తెలంగాణపై వైఎస్ విజయమ్మ స్పష్టమైన వైఖరి తెలపాలి
కరీంనగర్, జూలై 18 : తెలంగాణపై స్పష్టమైన వైఖరి తెలిపిన తరువాతే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సిరిసిల్ల పట్టణంలో అడుగు పెట్టాలని మహిళలు డిమాండ్ చేశారు. బుధవారం సిరిసిల్ల పట్టణంలో ఈ నెల 23న చేనేత కార్మికులను ఓదార్చేందుకు వస్తున్న విజయమ్మకు నిరసనగా గాంధీచౌక్‌లో మహిళలు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. సిరిసిల్ల పట్టణ జేఏసీ నేత విశ్వనాథంతో పాటు మరికొందరు నేతలు దీక్షను ప్రారంభించిన మహిళలకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ, వైఎస్‌ఆర్ ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజిలు అమలు జరపకుండా కార్మికులను మోసం చేసిన వైఎస్ కుటుంబ సభ్యులు ఓదార్చేందుకు రావడం సిగ్గుచేటని వారు అన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కార్మికుల పట్ల ప్రేమ చూపటం మంచిది కాదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ విజయమ్మ తెలంగాణ ఏర్పాటు పట్ల స్పష్టమైన వైఖరిని తెలిపి ఆమె ఓదార్పుకు రావాలని వారు డిమాండ్ చేశారు. వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజిని ప్రకటించిన తరువాతే విజయమ్మ తెలంగాణాకు రావాలని వారు డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ వల్ల ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం ఖాయమని కావున తెలంగాణపై అభిప్రాయం తెలపాలని మహిళలు డిమాండ్ చేశారు.