తెలంగాణపై సీమాంధ్రుల ఆధిపత్యం ఇంకానా…?
ఆంధ్రోళ్ల పేర్లు మనకెందుకు..?
నగరంలోని కట్టడాలన్నింటికీ ఆంధ్రుల పేర్లే
మచ్చుకైనా కానరాని ‘తెలంగాణ హీరో’ల పేర్లు
అధికార అస్త్రంతో తెలంగాణ ప్రజలపై ఉక్కుపాదం
తెలంగాణలో ఆంధ్రోళ్ల పేర్లు సరే.. ఆంధ్రాలో తెలంగాణ పేర్లేవి..?
ట్యాంక్‌బండ్‌పై మనోళ్ల విగ్రహాలే ఉండాలె..
అన్ని పార్కులకూ పేర్లు మార్చాలె..
తెలంగాణ ఆర్థిక బలహీనతను క్యాష్ చేసుకున్న సీమాంధ్రులు
హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల పేర్లతో ఉన్న కట్టడాలపై ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం
హైదరాబాద్, నవంబర్ 30 (జనంసాక్షి) : ‘ఇసుంట రారా అంటే.. ఇళ్లంతా నాదేనన్నాడన్న’ సామెత వలసవాదులైన ఆంధ్రోళ్లకు సరిగ్గా పోతుంది. ఆంధ్రోళ్లంటే ఎందుకింత కోపమనుకుంటున్నారా..? వారంటే కోపం కాదు.. వారి చేసిన పాపాలంటేనే కోపం. ఇది నిజమో.. కాదో.. ఈ కథనం పూర్తిగా చదివాక మీరే నిర్ణయించండి. హైదరాబాద్ మహానగరం అందాలను ఇనుమడింపచేయడంలో చారిత్రక కట్టడాల పాత్ర కీలకం. అలాంటి కట్టడాలకు పేర్లు నామకరణం చేయడం కూడా అంతే కీలకం. అందుకు.. కట్టడం ఉన్న స్థానికత, ప్రాధాన్యత, ప్రతిష్ట, ఆ అందాలకు విలువతెచ్చేంత వ్యక్తుల పేర్లను ఎంపిక చేయడం పాలకుల చిత్తశుద్ధి. అప్పుడే ఆ కట్టడం పట్ల, ఆ కట్టడాలకు పేర్లు పెట్టిన పాలకుల పట్ల అభిమానం, విశ్వాసం, విలువలు ప్రజల్లో వెల్లివిరుస్తాయి. కానీ.. నగరంలో ఉన్న కట్టడాలలో ఒక్కటంటే ఒక్కదానికి తెలంగాణోడి పేరు లేదు. అన్నీ ఆంధ్రోళ్ల పేర్లతోనే చెలామణి అవుతున్నాయి. అంటే.. ఈ కట్టడాలకు పేర్లు పెట్టేందుకు.. సత్తా, సామర్థ్యం, చారిత్రక నేపథ్యం ఉన్న తెలంగాణోళ్లు ఒక్కరు లేరా..? అందుకే.. ఆంధ్రోళ్ల పేర్లు పెట్టారా..? అంతటి సమర్థులు ఆంధ్రాలోనే ఉన్నారా..? దీనికి తెలంగాణోళ్లు అసమర్థులని ఒప్పుకోవాలా..? లేక.. సీమాంధ్రుల అధికార మదం తెలంగాణను తొక్కిపెట్టిందని అనుకోవాలా..? ఇప్పుడు మీరే చెప్పండి.
నగరంలోని కట్టడాలకు ఆంధ్రోళ్ల పేర్లు…
ముందుగా నగరంలో సీమాంధ్రుల పేర్లతో వాడుకలో ఉన్న కట్టడాలను చూద్దాం. పబ్లిక్‌గార్డెన్‌లోని పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం, ఇంద్రపార్కు వద్ద గల ఎన్టీఆర్ స్టేడియం, అలాగే శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎన్టీఆర్ పేరుతో కొనసాగుతున్న దేశీయ(డొమెస్టిక్) టెర్మినల్, ఇంకా దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ప్రాంగణం, యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్‌స్టేడియం, వెంగళరావునగర్‌లోని కాసుబ్రహ్మానందరెడ్డి(కెబిఆర్) పార్కు, ఉస్మానియా యూనివర్శిటికీ ఆనుకుని ఉన్న ఆంధ్రమహిళాసభ, ఖైరతాబాద్‌లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవనం అన్నీ ఆంధ్రోళ్ల పేరుతో పిలువబడుతున్నాయి. ఇవి కాకుండా ట్యాంక్‌బండ్ మీద ఆంధ్రోళ్లకు చెందిన కవులు, రచయితల విగ్రహాలు అనేకం ఉన్నాయి. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చివరికంటా అడ్డుకున్న వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలు తెలంగాణలో అనేకం ఉన్నాయి. ఇలా ముఖ్యమైన కట్టడాలు, పార్కులకు ఆంధ్రోళ్ల పేర్లు నామకరణం చేశారు. వారి విగ్రహాలను విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. అసలు తెలంగాణకు, పొట్టి శ్రీరాములుకు సంబంధమే లేదు. అలాంటి వ్యక్తి పేరును తెలంగాణలో ఒక విశ్వవిద్యాలయానికి పేరుపెట్టారు. ఇది న్యాయమా..?
ఆంధ్రోళ్ల అధికార బలమే అన్నీ చేయించింది…
1956లో తెలంగాణలో ఆంధ్రరాష్ట్రం విలీనమై ఆంధ్రప్రదేశ్‌గా అవతరించింది. ఈ విలీనమే తెలంగాణ వినాశనానికి నాందిపలికింది. రాష్ట్రం విలీనం కావడంతోనే ఆంధ్రా నుంచి తెలంగాణకు ఆంధ్రోళ్ల వలసలు పెరిగాయి. కాలక్రమేణా తెలంగాణపై ఆర్థికంగా, రాజకీయంగా పట్టుసాధించారు. తద్వారా రాష్ట్ర అధికార పగ్గాలను చేతబట్టి ఆడిందే ఆట పాడిందేపాటగా పాలన సాగించారు. తెలంగాణపై వివక్ష చూపుతూ ఆంధ్రా అభివృద్ధికి బాటలు వేశారు. ఇక్కడి నిధులన్నింటినీ అధికార బలంతో ఆంధ్రా ఉద్దరణకు ఖర్చు చేశారు. ఇలా ఆంధ్రా పాలకులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్నారు. పెద్దమనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కి నిధులు, నీళ్లు, నియామకాలను ఆంధ్రాకు తరలించడంతో కడుపుమండిన తెలంగాణ ప్రజలు 1958లో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఉద్యమం 1969 నాటికి తారాస్థాయికి చేరింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న కాసుబ్రహ్మానందరెడ్డి.. ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ బిడ్డలను పిట్టలను కాల్చినట్లు కాల్చిచంపారు. ఈ కాల్పుల్లో వందల మంది తెలంగాణ బిడ్డలు అసువులు బాశారు. ఈయన పేరుమీద మనకు పార్కు అవసరమా..? తెలతెలవారుతుండగా కెబిఆర్ పార్కుకు వాకింగ్‌కు వెళ్లే తెలంగాణ బిడ్డలు పొద్దునే ఈయన విగ్రహాన్ని ఎలా చూస్తారు..? దీనికి తెలంగాణ బిడ్డల రక్తం సలసలకాలదా..? చేదు జ్ఞాపకాలు గుర్తుకురావా..? 1983లో రాజకీయ అరంగేట్రం చేసిన ఎన్టీ రామారావు తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో తెలంగాణవాదాన్ని తొక్కిపెట్టారు. ఈ పేరుతోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆర్నెళ్లలో అధికారపగ్గాలు దక్కించుకున్నారు. ఆ తర్వాత క్రమంగా తెలంగాణ నాయకులు, ప్రజల పట్ల ప్రాధాన్యత తగ్గించారు. ప్రస్తుతం విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీని తెలంగాణకు దక్కకుండా చేశారు. ఆ తర్వాత తెలుగు గంగ ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ నిధులను తరలించారు. ఇలా చారిత్రక ప్రాజెక్టులు, కట్టడాల నిర్మాణాన్ని తెలంగాణలో స్థాపించేందుకు ఎన్టీఆర్ ఇష్టపడలేదు. తద్వారా తెలంగాణకు అన్యాయం చేశారు. అంతెందుకు.. 2009 వరకు అధికారంలో ఉన్న వైఎస్.రాజశేఖరరెడ్డి కూడా తెలంగాణను అడ్డుకున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇలా ఆంధ్రా పాలకులందరూ తమ అధికారాన్ని అడ్డంపెట్టుకుని రాజకీయ, ఆర్థిక బలాలను ఉపయోగించి తెలంగాణ ప్రజలను, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారు. తెలంగాణ వాదంపై ఉక్కుపాదం మోపారు. తెలంగాణ ప్రజలకు గుర్తింపు లేకుండా కుట్రలు చేశారు. అన్నింటికి మించి.. యావత్ తెలంగాణ ప్రాంతం ఆర్థిక మూలాలను దెబ్బతీశారు. ఇప్పటికీ అదేచేస్తున్నారు. చిత్తశుద్ధి కలిగిన ఒక పాలకునికి, ఒక నాయకునికి వివక్షతో కూడిన పాలన తగునా..? పైన చెప్పుకున్న ‘ఇసుంట రారా అంటే.. ఇళ్లంత నాదేనన్నాడన్న’ సామెత ఆంధ్రోళ్లకు సరిగ్గా సరిపోతుందని ఇప్పుడు అర్థమైందా..?
జాతి సమైక్యత ప్రకారం.. ఆంధ్రాలో తెలంగాణ పేర్లేవి..?
ఇన్నాళ్లూ ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన సమైక్య పాలకులు.. తమకు తెలంగాణ ప్రాంతమంటే వివక్ష లేదని, తెలంగాణ ప్రజలు, నాయకుల పట్ల గౌరవం ఉందని, తమకు తెలుగుజాతి ఆత్మగౌరవం ముఖ్యమని, తెలుగుప్రజల ఐక్యత ప్రధానమని చెప్పుకొచ్చారు. అందువల్లనే తెలంగాణ ప్రాంతంలోని కట్టడాలు, ప్రదేశాలు, పార్కులకు ఆంధ్రోళ్ల పేర్లను నామకరణం చేశామని వివరించారు. అదే నిజమైతే.. తెలంగాణకు చెందిన గొప్ప పోరాటయోధుడు.. ఆదివాసీ ప్రజల కోసం అసువులుబాసిన వీరుడు కొమురంభీం, అల్లూరి సీతారామరాజు విగ్రహాలను ఆంధ్రా ప్రాంతంలో ఎందుకు ప్రతిష్టించలేదు..? అక్కడి కట్టడాలు, ప్రదేశాలు, పార్కులకు తెలంగాణ నాయకుల పేర్లు ఎందుకు నామకరణం చేయలేదు..? సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అనేక యూనివర్శిటీలు, విశ్వవిద్యాలయాలకు తెలంగాణకు చెందిన అంజయ్య, కాళోజీ వంటి వారి పేర్లను ఎందుకు పెట్టలేదు..? మరి తాము చెబుతున్న జాతిఐక్యత, తెలుగువారి ఆత్మగౌరవం సూత్రం ఏమైంది..? ఇది తెలంగాణ ప్రజలకు అవమానం కాదా..? అని సమస్త తెలంగాణ ప్రజానీకం అడుగుతోంది. దీనికి సమాధానం ఎక్కడుంది..? ఎవరి దగ్గరుంది..?
స్వరాష్ట్రంలో పరాయి నాయకుల పేర్లెందుకు..?
జూన్ 2, 2014న ఆంధ్రప్రదేశ్ నుంచి విడవడి కొత్త రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. తెలంగాణలో ఆంధ్రోళ్ల పాలనను పాతరేసింది. అంతేకాదు.. నూతన రాష్ట్రానికి పక్క రాష్ట్రం పార్టీలకు అధికారం వద్దని సొంతింటి పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు తెలంగాణ ప్రజలు. ఇప్పుడు సొంత రాష్ట్రం.. సొంత పాలనతో రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో.. తెలంగాణలో ఆంధ్రోళ్ల విగ్రహాలు, వివిధ చారిత్రక కట్టడాలకు ఆంధ్రోళ్ల పేర్లు అవసరమా..? అని యావత్ తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి.. తెలంగాణ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి తెలంగాణలో, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్న చారిత్రక కట్టడాలు, ఎక్కువ ప్రాచుర్యం పొందిన, గుర్తింపు పొందిన ప్రదేశాలు, పార్కులకు ఉన్న ఆంధ్రోళ్ల పేర్లను తొలగించి ‘తెలంగాణ హీరో’ల పేర్లు నామకరణం చేయాలని, ట్యాంక్‌బండ్‌పై మనోళ్ల విగ్రహాలనే ప్రతిష్టించాలని, నగరంలోని అన్ని పార్కులకూ పేర్లు మార్చాలని ఇప్పటికే నినదిస్తున్న తెలంగాణ ప్రజల గొంతుకలో ‘జనంసాక్షి’ దినపత్రిక కూడా తన భాణీని వినిపిస్తోంది. తెలంగాణ పునర్నిర్మాణంలో మనోళ్ల పేర్లే ఉండాలని కాంక్షిస్తోంది.