తెలంగాణలో తెరాసకు తిరుగులేదు
రాష్ట్రంలో అద్భుత ప్రగతిని సాధిస్తాం
ఇంటింటికీ తాగునీరు
విశ్వనగరంగా హైదరాబాద్
ఏప్రిల్ 24న అధ్యక్షుని ఎన్నిక
విద్యుత్‌పై ముందుచూపు
కోతలు లేకుండా చూస్తాం
టీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్
హైదరాబాద్,ఫిబ్రవరి3(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి రాష్ట్రంలో తిరుగులేదని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని, వాస్తవాలను ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. అభివృద్ధి పనుల కోసం ఏరియల్ సర్వే చేస్తే సీఎం నేలవిూదికి రాడా అని దీర్ఘాలు తీశారు.. మురికివాడల్లో తిరిగితే అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారంటారు.. భవిష్యత్ కనిపించక విపక్షాలు గుడ్డిగా విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత తాము చెప్పింది చేసి చూపించామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కొంపల్లిలోని ఆర్డీ కన్వెన్షన్ హాలులో టీఆర్‌ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తనదైన శైలిలో ఆయన విపక్షాలను తూర్పారా బట్టారు. గడిచిన ఏడెనిమిది నెలలో చెప్పింది చేసి చూపించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. విపక్షాల విమర్శలను పట్టించుకోవాల్సిన అసవరం లేదని, చివరి మనిషి వరకు సాయం చేద్దాం.. వెనక్కిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిరుపేద వర్గాలే తమకు ఆత్మీయ బంధువులు అని తెలిపారు. నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. రైతులకు పంట రుణాలు మాఫీ చేశాం.. కానీ పక్క రాష్ట్ర సీఎం రైతులను మోసం చేశాడని గుర్తు చేశారు. పేదల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తాం.. వ్యవసాయానికి రెండో ప్రాధాన్యత, పారిశ్రామిక రంగానికి మూడో ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. అప్పుడే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. చైనాతో తీసిపోని పారిశ్రామిక వాడ హైదరాబాద్‌లో తయారు కావాలన్నారు. బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేద్దామని పిలుపినిచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల అంశంపై కమల్ నాథన్ కమిటీ నివేదిక వచ్చిన అనంతరం చర్యలు చేపడతామని ఆయన అన్నారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇస్తామని, ఇవ్వకపోతే ఓట్లు అడగబోమని గతంలో చెప్‌పిన మాటకు కటుటబడి ఉన్నామని అన్నారు.పేదల పింఛన్ల కోసం ప్రభుత్వం రూ. 3500 కోట్లు మంజూరుచేసిందన్నారు. చెప్పిన విధంగా అర్హులందరికీ పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. వాటర్‌గ్రిడ్‌తో ప్రతి ఇంటికి మంచి నీళ్లు ఇస్తామన్నారు. మంచి నీళ్లు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని తేల్చిచెప్పారు. రాత్రింబవళ్లు కష్టపడి అనుకున్న దానికన్నా ఆరు నెలల ముందే నీళ్లిస్తామని స్పష్టం చేశారు.
మరో పార్టీకి భవిష్యత్ లేదు
తెలంగాణ రాష్ట్రంలో తెరాసకు తప్ప మరో పార్టీకి భవిష్యత్తు లేదని కేసీఆర్ అన్నారు.వాస్తవాలు చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో 154 సీట్లకు గాను 130కి పైగా తెరాస గెలుస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తంచేశారు. పార్టీలో యువ నాయకులు, ఉత్సాహవంతులు ఉన్నారని, ఇద్దరున్నచోట పోటీగా పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని కేసీఆర్ అన్నారు. ఒక పార్లమెంటు నియోజకవర్గంలో కొత్తగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయని ఆయన చెప్పారు. తెలివైన రాజకీయ నేతలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అని సూచించారు. 2004లో అధికార టీడీపీని మట్టికరిపించి కాంగ్రెస్‌ను అధికారంలో కూర్చోబెట్టామని గుర్తు చేశారు. ఇక ఇప్పటి నుంచి తమదే అధికారమన్నారు. మనలో మనకు సంఘర్షణలు వద్దు. కలిసి పని చేద్దాం.. ముందుకు పోదాం. కొన్ని బూజు పట్టిన పార్టీలు గత్తరబిత్తర చేస్తున్నాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి పార్లమెంట్ స్థానం పరిధిలో రెండు కొత్త నియోజకవర్గాలు వస్తాయని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో 154 అసెంబ్లీ స్థానాలకు 135 నుంచి 140 వరకు స్థానాలను టీఆర్‌ఎస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ఏప్రిల్ 24న అధ్యక్షుడి ఎన్నిక
ఏప్రిల్ 24న రాష్ట్రస్థాయి అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని కేసీఆర్ ప్రకటించారు. జిల్లాలవారీగా సభ్యత్వ నమోదు పుస్తకాలు అందజేస్తున్నామని, ఈ నెల 3 నుంచి 20 వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మార్చి 1 నుంచి 10 వరకు గ్రామ, వార్డు, అనుబంధ సంఘాల ఎన్నికలు, మార్చి 11 నుంచి 20 వరకు మండల, మున్సిపల్ స్థాయి ఎన్నికలు, ఏప్రిల్ మొదటివారంలో జిల్లా కమిటీ, అనుబంధ సంఘాల ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ ప్రకటించారు. జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించే తేదీలు తర్వాత ప్రకటిస్తామన్నారు. ఏప్రిల్ 24న విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామని, ఆరోజు రాష్ట్రస్థాయి అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని కేసీఆర్ తెలిపారు.
యజ్ఞంలా హరితహారం కార్యక్రమం
కరువు తెలంగాణ జోలికి రావొద్దు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కరువు తెలంగాణ జోలికి రావొద్దంటే హరితహారం కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. అంతే కాకుండా చెరువుల పునరుద్ధరణలో పాలు పంచుకోవాలని సూచించారు. చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలు బాగా పడుతాయని తెలిపారు. ఈ క్రమంలో మనం కూడా ఎక్కువగా మొక్కలు నాటాలన్నారు. ఏదో ఫోటోల కోసం మొక్కలు నాటి వెళ్లిపోవద్దన్నారు. మొక్కల పెరుగుదలకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. హరితహారం కార్యక్రమాన్ని యజ్ఞంలా భావించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం 40 కోట్ల మొక్కల చొప్పున మూడేళ్లలో 120 కోట్ల మొక్కలు నాటాలన్నారు. ప్రతి పది గ్రామాల్లో కనీసం 40 వేల మొక్కలు నాటాలని సూచించారు. ఇక చెరువుల పునరుద్ధణ కింద చెరువుల్లో పూడిక తీసి వేసే పనుల్లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఏటా 9 వేల చెరువుల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వర్షకాలంలో చెరువు నిండితే మరో మూడేళ్ల వరకు నీటి కొరత లేకుండా ఉండేలా పూడిక తీయాలన్నారు. అప్పుడే గ్రామాల్లో రైతులు పంటలు పండించగలరు.. తెలంగాణ అభివృద్ధి పథంలోకి వెళ్తుందన్నారు.
భేషుగ్గా షీ టీమ్స్ పని
నగరంలో షీ టీమ్స్ చక్కగా పని చేస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. కొంపల్లిలో జరుగుతున్న టీఆర్ ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగిస్తూ…. ఆడపిల్లలను టీజ్ చేయాలంటే భయపడుతున్నారని తెలిపారు.
24గంటల పాటు కరెంట్ ఇస్తాం
తెలంగాణలో మూడేళ్లలో 24 గంటల పాటు కరెంట్ తప్పకుండా ఇస్తామని సీఎం కేసీఆర్ మరోసారి పునరుద్ఘాటించారు. విద్యుత్ ఉత్పత్తి విూద గత ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహించాయని ధ్వజమెత్తారు. ఎన్టీపీసీ ద్వారా 4 వేల మెగావాట్లు, జెన్‌కో ద్వారా 6 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధిస్తామన్నారు. చంద్రబాబు తమకు రావాల్సిన విద్యుత్ వాటాను ఎగబెట్టాడు. అందుకే కరెంట్ కష్టాలు వచ్చాయన్నారు. ఎంత ఖర్చు అయినా సరే ఈ వేసవిలో విద్యుత్ కొరత లేకుండా చూస్తమని పేర్కొన్నారు. మూడు సంవత్సరాల తర్వాత రెప్పపాటు కూడా కరెంట్ పోదు అని తేల్చిచెప్పారు.
జిల్లా కేంద్రాల్లో అమరవీరుల స్థూపాలు
ప్రతి జిల్లా కేంద్రంలో తెలంగాణ అమరవీరుల స్థూపాలను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కొంపల్లిలోని ఆర్డీ కన్వెన్షన్ హాలులో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రతి జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపాల నిర్మాణానికి రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించారు. జూన్ 2 నాటికి అమరవీరుల స్థూపాలు నిర్మించాలన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి, సెల్యూట్ చేసి జాతీయ జెండా ఆవిష్కరించేలా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ప్రభుత్వం తరపున అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని ఉద్ఘాటించారు. అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షలు కేటాయిస్తామన్నారు.
చురుగ్గా పనిచేసే వాళ్లతో స్టీరింగ్ కమిటీ
ప్రస్తుత కమిటీలు రద్దు చేసి కొత్త స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసుకుని పార్టీని ముందుకు నడిపిస్తున్నామని తెరాస అధినేత కేసీఆర్ అన్నారు. కమిటీకి చురుగ్గా పనిచేసే వాళ్లను ఎంపికచేశామన్నారు. తాత్కాలిక స్టీరింగ్ కమిటీ కన్వీనర్‌గా పళ్లా రాజేశ్వరరెడ్డిని నియమించినట్లు చెప్పారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అదినేత కేసీఆర్ పార్టీజెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ ఎస్ కమిటీలన్నీ రద్దు చేసి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. టీఆర్ ఎస్ మహిళా అధ్యక్షురాలిగా తుల ఉమను కొనసాగిస్తున్నారు. ఫిబ్రవరి 20వ తేదీ వరకు సభ్యత్వ నమోదు పూర్తి చేసి జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. కార్యకర్తలంతా కలిసి తెలంగాణను బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఏప్రిల్ 20 లోపు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు. ఏప్రిల్ 27న జరిగే వార్షికోత్సవ సభకు అంతా సన్నద్ధం కావాలని ఆయన సూచించారు.
విశ్వ నగరంగా హైదరాబాద్
హైదరాబాద్ నగరాన్ని అమెరికాలోని డల్లాస్‌లా తయారు చేస్తామని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ అందమైన నగరంగా తీర్చిదిద్దే పనిలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు. కొంపల్లిలోని ఆర్డీ కన్వెన్షన్ హాలులో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తాను వట్టి మాటలు చెప్పడం లేదని.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఎవరూ ఊహించని రీతిలో నగరాన్ని సుందరంగా తయారు చేస్తామన్నారు. హైదరాబాద్‌లో కోటి జనాభా ఉంది. కోటి జనాభాకు అనుగుణంగా సదుపాయాలు లేవు అని తెలిపారు. ఏ ఒక్కటి కూడా సక్కగా లేదన్నారు. వర్షం వస్తే చాలు రోడ్లన్ని నీటితో నిండిపోతాయి. కొందరైతే బకెట్లు పట్టుకుని ఇంట్లోకి వచ్చిన నీటిని తోడిపోస్తారు. ఇదేనా హైటెక్ నగరమంటే అని ప్రశ్నించారు. తాము హైటెక్ నగరాన్ని తయారు చేశామని గొప్పలు చెప్పుకుంటే సరిపోదన్నారు. ప్రజలకు అనుగుణంగా నగరాన్ని తయారు చేయాలన్నారు. హైదరాబాద్‌లో పార్క్‌లు లేవు, బొందలగడ్డలు లేవు, పార్కింగ్ లేదు, ధోబీఘాట్ లేదు. హైదరాబాద్ తన ధర్మం విూద తను బతుకుతోంది. ఇకపోతే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేపట్టి దానిని సుందర కాసారంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. హుస్సేన్‌సాగర్‌ను వచ్చే వేసవిలో పూర్తి స్థాయిలో శుద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇందుకోసం వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. హైదరాబాద్‌లో ప్రజల కనీస అవసరాలు తీర్చలేని దుర్భర పరిస్థితులున్నాయన్నారు. నగరాన్ని పూర్తిగా ప్రక్షాళించడంతో పాటు రూపురేఖలను మార్చేస్తామని చెప్పారు. మురికివాడల్లో పక్కా ఇళ్లు నిర్మిస్తామని, ఫుట్‌పాత్‌లు, మరుగుదొడ్లు, పార్కింగు స్థలాలు, కూరగాయలు, మాంసాహార మార్కెట్లు, దోభీ ఘాట్లు, శ్మశానవాటికలు నిర్మిస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌లో జనాభా ప్రతిపాదికన వెయ్యి మార్కెట్లు ఉండాలని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం 24 మార్కెట్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. పంజాగుట్ట, మలక్‌పేట, ఎర్రమంజిల్ కాలనీలో ఎకరం స్థలంలో మార్కెట్లు నిర్మిస్తామన్నారు. అలాగే శాంతిభద్రతలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. షీ టీమ్స్ పనితీరు వల్ల పోకిరీల బెడద తగ్గుతుందన్నారు. ఇవన్నీచేస్తామంటే విపక్షాలకు నచ్చడం లేదన్నారు. విద్యుత్ ఉత్పత్తి విూద గత ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహించాయని ధ్వజమెత్తారు. ఎన్టీపీసీ ద్వారా 4 వేల మెగావాట్లు, జెన్‌కో ద్వారా 6 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధిస్తామన్నారు. చంద్రబాబు తమకు రావాల్సిన విద్యుత్ వాటాను ఎగబెట్టాడు. అందుకే కరెంట్ కష్టాలు వచ్చాయన్నారు. ఎంత ఖర్చు అయినా సరే ఈ వేసవిలో విద్యుత్ కొరత లేకుండా చూస్తమని పేర్కొన్నారు. మూడు సంవత్సరాల తర్వాత రెప్పపాటు కూడా కరెంట్ పోదు అని తేల్చిచెప్పారు.