తెలంగాణోళ్లం ఆంధ్రా జర్నలిస్టుల యూనియన్లో ఎందుకు ?
నయానా తెలంగాణ ఇవ్వరు .. ఇక భయాన్నే తెలంగాణ తెచ్చుకోవాలి
తెలంగాణ డైరీ ఆవిష్కరణ సభలో వక్తలు
హైదరాబాద్, జనవరి 24 (జనంసాక్షి) :
తెలంగాణోళ్లం ఆంధ్ర జర్నలిస్టు యూ నియన్‌లో ఎందుకుండాలని తెలంగా ణవాదులు ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్‌లో యూనియన్ ఆధ్వర్యంలో ముద్రించిన డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, అన్ని రంగాల్లో ఉన్నట్లుగానే జర్నలిస్టుల యూనియన్‌లోనూ ఆంధ్రోళ్ల ఆధిపత్యం కొనసాగుతుందన్నారు. నాయకులు తెలంగాణవారున్నా మొత్తం ఆధిపత్యం వారిదేనన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన జీవవైవిధ్య సదస్సులో ప్రధాని మన్మోహన్‌సింగ్ సమావేశానికి తెలంగాణ మీడియాకు చెందిన జర్నలిస్టులకు అనుమతి ఇవ్వని విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. తెలంగాణ జర్నలిస్టుల పట్ల వివక్షకు ఇదే ఒక్కటే నిదర్శనం కాదని, ఎన్నో సందర్భాల్లో ఇలాగే వ్యవహరించారని గుర్తు చేశారు. ఇలాంటి వారు పాలకులు ఉంటే వారికి జర్నలిస్టు సంఘాలు వత్తాసు పలకడం సరికాదన్నారు. జర్నలిస్టులందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. కేంద్రం మంచిమాటతో తెలంగాణ ఇచ్చే అవకాశాలు కానరావడం లేదని, ఇక భయమంటే ఏమిటో చవిచూపే తెలంగాణ సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజా గాయకుడు గద్దర్, రాజ్యసభ సభ్యులు దేవేందర్‌గౌడ్, రాపోలు ఆనంద్‌భాస్కర్, టఫ్ కో కన్వీనర్ విమలక్క, బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, కపిలవాయి దిలీప్‌కుమార్, కర్పర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.