తెలంగాణపై చంద్రబాబు ఉత్తుత్తి ఉత్తరం
– కేంద్రానికి మరో అస్పష్ట లేఖ
– అనుకూలమా.. వ్యతిరేకమా తేల్చలేదు
– ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలని ప్రధానికి వినతి
– ఆ సమావేశంలోనే పార్టీ వైఖరి చెప్తామని మెలిక
– ఎక్కడా కనిపించిన పార్టీ అధికారిక వైఖరి
– టీడీపీ తీరుపై తెలంగాణవాదుల ఆగ్రహం
– నైరాశ్యంలో తెలంగాణ టీడీపీ గణం
– కొత్త సీసాలో పాత సారా పోసినట్లుంది..
– తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్
హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ పాత పాటే పాడారు. నామ్ కే వాస్తే అన్న చందంగా ప్రధానికి తెలంగాణపై ఓ ఉత్తుత్తి లేఖ రాసేశారు. కానీ, అందులో ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తమ పార్టీ వైఖరి స్పష్టం కాకుండా జాగ్రత్త పడ్డారు. మొత్తంలో లేఖను పరిశీలిస్తే ఎక్కడ కూడా చంద్రబాబు తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమా, వ్యతిరేకమా అన్నది తెలియదు. లేఖలో మాత్రం కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణపై తేల్చకుండా యూపీఏ ప్రభుత్వం సమస్యలను జఠిలం చేసిందని ఆరోపించారు. అఖిలపక్ష సమావేశం పెడితే, ఆ సమావేశంలోనే తమ వైఖరి చెబుతామని మెలిక పెట్టారు. బుధవారం పార్టీ సీమాంధ్ర నాయకులతో రెండు గంటలకు పైగా చర్చలు జరిపిన బాబు, ఆ తర్వాత ఈ లేఖను ప్రకటించారు. పనిలో పనిగా 2004లో టీఆర్‌ఎస్‌తో పొట్టుకుని కాంగ్రెస్సే తెలంగాణ ఇస్తామని మోసం చేసిందని బంతిని యూపీఏ కోర్టులోకి నెట్టారు. తాము 2008లో ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోలేదన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. కానీ, నాడు ఇచ్చిన లేఖలోనూ ఏ వైఖరి ప్రకటించారనేది ప్రస్తుత లేఖలో వెల్లడించలేదు. లేఖ అడిగారు కాబట్టి ఇచ్చాము అన్నట్లు బాబు లేఖ సాగుతుంది. అంతేగాక, తెలంగాణపై రాష్ట్రంలో కొనసాగుతున్న అనిశ్చితిపై స్పష్టత తేవాలని ప్రధానిని కోరారు. ఈ లేఖను చూస్తే తెలంగాణవాదులు, తెలంగాణ టీడీపీ శ్రేణులు ప్రత్యేక రాష్ట్రంపై ఒత్తిడి పెంచుతున్నందున, ఏదో ఇవ్వాలి కాబట్టి, తెలంగాణలో మళ్లీ తిరగాలి కాబట్టి, ఈ లేఖ ఇచ్చినట్లుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లేఖలో తెలంగాణపై స్పష్టమైన వైఖరి వెల్లడించలేదని, ఈ లేఖ వల్ల సీమాంధ్రలో పార్టీకి నష్టం లేదని, పార్టీకి చెందిన అక్కడి నాయకులతో రెండు గంటలపాటు వెల్లడించాకే, ఈ ఉత్తుత్తి లేఖను మీడియాకు వెలువరించినట్లు స్పష్టమవుతున్నది. లేఖలో ఎక్కడ కూడా బాబు తెలంగాణపై పార్టీ వైఖరి అనుకూలమా, వ్యతిరేకమా అన్నది స్పష్టం చేయకపోవడం, ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నది. తమ అధినేత లేఖ విషయం ప్రకటించాక, బయటికి వచ్చిన టీటీడీపీ నాయకులు కూడా ‘అవును.. అఖిలపక్షం పెడితే మా వైఖరి చెప్తాం’ అని ప్రకటించారు. కానీ, లోలోపల మాత్రం ‘మళ్లీ పాత పాటే పాడిండు’ అని మదన పడుతున్నారట ! గతంలో కూడా అసెంబ్లీలో కూడా తెలంగాణపై మీరు తీర్మానం పెడుతారా.. మమ్మల్ని పెట్టమంటారా.. అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సవాల్ చేసిన బాబు, ఆ తర్వాత మాటమార్చిన సంగతి, తెలంగాణపై ఏకాభిప్రాయం లేదని, ఢిల్లీలో లాబీయింగ్ జరిపి, వచ్చిన తెలంగాణను అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఇదే వైఖరిని బాబు ప్రస్తుత లేఖలోనూ కొనసాగించారని కిందిస్థాయి టీడీపీ శ్రేణులు నైరాశ్యంలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. బాబు ఇచ్చిన ఈ అస్పష్ట లేఖ తెలంగాణలో టీడీపీని మరింత బలహీనపర్చే అవకాశముందని వారు భావిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే, తెలంగాణవాదులు మాత్రం చంద్రబాబు లేఖపై విమర్శలు చేస్తున్నారు. తెలంగాణపై పార్టీ స్పష్టమైన వైఖరిని తెలుపని లేఖ ఇస్తే ఎంత.. ఇవ్వకుంటే ఎంత.. అని మండిపడుతున్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు మళ్లీ లేఖ డ్రామా ఆడుతున్నాడని విరుచుకుపడ్డారు. టీడీపీ లేఖ విషయంపై స్పందిస్తూ తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్ మాట్లాడుతూ కొత్త సీసాలో పాత సారా పోసినట్లుందని ఎద్దేవా చేశారు. ఈ లేఖతో బాబుకు తెలంగాణ అంశంపై చిత్తశుద్ధి లేదని స్పష్టమైందని ఆయన విమర్శించారు.