తెరాసది రైతు ప్రభుత్వం

– రైతుబంధు పథకంతో అన్నదాతల్లో ఆనందం
– పథకంపై కాంగ్రెస్‌ నేతల విమర్శలు సిగ్గుచేటు
– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం, మే14(జ‌నం సాక్షి) : తెరాసది ప్రజా ప్రభుత్వం… రైతు ప్రభుత్వం అని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం గొల్లగూడెం గ్రామంలో రైతుబంధు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ… రైతాంగ సంక్షేమమే కేసీఆర్‌ లక్ష్యమన్నారు. కేసీఆర్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హావిూలను అమలు చేసి చూపించారని, చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేసి కేసీఆర్‌ చరిత్ర సృష్టించారని తుమ్మల అన్నారు. ప్రపంచలోని ఏ దేశంలో కూడా అమలు చేయలేనటువంటి అద్భుత పథకం రైతుబంధు పథకమని, ఏడాదికి రూ.12 వేల కోట్లను రెండు విడతలుగా రైతులకు వ్యవసాయానికి పెట్టుబడిగా అందించడం జరుగుతుందని తుమ్మల పేర్కొన్నారు. రైతు లోకానికి ఇది విప్లవాత్మకమైన పథకమని కొనియాడారు. గతంలో రైతుల వద్ద నుంచే ప్రభుత్వాలు శిస్తులు వసూలు చేసేవని గుర్తుచేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం రైతులకే పంట పెట్టుబడులను అందజేస్తోందని చెప్పారు. ఇకనుంచి రైతులు నిర్భయంగా, ధైర్యంగా వ్యవసాయం చేసుకునేలా భరోసాను ప్రభుత్వం కల్పించిందని అన్నారు.
ఇందుకు మొదటి విడతలో రూ.6 వేల కోట్లు, రెండో విడతలో మరో రూ.6 వేల కోట్లు రైతులకు అందించడం జరుగుతుందన్నారు. భూరికార్డుల ప్రక్షాళన కూడా రాష్ట్రంలో 98 శాతం పూర్తయిందని అన్నారు. రైతుబంధు పథకం అమలు తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా సాగుతుందని, రైతులకు మేలు చేసే పథకంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంతోషం వ్యక్తం చేస్తుంటే తమ ఉనికి ఎక్కడ పోతుందోననే ఆందోళనతో కాంగ్రెస్‌ నేతలు ఇష్టమొచ్చినట్లు
మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ఇవ్వలేదు.. వాళ్లు కూడా ఇవ్వవద్దు అన్నట్లు కాంగ్రెస్‌ తీరు ఉందన్నారు. ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తెలంగాణ నుంచి తరిమేసేందుకు సిద్దంగా ఉన్నారని తుమ్మల తెలిపారు.
——————————-