తెలంగాణలో పరిశ్రమలు స్థాపిస్తాం

C

సీఎం కేసీఆర్‌తో జిందాల్‌ ప్రతినిధుల భేటీ

హైదరాబాద్‌,ఫిబ్రవరి19(జనంసాక్షి):

జిందాల్‌ సా లిమిటెడ్‌ ప్రతినిధులు ఇవాళ సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. వాటర్‌ గ్రిడ్‌ పథకానికి పైపులు సరఫరా చేసేందుకు జిందాల్‌ కంపెనీ తరఫున సంసిద్ధత వ్యక్తం చేశారు. దేశంలో పైపుల తయారీలో జిందాల్‌ కంపెనీదే అగ్రస్థానమని, తెలంగాణ రాష్ట్రం కోరుకున్న విధంగా పైపులు సరఫరా చేస్తామని చెప్పారు. తెలంగాణలో పైపుల తయారీ కేంద్రాన్ని కూడా నెలకొల్పుతామని ప్రకటించారు. తెలంగాణలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పేందుకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ దగ్గర జిందాల్‌ కంపెనీ ప్రతినిధులు ప్రతిపాదించారు.

ఖమ్మం జిల్లా బయ్యారం ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు సెయిల్‌ కంపెనీ ముందుకు వస్తుందని జిందాల్‌ ప్రతినిధులకు సీఎం కేసీఆర్‌ చెప్పారు. సెయిల్‌ ఉక్కు పరిశ్రమ నెలకొల్పలేకపోతే విూరు సిద్ధంగా ఉండాలని జిందాల్‌ ప్రతినిధులకు సీఎం సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి పథకాలు చేపడుతోందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో జిందాల్‌ లాంటి కంపెనీలు భాగస్వాములు అయ్యేందుకు ముందుకు రావడం శుభాపరిణామమన్నారు. ముఖ్యమంత్రితో భేటీ అయిన వారిలో జిందాల్‌ సా లిమిటెడ్‌ సీఈవో కం డైరెక్టర్‌ నీరజ్కుమార్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మనీష్కుమార్‌, అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ సింగ్‌ ఉన్నారు.