తెలంగాణకు ప్రత్యామ్నాయం లేదు

ఇదే ప్రజల ఆకాంక్ష.. టీ కాంగ్రెస్‌ సభ తీర్మానం
అవసరమైతే పదవులు వదులుకుంటాం
పోటీ చేయబోమని సోనియా ముందు ప్రతిపాదన పెడతాం : జానా
తెచ్చేది ఇచ్చేది కాంగ్రెస్సే
ప్రత్యేక రాష్ట్రం ఇస్తే 15 సీట్లు ఖాయం : వీహెచ్‌
ఇక తెగతెంపుల సమయం : గుత్తా
హైదరాబాదే తెలంగాణ రాజధాని : దామోదర, డీఎస్‌

హైదరాబాద్‌, జూన్‌ 30 (జనంసాక్షి) :
‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చేది, తెచ్చేది మేమే, ఇదే ప్రజల ఆకాంక్ష.. ఈ మేరకు త్వరలోనే కేంద్రం నుంచి నిర్ణయం రాబోతోంది. ప్రజల ఆకాంక్ష నెరవేరబోతోంది. కాంగ్రెస్‌ అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తోంది. అధినేత్రి సోనియాగాంధీ పుట్టిన రోజు కానుకగా హామీనిచ్చిన మేరకు తెలంగాణ త్వరలోనే ఏర్పడబోతోంది. హైదరాబాద్‌ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణే సాక్షాత్కరించబోతోంది’ అంటూ ఆదివారం నిజాం కళాశాల గ్రౌండ్స్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు నిర్వహించిన తెలంగాణ సాధన సభ నినదించింది. సభలో మాట్లాడిన పలువురు వక్తలు ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఈ మేరకు సభలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ ఒకేఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారు.సభా వేదికపై కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు ఆశీనులయ్యారు. కేంద్ర మంత్రులు బలరాం నాయక్‌, సర్వే సత్యనారాయణ, ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, వి.హనుమంతరావు, రాపోలు ఆనందభాస్కర్‌, గుత్తా సుఖేందర్‌, రాజయ్య, ఎంపీలు అంజన్‌ కుమార్‌ యాదవ్‌, రాజగోపాల్‌రెడ్డి ప్రసంగించారు. అలాగే ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, డీకే అరుణ, సుదర్శన్‌రెడ్డి, ప్రసాద్‌ కుమార్‌, శ్రీధర్‌బాబు, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రెడ్యానాయక్‌ కూడా ప్రసంగించారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణ, మాజీ స్పీకర్‌ సురేష్‌ రెడ్డి, పిసిసి మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ కూడా ప్రసంగించారు.మన గుండె చప్పుడు తెలంగాణ.. జై తెలంగాణ.. జై కాంగ్రెస్‌.. మన నినాదం అని మంత్రి డి.శ్రీధర్‌బాబు ఉద్బోధించారు. ఆదివారం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమైన తెలంగాణ సాధన సభలో ఆయన స్వాగతోపన్యాసం ప్రసంగించారు. సభకు రాష్ట్ర మంత్రి జానారెడ్డి అధ్యక్షత వహించారు. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, సోనియా నాయకత్వంలోనే తెలంగాణ సాధిస్తామని అన్నారు. జాతీయ పార్టీ కాంగ్రెస్‌తోనే తెలంగాణ సాధ్యమన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే సభ నిర్వహించామన్నారు. అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందన్న విశ్వాసం తమకు ఉందన్నారు.
తెలంగాణ ఇస్తే 15 సీట్లు తెస్తాం : వీహెచ్‌
తెలంగాణ ఇస్తే పదిహేను ఎంపీ సీట్లు తెస్తామని సోనియాగాంధీకి రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు హామీనిచ్చారు. అన్నదమ్ముల్లా విడిపోదాం.. ప్రేమాభిమానాలతో కలుసుద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణపై కేంద్రంలో కసరత్తు జరుగుతుంటే దాన్ని అడ్డుకునేందుకు మరోమారు సీమాంధ్ర నేతలు తమ తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారన్నారు. వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అడ్డుకోవద్దు.. సహకరించండి అని కోరారు. రాష్ట్రం విడిపోతేనే అందరికీ మేలు చేకూరుతుందన్నారు. ఆయన తెచ్చేది కాదు.. ఇచ్చేది కాదు.. తెలంగాణ ఇస్తే ఆయన ఇంటిముందు ఒక్కరు కూడా ఉండరు అని వీహెచ్‌ అన్నారు. తెలంగాణ ఇస్తే సోనియాకు, రాహుల్‌కు మంచి పేరు వస్తుందని అన్నారు.
హైదరాబాద్‌తో కూడిన.. : ఎంపీ అంజన్‌
తమకు హైదరాబాద్‌తో కూడిన తెలంగాణయే కావాలని సికింద్రాబాద్‌ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ తప్ప తమకు మరొకటి వద్దని అన్నారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను తెలియజేయడమే సభ లక్ష్యమన్నారు. ఇచ్చేది, తెచ్చేది కాంగ్రెస్‌ పార్టీయేనని అన్నారు.కేసీఆర్‌ది అమావాస్య.. పౌర్ణమి పోరాటమని అభివర్ణించారు.
విడిపోదాం.. నిలబడదాం : డీఎస్‌
అన్నదమ్ముల్లా విడిపోదాం.. ప్రేమాభిమానాలతో నిలబడదాం అని పిసిసి మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్‌ అన్నారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనూ, ఎంపీలు పార్లమెంట్‌లోనూ తమ నిరసన తెలియజేస్తూ పోరాటాలు నిర్వహించారన్నారు. పార్టీ నాయకత్వంపై విశ్వాసం పెట్టి వారు తమ పోరాటాన్ని కొనసాగించడం అభినందనీయమన్నారు. వేదికపై ఆశీనులైన నేతలు తమ ఐక్యతను చాటుకోవడం గొప్ప విషయమన్నారు. ప్రధాని, అధినాయకత్వాన్ని తెలంగాణపై ఒప్పించేందుకు పదేళ్ళుగా ఒప్పిస్తూనే ఉన్నామన్నారు. ప్రతి పల్లె నుంచి కాంగ్రెస్‌ కార్యకర్తలు తరలిరావడం అభినందనీయమన్నారు. తెలంగాణ ఇవ్వడమన్నది కాంగ్రెస్‌ తప్ప ఎవరివల్ల కాదన్నారు.
కాంగ్రెస్‌ పార్టీ నెరవేరుస్తుంది : డీకే
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను పార్టీని నెరవేర్చనున్నదని మంత్రి డికె అరుణ అన్నారు. అయితే ఎన్నికలలోపే ఆ ఆకాంక్షను నెరవేర్చాలని అధిష్టానాన్ని కోరుతున్నానన్నారు. తెలంగాణ వచ్చే సమయం ఆసన్నమైందన్నారు.
ఒక్కటే ఆలోచన : వనమా
సభను విజయవంతం చేసేందుకు అందరినీ అభినందిస్తున్నానని ఖమ్మం జిల్లా నేత వనమా వెంకటేశ్వర్లు అన్నారు. తెలంగాణ వచ్చే సమయం ఆసన్నమైందన్నారు. ఒక్కటే ఆలోచన.. ఒకే లక్ష్యం.. జై తెలంగాణ అంటూ నినాదంచేసి ప్రసంగాన్ని ముగించారు.
ఉప్పెనలా వచ్చారు : గీతారెడ్డి
ఆకాంక్షను తెలియజేసేందుకు ఉప్పెనలా తరలిరావడం అభినందనీయమని మంత్రి గీతారెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీలు విమర్శించినా.. అవహేళన చేసినా కూడా తెలంగాణ కోసం తాము కృషి చేస్తూనే ఉన్నామని అన్నారు. 1994లో పివి ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకు తెలంగాణ ఆకాంక్షపై కొందరితో కలిసి వినతిపత్రం అందజేశామన్నారు. అలాగే, 2003లో సోనియాగాంధీకి, 2010, 2011లలో కూడా అధిష్టానానికి వినతిపత్రాలు అందజేశామన్నారు. సకల జనుల సమ్మె సమయంలో తమ పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ఆకాంక్ష కోసం పోరాడామన్నారు. ఆ సమయంలో ఒక్కరోజు కూడా సచివాలయానికి వెళ్ళలేదన్నారు. మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉంటూ తెలంగాణ విషయంలో అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నామని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ ఇచ్చే విషయంపై కేంద్రం అనుకూలంగా ఉందని, త్వరలోనే తుదినిర్ణయం వెలువడే అవకాశం ఉందని అన్నారు.
సోనియాపట్ల విశ్వాసం : రాజగోపాల్‌రెడ్డి
యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ తెలంగాణను ఇస్తుందన్న విశ్వాసం తమకు ఉందని ఎంపి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చే సత్తా కాంగ్రెస్‌ పార్టీకే ఉందన్నారు. సోనియా నాయకత్వంలోనే తెలంగాణ వచ్చి తీరుతుందని అన్నారు.
15, 16 సీట్లు ఖాయం : రెడ్యానాయక్‌
సోనియాగాంధీ మహానేత.. కదిలిరావమ్మ.. తెలంగాణ ఇయవమ్మ అని తెలంగాణ ప్రజల
తరఫున కోరుతున్నానని మాజీమంత్రి రెడ్యానాయక్‌ అన్నారు. నాలుగు కోట్ల మంది ప్రజలు నీకేసి చూస్తున్నారు.. నీ నిర్ణయం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అని సోనియాగాంధీనుద్దేశించి రెడ్యానాయక్‌ మాట్లాడారు.
సోనియా సారధ్యంలోనే : షబ్బీర్‌ అలీ
సోనియా సారధ్యంలోనే తెలంగాణ వస్తుందని పిసిసి ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ అన్నారు. తెలంగాణను సోనియాగాంధీ తప్ప మరెవ్వరూ ఇవ్వలేరని అన్నారు. ఉర్దూలో ప్రసంగించమని మంత్రి జానారెడ్డి కోరడంతో ఉర్దూలోనే మాట్లాడుతున్నానని అన్నారు.
సోనియాకు అంతా తెలుసు : పొన్నాల
రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమం గురించి సోనియాగాంధీకి తెలుసునని మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఆమె నెరవేరుస్తారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను తెలుపుతూ తీర్మానం ప్రవేశపెడుతున్నానన్నారు. తీర్మానానికి ఆమోదం తెలపాలని వేదికపై ఆశీనులైన అతిరథులను, ప్రజలను కోరారు.
విశ్వాసం ఉంది : సునీతా
తెలంగాణను సోనియాగాంధీ ఇస్తారన్న విశ్వాసం తనకుందని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉందని అన్నారు.
ఇది ఆఖరిపోరాటం : కోమటిరెడ్డి
ఇది ఆఖరి పోరాటమని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అధిష్టానానికి తెలియజేసినందుకు నేడు రెండు లక్షల మందికిపైగా తరలిరావడం అభినందనీయ విషయమన్నారు. త్వరలోనే కోటి మందితో విజయోత్సవ సభ నిర్వహించుకునేందుకు ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. తెలంగాణపై నిర్ణయం వెంటనే తీసుకోవాలని అధిష్టానాన్ని కోరారు. ఆలస్యమయ్యే కొద్ది ఆత్మబలిదానాలు పెరుగుతున్నాయన్నారు. మొన్న ఒకరు.. నిన్న ఒకరు ఆత్మబలిదానం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. అవసరమైతే త్యాగాలకు సిద్ధమవుదాం.. తెలంగాణ సాధించుకుందామని పిలుపునిచ్చారు.
ఆత్మబలిదానాలొద్దు : దామోదర
తెలంగాణ ఉద్యమం ఆత్మగౌరవం కోసం కొనసాగుతోందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. తెలంగాణ ప్రాంతానికి గొప్ప చరిత్ర.. తెలంగాణది గొప్ప సంస్కృతి.. తెలంగాణది 70 ఏళ్ళ ఉద్యమ చరిత్ర. 1940 నుంచి తెలంగాణ కోసం ఉద్యమం కొనసాగుతూనే ఉంది. తెలంగాణకు ఘనచరిత్ర ఉంది. హైదరాబాద్‌కు 400 ఏళ్ళ చరిత్ర ఉంది. తెలంగాణ మతసామరస్యానికి ప్రతీక. తెలంగాణ ఇచ్చే విషయంలో సమస్యలేమీ లేవు. కానీ సృష్టిస్తున్నారు. మూడువేల ఏళ్ళ చరిత్ర తెలంగాణ సొంతమని.. ప్యాకేజీలకు సంబంధించిన అంశం కాదని.. ఆస్థిత్వానికి, ఆత్మగౌరవానికి సంబంధించిందని అన్నారు. 56 ఏళ్ళ సమైక్య పాలనలో 44 ఏళ్ళుగా పరిపాలిస్తున్నది సీమాంధ్రులేనని అన్నారు. కేవలం 12 ఏళ్ళు మాత్రమే తెలంగాణ వ్యక్తులు ముఖ్యమంత్రులుగా పనిచేశారన్నారు. ఆత్మబలిదానాలు చేసుకోవద్దని యువకులకు పిలుపునిచ్చారు. బతికి ఉండి కొట్లాడి తెచ్చుకుందామని అన్నారు. అయినప్పటికీ తెలంగాణను సోనియాగాంధీ ఇస్తారన్న నమ్మకం తనకు ఉందని అన్నారు. ఆమె నాయకత్వంలోనే తెలంగాణ తప్పకుండా వస్తుందని అన్నారు. తెలంగాణ ఇవ్వడమన్నది సోనియావల్లే సాధ్యమవుతుందని అన్నారు. పరస్పరం గౌరవించుకుందాం.. ప్రాంతాల వారీగా విడిపోదాం.. రాష్ట్రాలుగా ఎదుగుదాం.. అభివృద్ధి చెందుదాం అని పిలుపునిచ్చారు.
పోరాటం కొనసాగిస్తాం..తెలంగాణ సాధిస్తాం
మంత్రి జానారెడ్డి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఖాయం.. త్వరలోనే ఏర్పడుతుంది అని రాష్ట్ర మంత్రి జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిజాం కళాశాల గ్రౌండ్‌లో జరిగిన తెలంగాణ సాధన సభ ముగింపు సందర్భంగా ఆయన ప్రసంగించారు. తెలంగాణ కోసం పోరాటం కొనసాగిస్తునే ఉంటామన్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. సోనియాగాంధీ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం వారిలో వ్యక్తమవుతోందన్నారు. తెలంగాణ ప్రాంతంలోని నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష నెరవేరే రోజు సమీపంలోనే ఉందని అన్నారు. తప్పకుండా వారి ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేరుస్తారన్న విశ్వాసం తనకు ఉందని అన్నారు. అనేక రాష్ట్రాలు ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ .. అదేవిధంగా తెలంగాణను కూడా ఏర్పాటు చేస్తుందని అన్నారు. సామాజిక న్యాయం కోసం పోరాడిన ఖిల్లా.. జానపదాలకు నిలువుటద్దం తెలంగాణ ప్రాంతం అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడిన తరువాత ఆ ప్రాంతం వివక్షకు గురైందన్నారు. ఒప్పందాల ఉల్లంఘన జరిగిందని సంఘాలు, సంస్థలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక ఉద్యమాలను చేపట్టాయన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం గత 57 సంవత్సరాల నుంచి కొనసాగుతునే ఉన్నదన్నారు. 1956 నుంచి కొండా వెంకట రంగారెడ్డి, చెన్నారెడ్డి, ఇంద్రా రెడ్డి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేశారన్నారు. శాసనసభలోను, శాసనమండలిలోను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తీర్మానం చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని అన్నారు. తెలంగాణ కోసం పార్టీ అధిష్టానాన్ని ఎదిరిం చడానికి కూడా వెనుకాడలేదన్నారు. ప్రజల ఆకాంక్ష, నాయకుల పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త్వరలోనే జరగనున్నదన్న విశ్వాసాన్ని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత సుస్థిరతకు మారుపేరుగా నిలుస్తుందని అన్నారు. దేశంలోనే ఒక మోడల్‌గా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని అన్నారు.
అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకే సభ: పొన్నం
ఎన్నికలు తెలంగాణ సాధన సభకు ఎలాంటి సంబంధం లేదని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. కేవలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తమ లక్ష్యమన్నారు. అధికార పార్టీలో ఉండి కూడా తాము ఎవరికీ నెరవకుండా ఉద్యమంలో పాల్గొంటున్నామని, ఈ సమయంలో అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు తాము ఈ సభను నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ కోసం కాంగ్రెస్‌ కార్యకర్తలే కాకుండా తెలంగాణవాదులు కూడా తమతో కలిసిరావాలని సంఘటితంగా ఉద్యమం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ అంశంలో వివిధ రాజకీయ పార్టీల తీరువల్లే రాష్ట్ర ఏర్పాటు ఆగిపోయిందన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఆ హామీని నెరవేరిస్తేనే పార్టీకి బలం పెరుగుతందన్నారు. ప్రత్యేక రాష్ట్రం తప్ప మరే ప్రత్యామ్నాయానికి తెలంగాణ ప్రజలు అంగీకరించే ప్రశ్నే లేదన్నారు. హైదరాబాద్‌ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ తప్ప ప్యాకేజీలు, రాయల తెలంగాణ అంటే ప్రజలు ఎంత మాత్రం సహించరని ఆయన స్పష్టం చేశారు.
7న సైఅన్నవారు, 9న నై అనడం వల్లే ఆలస్యం :సర్వే
ఆదినుంచే తాను చెపుతూ వచ్చానని, కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సభలు నిర్వహించాల్సిందని నేతలకు గుర్తుచేశానని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ పేర్కొన్నారు. హైదరాబాద్‌ నిజాం కళాశాల మైదానంలో జరిగిన సమావేశంలోసర్వే మాట్లాడుతూ తెలంగాణాకోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సోనియా గాందీ దృష్టికి తీసుకెళ్లగానే స్పందించి తానిచ్చిన వాగ్దానం గుర్తుందని చెప్పారని ఆయన పేర్కొన్నారు. టెన్‌ జనపథ్‌లో ఉన్నవారికందరికి బహుమతి ఇవ్వాలని కోరగా అందుకు సరేనని అర్దరాత్రిలోగానే ప్రకటించిందన్నారు. రోశయ్య కాంగ్రెస్‌ పార్టీ ఇవ్వదు సోనియా గాంధీ ఇవ్వదని అనుకుని టిడిపి, సీమాంధ్రనేతలు, పిఆర్‌పి, వైసిపి నేతలు 7న సై అన్న వారు 9న నై అన్నారన్నారు. ఆపార్టీల వైఖరిన తెలంగాణా ప్రజలు గర్తుంచుకోవాలన్నారు. ప్రజలు గర్విస్తున్నారని చెప్పగా, తొందర పడకుండ్రని వాగ్దానం చేశారన్నారు. యావత్‌ ప్రపంచం సోనియా నాయకత్వం వైపు చూస్తున్నారన్నారు. పెన్ను బహుమానం ఇచ్చినా ఎవరు వెనక్కి పోరని, ఇందులో సోనియాగాంధీ తప్పకుండా ఇస్తుందన్నారు. ఆమె చెపుతున్న అప్రాప్రియేట్‌ టైం అప్రాప్రియేట్‌ డిసేషన్‌ అనే విషయం చెప్పేందుకు ప్రయత్నించామన్నారు. కేసిఆర్‌, ఆంధ్రావాలే బాగో, తెలంగాణా వాలే జాగో అన్నందుకు సీమాంధ్రులంతా వ్యతిరేకం చేశారన్నారు. ఆస్లోగన్‌ కాంగ్రెస్‌ది కాదన్నారు. అందరు ఉండొచ్చని, ఉద్యోగాలు చేసుకోవచ్చన్నారు. ఇప్పటికే కర్నాటక, ఢల్లీి, రాజస్థాన్‌ తదితరులతోపాటు దేశ విదేశాలకు చెందిన ప్రజలు జీవిస్తున్నారన్నారు. తప్పుడు సంకేతాలివ్వవద్దన్నారు. 2004లో తెలంగాణా ఇస్తుందని కాంగ్రెస్‌పై సీమాంద్రులకు తెలిసినా కూడా మెజార్టీ సీట్లు వచ్చాయన్నారు. సీమాంద్ర ప్రజలు కూడా అధైర్య పడొద్దన్నారు. వారిని కాపాడేందుకు తమ ప్రాణాలు అర్పిస్తామన్నారు. 1969లో ఉద్యమంలో తెలంగాణా వారు చచ్చిపోయారు. బ్రహ్మానందరెడ్డికి రైట్‌ హ్యాండ్‌గా ఉండి సమైక్యవాదిగాఉన్న కాకాని వెంకటరత్నం 1970లో ఆంధ్రా ఉద్యమాన్ని చేపట్టారన్నారు. ఆయనకు సీమాంధ్రులు నివాళులర్పించాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న వారంతా సోనియా నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సర్వే సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లా జిల్లాకు కూడా ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకోని వ్యక్తులు మూర్కులే అవుతారన్నారు. అఖిలపక్ష సమావేశానికి ముందు తర్వాత ప్రజల్లో మార్పు వచ్చిందని మాజీ స్పీకర్‌ కెఆర్‌ సురేశ్‌రెడ్డి పేర్కొన్నారు. జాతీయ పార్టీఅయిన కాంగ్రెస్‌ ఇచ్చిన మాట నెరవేరుస్తుందన్నారు. ప్రజల విశ్వాసం త్వరలోనే వస్తుందన్నారు. తెలంగాణా సాదించిన తర్వాత బలమైన రాష్టాన్న్రి నిర్మించుకుందామన్నారు. తెలంగాణా రాకపోతే ఆలోచన గూర్చి అడుగుతున్న వారికి ప్రజల అభిప్రాయమే నిర్ణయమన్నారు.
పదవులు వదులుకుంటాం : గుత్తా
రాష్ట్రంలో సంప్రతింపులు, బెదిరింపుల పరిస్తితులు అన్నీ అయిపోయాయని, నేడు కావాల్సింది జరుగాల్సింది కేవలం తెగతెంపులేనని నల్గొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సాధనకోసం కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన సభా వేదికపై ఆయన మాట్లాడుతూ డిసెంబర్‌ 9 వతేదీన కాంగ్రెస్‌ చేసిన ప్రకటనను అమలు చేయాలని డిమాండ్‌ చేసేందుకే సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. సోనియాగాంధీపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తెలంగాణాలో గెలువాలంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తీరాల్సిందేనన్నారు. రాయల తెలంగాణ, ప్యాకేజీలపేరుతో మరోసారి మోసం చేయాలనుకోవడం సరైంది కానేకాదన్నారు. పది జిల్లాలు హైదరాబాద్‌తో కూడిన తెలంగాణా రాష్ట్రం కావాల్సిందేనన్నారు. పది హిందీ రాష్ట్రాలున్నప్పుడు, రెండు తెలుగు రాష్టాల్రు ఉండడంలో తప్పకానే కాదన్నారు. అన్నదమ్ముల్లా విడిపోదాం, తెలుగువారిగా కలిసి ఉందామని గుత్తా పేర్కొన్నారు. సీమాంధ్రులు చేసే బెదిరింపులకు ఇక బయపడేది లేదన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్రం అడుగుతున్నామని, ఆస్తులు అడుగడం లేదన్నారు. తమ ఆస్థులు తమకున్నాయని పేర్కొన్నారు. ఖచ్చితంగా తెలంగాణా ఇస్తుందనే నమ్మకంతో ఉన్నామన్నారు.