తెలంగాణపై దమనకాండకు నిరసనగా సీపీఐ, బీజేపీ ఆధ్వర్యంలో వేర్వేరు ర్యాలీలు

హైదరాబాద్‌, జూన్‌ 15 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రజలపై సీమాంధ్ర సర్కారు దమనకాండను నిరసిస్తూ సీపీఐ, బీజేపీ ఆధ్వర్యంలో శనివారం వేర్వేరుగా ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నియంతగా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. సీపీఐ కార్యాలయంపై పోలీసులు దాడి చేసినందుకు నిరసనగా శనివారం మఖ్దుం భవన్‌ నుంచి పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం వరకు నారాయణ నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయాన్ని ముట్టడిరచేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ సందర్భంగా నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ నేతలకు క్షమాపణలు చెప్పి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో కార్యకర్తలు ఆందోళనలు విరమించారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ పోలీసుల బలగాలను ఉసిగొలిపి ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు ముఖ్యమంత్రి శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీపీఐ కార్యాలయంపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. ముఖ్యమంత్రికి దమ్ము, ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కొవాలే తప్ప పోలీసులతో దాడులు చేయించడం సరికాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి లాంటి నియంతలను గతంలో అనేక మందిని చూశామని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించిన నేతలందరూ కాలగర్భంలో కలిసిపోయారని, ఇందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి అతీతుడేమి కాదని ఆయన అన్నారు. ప్రజల హక్కులను, ప్రజాస్వామ్య విలువలను కాపాడలేని కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అనర్హడని  నారాయణ అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని  నారాయణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌ను ఓపెన్‌జైలుగా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు జరిపిన అక్రమ అరెస్టులకు నిరసనగా కిషన్‌రెడ్డి నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు శనివారం ఆర్టీసీ క్రాస్‌రోడ్సు వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను కార్యకర్తలు దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇందులో పార్టీ సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రికి కిరణ్‌కుమార్‌రెడ్డికి పోయే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. పోలీసు బలగాలతో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకుని గెలుపు సాధించినట్టు చంకలు గుద్దుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అణచివేసినందుకు అధిష్టానం తనను అభినందించిందని ముఖ్యమంత్రి చెప్పుకోవటం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే సత్తాలేక తెలంగాణవాదులను ఎక్కడికక్కడే అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌తో తెలంగాణ రాదని, ఒక్క బీజేపీతోనే తెలంగాణ సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయాలని, ఇచ్చిన మాటకు కట్టుబడి పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.