తెలంగాణకు దళితుడే ముఖ్యమంత్రి

స్వరాష్ట్ర నాయకత్వంలో ‘కడియం’ మనకు ఆంధ్రా పార్టీలు అవసరమా?
చిరునవ్వుల తెలంగాణ సాధిస్తాం : కేసీఆర్‌
హైదరాబాద్‌, మే 15 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితుడినే ముఖ్యమంత్రి చేస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం టీడీపీ సీనియర్‌ నేత కడియం శ్రీహరి పార్టీలో చేరిన సందర్భంగా ఆయన తెలంగాణ భవన్‌లో మాట్లాడారు. తెలంగాణలో ఆంధ్రా పార్టీలు ఉండాల్సిన అవసరం ఉందా? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. ఈ విషయమై గ్రామాల్లో చర్చ జరగాలని పిలుపునిచ్చారు. ఆంధ్రా నాయకత్వంలో ఇంకెన్నాళ్లు గులాంగిరీ చేయాలో ఆలోచించుకోవాలన్నారు. తెలంగాణలో ఆంధ్రా పార్టీలను బొంద పెట్టాలని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ రాకుంటే ఆంధ్రోళ్లు మనల్ని ఉంచరని పాతాళానికి తొక్కేస్తారని కేసీఆర్‌ హెచ్చరించారు. అందుకే ఆంధ్రా పార్టీలను ఐదు కిలో విూటర్ల లోతులో భూమిలో పాతరవేయాలని సూచించారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఎట్టిపరిస్థితుల్లోనైనా సాధించి తీరుతామని కేసిఆర్‌ పేర్కొన్నారు. వరంగల్‌ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన సీనియర్‌ నేత మాజీ మంత్రి కడియం శ్రీహరితోపాటు నియోజకవర్గంలోని సుమారు పదివేల మంది కార్యకర్తలు, నాయకులు తెలంగాణా భవన్‌లో కేసిఆర్‌ సమక్షంలో టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన సమావేశంలో కేసిఆర్‌ మాట్లాడుతూ 1956కు ముందున్న తెలంగాణా రాష్టాన్న్రే కావాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. తామేం కొత్త రాష్టాన్న్రి కావాలని కోరడం లేదన్నారు. ఎంతకాలమైన టిడిపి, వైసిపిలలో తెలంగాణాకు చెందిన వ్యక్తి పార్టీ అధ్యక్షుడుగాని, సిఎంగాని కాలేడన్నారు. తెలంగాణా విముక్తికోసం టిఆర్‌ఎస్‌లో చేరితే రాజకీయ వ్యభిచారం ఎలా అవుతుందన్నారు. తెలంగాణా రాకుంటే మనల్ని సీమాంధ్రులుబొందపెడతారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పేరుకే జాతీయ పార్టీ కాని సీమాంధ్రుల పెత్తనంలోనే ఉందన్నారు. ఇన్నేళ్ల సమిష్టి పాలనలో మనవాళ్లు నాలుగేళ్లు కూడా సిఎంలుగా లేరన్నారు. కడియం తెలంగాణాకు ముందుండి ఉద్యమాన్ని నడిపించాలన్నారు. భారత జాతి గర్వించతగిన స్టేజ్‌లో కడియం ఉంటాడన్నారు. కడియం లాంటి నాయకుడు తన పక్కన ఉండేందుకు ఉద్యమంలోకి రావడం తనకు వెయ్యి ఏనుగుల బలంనిచ్చిందని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌లోగాని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతగానీ కడియంకు ఒక ఉన్నత స్థానం ఉంటుందని, ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్‌ కడియం అనుచరులకు హావిూ ఇచ్చారు. కడియంను రాజకీయ వ్యభిచారి అని కొందరు సన్నాసులు అంటున్నారని, తెలంగాణ తల్లి విముక్తి కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్‌ఎస్‌లోకి రావడం రాజకీయ వ్యభిచారం ఎలా అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి అన్న మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం టీఆర్‌ఎస్‌లోకి వచ్చారని కేసీఆర్‌ తెలిపారు. కడియం సారధ్యంలో తెలంగాణ ఏర్పడ్డాక అనేక కార్యక్రమాలు చేపడతామన్నారు. దళిత నాయకుడిగా ఆయనకు ప్రజల కష్టసుఖాలు తెలుసన్నారు. తెలంగాణాలో రైతులకు ఉదయం పూట 8గంటల విద్యుత్‌ అందిస్తామన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో పదివేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి చూపిస్తామన్నారు. 18నెలల్లో పూర్తిచేస్తామన్న దేవాదుల ప్రాజెక్టు 40ఏళ్లయినా పూర్తయ్యే పరిస్థితి లేదన్నారు. అందుకే తెలంగాణా రాష్ట్రం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈతరం బిడ్డలుగా తెలంగాణా తెచ్చుడు ఖాయం అన్నారు. తెలంగాణాకోసం ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 20కోట్ల మైనస్‌ బడ్జెట్‌లో ఆంద్రా ఉండేదని, నెహ్రూను లొంగదీసుకుని తెలంగాణాను కలుపుకున్నారన్నారు. ఢిల్లీని శాసించి తెలంగాణా తెచ్చుకోవాల్సినవసరం ఉందన్నారు. వచ్చిన తెలంగాణాను జగన్‌, చంద్రబాబు రాత్రికి రాత్రి ఏకమై అడ్డుకున్నారని ఆరోపించారు. ఈవిషయం ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. తెలంగాణా వచ్చాక ప్రతిఒక్కరికి కేజినుంచి పిజి వరకు ఉచిత నిర్బంద విద్యను కల్పిస్తామన్నారు. కృష్ణానదిలో తెలంగాణా వాటా ఎంత అంటే చెప్పే పరిస్థితిలో చంద్రబాబు లేడన్నారు. అలాగే కృష్ణానదిపై ఏ ప్రాజెక్టు కడుతరో కూడా చెప్పే పరిస్థితిలో లేరన్నారు. తెలంగాణాకోసం ప్రతిఒక్కరు కూడా కరుడు గట్టిన సైనికుల్లా పోరాటం చేయాల్సిన వసరం ఉందన్నారు. కడియం చేరికతో తనకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లయిందన్నారు. ఈ కార్యకర్మంలో విజయశాంతి, హరీశ్‌రావు, మధుసూధనాచారి, ఈటెల రాజేందర్‌, ఎమ్మెల్యే రాజయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ నినాదాలతో కార్యక్రమం మార్మోగింది.
ప్రజల ఎజెండా మారింది : కడియం
తెలంగాణ కోసమే తాను టిఆర్‌ఎస్‌లో చేరానని మాజీమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. ప్రజల ఎజెండా మారిందని, ఇప్పుడు ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారని అందుకే టిఆర్‌ఎస్‌లో చేరానన్నారు. గతంలో ఎన్టీఆర్‌ టిడిపి పెట్టినప్పుడు సామాజిక న్యాయం జరిగిందని, బడగు బలహీనవర్గాలను ప్రోత్సహించారన్నారు. అయితే ఇప్పుడు ప్రజల ఎజెండా మారడంతో తాము కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మారాల్సివస్తోందన్నారు. బుధవారం నాడిక్కడ ఆయన తన అనుచరులతో కలసి తెలంగాణ భవన్‌లో కెసిఆర్‌ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. 1983లో ప్రజలు సామాజిక న్యాయాన్ని కోరుకున్నందున టీడీపీలో చేరానని, ఇప్పుడు తెలంగాణ రాష్టాన్న్రి కోరుకుంటున్నందున టీఆర్‌ఎస్‌లోకి చేరుతున్నానని కడియం స్పష్టం చేశారు. తెలంగాణ సాధనలో గత 13 ఏళ్లుగా కెసిఆర్‌ చేస్తున్న ఉద్యమంతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాట సాధ్యమవుతుందని నమ్మి ఇక్కడ చేరామన్నారు. నాకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీ కంటే నాకన్న భూమి తెలంగాణ తల్లి ముఖ్యం అని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. తెలంగాణ తల్లి విముక్తి కోసం సైనికుడిలా పనిచేస్తానని కడియం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక లక్ష్యంగా పనిచేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ సాధించుకోవాలనే టీఆర్‌ఎస్‌లో చేరానని కడియం తెలిపారు. తన రాక పార్టీకి ఉపయోగపడుతుందే తప్ప ఉద్యమానికి నష్టం చేకూర్చదని హావిూ ఇచ్చారు. కెసిఆర్‌ తనను ఎలా ఉపయోగించుకున్నా ఉద్యమంలో కీలంగా ఉంటానన్నారు. తెలంగాణ సాధన కోసం టీఆర్‌ఎస్‌లో చేరడం ఇప్పటికే ఆలస్యమైందని కడియం అన్నారు. న్నాళ్లు టీడీపీలో ఉన్నానని, తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం ప్రాణాలు కోల్పోతుంటే చలించిపోయానని, ఇక ఆలస్యం చేయడం తగదని ఉద్యమ పార్టీలోకి వచ్చానని తెలిపారు. తెలంగాణ ప్రజలు ప్రస్తుతం తెలంగాణ రాష్టాన్న్రి కోరుకుంటున్నారని అందుకే తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని కడియం పేర్కొన్నారు. వివిధ పార్టీలలో ఉన్న తెలంగాణ నేతలు తెలంగాణను అడ్డుకున్న ఆంధ్రా పార్టీలను నమ్ముకుంటే ఆత్మవంచనే అవుతుందని కడియం అన్నారు. ఇప్పటికైనా మించిపోయిందిలేదని, తెలంగాణపై ప్రేమ ఉంటే, తెలంగాణ ప్రజలపై అభిమానం ఉంటే టీడీపీ, కాంగ్రెస్‌, వైఎస్సార్సీపీల్లో ఉన్న తెలంగాణ నేతలు టీఆర్‌ఎస్‌లోకి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాధన కోసం అందరూ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. సీమాంధ్ర పార్టీలు ఎన్నటికైనా తెలంగాణను అడ్డుకుంటాయే తప్పా తెలంగాణకు అనుకూలంగా మాట్లడవని చెప్పారు. ఇద మనకున్న అనుభంగా గుర్తించాలన్నారు. తెలంగాణ సాధనలో టిఆర్‌ఎస్‌కు ఉన్న చిత్తశుద్ది ఇతర పార్టీలకు లేదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్న నాయకుడు కేసీఆర్‌ అని, ఎవరెన్ని మాట్లాడినా, విమర్శలు చేసినా సరే కేసీఆర్‌ ద్వారానే తెలంగాణ రాష్ట్ర కళ సాకారమవుతుందని అన్నారు. కేసీఆర్‌ తెలంగాణ సాధించి తీరుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అందుకే తాను ఉద్యమపార్టీలోకి వచ్చానని వివరించారు. కెసిఆర్‌ గత 13 ఏళ్లుగా చేస్తున్న ఉద్యమమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రతి పార్టీకి ఒక ఎజెండా ఉంటుందని ఆ ఎజెండాలో వివిధ అంశాలు ఉంటాయని కడియం అన్నారు. కానీ టీఆర్‌ఎస్‌కు మాత్రం ఒకటే ఎజెండా ఉందని అది తెలంగాణ రాష్ట్ర సాధన అని వివరించారు. కొన్ని పార్టీలు తమ పార్టీ ఎజెండాలో ఉన్న పది అంశాల్లో తెలంగాణ అంశాన్ని ఒక అంశంగా చేర్చాయి కావచ్చుగానీ, టీఆర్‌ఎస్‌కు మాత్రం తెలంగాణ సాధన ఒకటే ఎజెండా వివరించారు. ఈ కార్యక్రమంలో కెసిఆర్‌తో పాటు విజయశాంతి, మధుసూధనాచారి, ఎమ్మెల్యే రాజయ్య, హరీష్‌ రావు తదితరులు పాల్గొన్నారు. కడియం శ్రీహరి నాయకత్వం వర్థిల్లాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.