తెలంగాణపై త్వరలో నిర్ణయం

షిండేతో దిగ్విజయ్‌ భేటీ

విభజనపై చర్చ

ఆలస్యం కావడం వల్లే వేయి మంది బలిదానం

దిగ్విజయ్‌తో కోదండరామ్‌

న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి) :

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. రాష్ట్ర విభజనపై సీఎం, పీసీసీ చీఫ్‌లు సమర్పించే రోడ్‌మ్యాప్‌ను పరిశీలించిన అనంతరం అధిష్టానం తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో కేంద్ర ¬ం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అంశంపై చర్చించినట్లు సమాచారం. భేటీ ముగిసిన అనంతరం దిగ్విజయ్‌సింగ్‌ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ అంశంపై స్పందిస్తూ.. రాష్ట్ర విభజనకు సంబంధించి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణలను రోడ్‌మ్యాప్‌ రూపొందించి సమర్పించాలని కోరినట్లు చెప్పారు. వారిచ్చే రోడ్‌మ్యాప్‌ను పరిశీలించిన అనంతరం హైకమాండ్‌కు నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. అధినేత్రి సోనియాగాంధీ, ఇతర ముఖ్య నేతలతో చర్చించి తెలంగాణపై వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్ర విభజన అంశంపై రాజకీయ వ్యూహం తయారుచేయాలని రాష్ట్ర నేతలకు చెప్పామని మరో ప్రశ్నకు బదులిచ్చారు. తెలంగాణ ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేవి వేర్వేరు అంశాలని అన్నారు. కేంద్ర ¬ం మంత్రి షిండేతో ఏయే అంశాలపై చర్చించారని విలేకరులు ప్రశ్నించగా.. ఆయా వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు. ¬ం మంత్రితో తాను చర్చించిన విషయాలు బయటకు చెప్పేవి కావని తెలిపారు. టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం అనుసరించిన దాటవేత ధోరణి వల్లే వేయి మందికి పైగా యువత బలిదానాలు చేసుకున్నారని దిగ్విజయ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికైనా తెలంగాణపై తేల్చాలని కోరారు. లేనిపక్షంలో ఈ ప్రాంతం నుంచి తీవ్రమైన ప్రతిఘన ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికైనా తమ తీరును స్పష్టం చేసి తెలంగాణ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు.