతో సత్సంబంధాలను కొనసాగించేందుకు యత్నించామన్నారు. కొద్ది రోజులుగా బీజేపీలో జరుగుతున్న పరిణామాలు తమను అంతర్మధనంలోకి నెట్టాయన్నారు. ప్రస్తుత పరిణామాలు తమ 17 ఏళ్ల స్నేహబంధాన్ని బీటలు వారేలా చేశాయన్నారు. గోవా వేదికగా తీసుకున్న నిర్ణయంపై బిజెపి ముందుగా తమతో సంప్రదించలేదన్నారు. అన్ని వర్గాల నేతలతో తమ పార్టీ నిండి ఉందన్నారు. బీజేపీ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న తమ పార్టీ నేతలు ఆవేదన చెందారని అన్నారు. బీజేపీ`జేడీయూ పొత్తుపై రాత్రి నుంచి అన్ని స్థాయిల నేతలతోను సంప్రదింపులు జరిపామని తెలిపారు. బీజేపీలో వాజ్‌పేయి, అద్వానీ లాంటి నేతల మార్గదర్శనం నేడు లేదని ఆరోపించారు. బీహార్‌ అసెంబ్లీలో తమ పార్టీకి పూర్తి బలం ఉందన్నారు. జూన్‌ 19న అసెంబ్లీలో బలం నిరూపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
బీహార్‌ అసెంబ్లీలో పార్టీల బలాబలాలు ఇలా..
బీహార్‌ అసెంబ్లీలో మొత్తం సీట్లు 243.. మెజారిటీ 122.. కాగా జెడి(యు)కు 118 మంది, బిజెపికి 91మంది, ఆర్‌జెడి 22 మంది, స్వతంత్రులు ఆరుగురు, కాంగ్రెస్‌ నలుగురు, ఎల్‌జెపి ఒకరు, సీపీఐ ఒకరు చొప్పున శాసనసభ్యులు ఉన్నారు. ఇదిలాఉండగా బిజెపి తన మద్దతును ఉపసంహరించుకుంటే ప్రభుత్వం నడిపేందుకు జెడియుకు మరో నలుగురు ఎమ్మెల్యేలు కావాల్సి ఉంది. అయితే స్వతంత్రులను సంప్రదిస్తారా.. కాంగ్రెస్‌ పార్టీ ఆసరా తీసుకుంటారా అన్నది వేచి చూడాల్సిందే.
నితీష్‌ మోసం చేశారు : ఉపముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌మోడీ
‘బీజేపీ రాజకీయ చరిత్రలో ఇదొక చీకటిరోజు.. బీహార్‌ రాజకీయ చరిత్రలో ఇదొక దుర్దినం అని బీజేపీ నేత, బీహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోడీ అభివర్ణించారు. బీహార్‌ ప్రజలను నితీష్‌కుమార్‌ మోసం చేశారని ఆరోపించారు. ఆదివారం సాయంత్రం మీడియాతో సుశీల్‌కుమార్‌ మాట్లాడారు. నితీష్‌కు దమ్ముంటే తన సీఎం పదవికి రాజీనామా చేసి ప్రజా తీర్పును కోరాలని డిమాండు చేశారు. పొత్తు పదిసార్లు తెగినా మోడీ విషయంలో నిర్ణయాన్ని మార్చుకోబోమని స్పష్టం చేశారు. మైత్రి విచ్ఛిన్నానని తాము బాధపడుతున్నామన్నారు. జేడీయూను బావస్వారూప్య పార్టీగా భావించి ఇంతకాలం కలిసి పనిచేశామన్నారు. నితీష్‌ ద్రోహం చేశారన్నారు. జేడీయూ నుంచి వీడిపోవాలని బీజేపీ ఏనాడూ కోరుకో లేదని అన్నారు. ప్రధాని అభ్యర్ధిని నిర్ణయించేందుకు డిసెంబర్‌ 31వ తేదీ వరకు గడువు ఇచ్చిన జేడీయూ నేడు మాట తప్పిందన్నారు. మోడీ వ్యవహారం బీజేపీ అంతర్భాగమని గతంలోనే జేడీయూ వ్యాఖ్యానించిందని అన్నారు. బీజేపీలో ఎటువంటి చీలిక రాబోదన్నారు. తమ పార్టీ ఐక్యంగానే ముందుకు సాగుతుందన్నారు. గత ఎన్నికల్లో జేడీయూను చూసి ప్రజలు ఓట్లు వేయలేదన్నారు. అలాగే నితీష్‌కుమార్‌ జేడీయూ తరఫున సీఎం కాలేదని కూడా ఆరోపించారు. కేవలం బీజేపీ వల్లే నితీష్‌ సీఎం అయ్యారని అన్నారు. ఈ విషయాన్ని నితీష్‌ మరిచిపోయారని విమర్శించారు. జేడీయూ వైఖరికి నిరసనగా ఈనెల 18వ తేదీన రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు.