తెలంగాణలో వైఎస్‌ఆర్‌సీపీ ముగిసిన అధ్యయనం
– తెలంగాణ ప్రాజెక్టులపై జగన్ వైఖరికి నిరసనగా ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే పాయం రాజీనామా
– మంత్రి కేటీఆర్‌తో భేటి
ఖమ్మం,మే2(జనంసాక్షి): తెలంగాణాలో వైకాపా కనుమరుగు కానుంది. ఆ పార్టీకి చెందిన తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపి పొంగులేట ఇశ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేవ్వర్లు వైకాపాకు గుడ్‌బై చెప్పారు. జగన్ తెలంగాన ప్రాజెక్టుల వ్యతిరేక వైకరి కారణంగానే తాము టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. ఇదే సందర్భంలో ఎంపి పొంగులేటి ఇంటికి స్వయంగా వెళ్లిన మంత్రి కెటిఆర్ ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఖమ్మం జిల్లా ప్రజల ఆశీర్వాదంతో జిల్లాలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతామని తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెరాసలో చేరేందుకు రంగం సిద్ధమైన నేపథ్యంలో కేటీఆర్ పొంగులేటి నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొంగులేటిని తెరాసలోకి ఆహ్వానించేందుకే తాను ఇక్కడికి వచ్చానని అన్నారు. పొంగులేటి, వెంకటేశ్వర్లు చేరికతో ఖమ్మం జిల్లాలో తెరాస మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చేరికలతో తెలంగాణలో
ఆంధ్రా పార్టీ ఒకటి అంతార్థనం మైందని, భవిష్యత్తులో తెలుగుదేశం కూడా ఇలాగే అంతర్థానమవుతుందని కేటీఆర్ విమర్శించారు. స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని అందువల్లనే వైసీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును టీఆర్‌ఎస్‌లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. వైసీపీ ఏంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో వైసీపీ ఖాళీ అయ్యిందని ఎద్దేవాచేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఆయకట్టును సాగులోకి తెచ్చేందుకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కృషి చేస్తున్నారని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దీక్ష చేయాలనుకోవడం సరికాదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం తనకు రావాల్సిన వాటాకంటే ఒక్క టీఎంసీ నీటిని అదనంగా వాడుకోవడంలేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై జగన్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. తనతోపాటు ఎమ్మెల్యేలు, ఖమ్మం వైసీపీ కార్యవర్గం టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు వెల్లడించారు. తెలంగాణలో వైసీపీ అభివృద్ధికి ఎంతో కృషి చేశామన్నారు. ఏపీ ప్రజల ప్రయోజనాల కోసం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రా స్టాండ్ తీసుకుని జగన్ తెలంగాణను గాలికొదిలేశారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడుకోవడానికే తాను వైసీపీకి రాజీనామా చేశానని వెల్లడించారు. సీఎం కేసీఆర్ తలపెట్టిన బంగారు తెలంగాణ సాధనలో తనవంతు కృషి అందించేందుకే సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకే టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం, అభివృద్ధిలో ఇక్కడి ప్రభుత్వానికి సహకరించేందుకు తాను వైకాపాను వీడుతున్నట్లు ఎంపీ పొంగులేటి స్పష్టం చేశారు. సోమవారం ఆయన ఖమ్మంలో మాట్లాడుతూ.. తెలంగాణలో వైకాపాకు దెబ్బ తగులుతుందని తెలిసీ.. ఏపీ ప్రజల ప్రయోజనం కోసం వైకాపా అధ్యక్షుడు జగన్ దీక్ష నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా నేను కూడా ఇక్కడి ప్రజల ప్రయోజనం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా. పార్టీ కార్యకర్తలతో సుదీర్ఘంగా చర్చించి బంగారు తెలంగాణను తీర్చిదిద్దే పక్రియలో భాగస్వాములం కావాలని తీర్మానించామని అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే రాష్ట్ర విభజన జరిగింది. అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ వైకాపాలో కొనసాగాను. తెలంగాణలో పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేశాను. జగన్ తనను కుటుంబంలో ఒకడిగా చూశారు. జగన్, పార్టీపై కొందరు ఆరోపణలు చేసి పార్టీని వీడారు. ఇతరులను కించపరిచే మనస్తత్వం జగన్‌ది కాదు. ఏపీ ప్రజల ప్రయోజనాల కోసం ఆయన కృషి చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అదనంగా ఒక్క క్యూసెక్కు నీటిని కూడా వాడుకోవటం లేదు. అయినా జగన్ దీక్ష చేస్తాననటం ఆయన వ్యక్తిగత విషయం. చివరిగా నేను చెప్పేది ఒక్కటే. ప్రజల ప్రయోజనాల కోసమే తెరాసలో చేరుతున్నా. ఈనెల 4న మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ సమక్షంలో తెరాసలో పార్టీలో చేరుతున్నా అని పొంగులేటి స్పష్టం చేశారు.