తెలంగాణ ఆయన ఊపిరి..
స్వరాష్ట్ర సాధనే ఆయన లక్ష్యం
మాటమిన్న.. మనసు వెన్న..
తామరాకు విూద నీటిబొట్టు డెప్యూటి సీఎం మహమూద్ అలీ
(బోల్డ్ సూపర్ లీడ్)
—
ఆ మాటల్లోని స్ఫూర్తిని అక్షరాలా ఆచరణలో పెట్టిన తెలంగాణ ఆణిముత్యం ముహమ్మద్ మహమూద్ అలీ. అధికారం కోసం ఎక్కడా రాజీపడలేదని, తెలంగాణ ఉద్యమంలో ఎంత చిత్తశుద్ధితో పాల్గొన్ననో ఇప్పటికీ అట్లనే బతుకుతున్ననని గర్వంగా చెబుతున్నరు. రాజకీయాలంటే ఇష్టపడని తాను, తెలంగాణ సర్కారులో కీలకమైన రెవెన్యూ శాఖ నిర్వహిస్తుండడంతో పాటు, దేశంలోనే ఓ మైనారిటీ వ్యక్తి తొలి డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టిన అరుదైన రికార్డు కూడా నమోదు చేసినందుకు గర్వంగా ఉందని ఫీలైతున్నరు. తన ఉద్యమ జీవితం, రాజకీయ ప్రస్థానం, కేసీఆర్ కు ఆంతరంగికుడిగా మెలిగిన అనుభవాలు… ఒకటేమిటి దశాబ్దాల తన పోరాట క్రమాన్ని ఆవిష్కరించిండ్రు. రెవిన్యూ మంత్రిగా తన ముద్ర ఎట్లా ఉండబోతుందో కూడా చెప్పిండ్రు. జనంసాక్షి ఎడిటర్ ఎం.ఎం.రహమాన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మహమూద్ అలీ తన అంతరంగాన్ని పరచిండ్రు.
(బాక్స్‌లో వేసుకోవాలి..)
రాజకీయాల్లో నిజాయతీగా,నిక్కచ్ఛిగా మాట్లాడే వ్యక్తులు బహుఅరుదు.రాజకీయ నేపథ్యం లేకపోయినప్పటికీ వ్యవసాయం చేస్తూనే తొలిమలి దశల తెలంగాణ ఉద్యమ పోరాట ఝరిలో మమేకమైన వ్యక్తి ఆయన. ఆయన మాటల్లో స్వచ్ఛత కనిపిస్తుంది. ఏదో చేయాలన్న తపన కనిపిస్తుంది. ఉద్యమంలో తనదైన పాత్ర పోషించినట్లుగానే రాష్ట్రాభివృద్ధిలో కూడా తన ముద్ర వేయాలన్న భావన కనిపిస్తుంది. నలుగురికి చేతనైనంత సాయం చేయాలన్న తత్త్వం ఆయనది. అధికారాన్ని ఆశించే తత్త్వం కాదు. అధికారపీఠంలో ఉన్నప్పుడు నలుగురి సేవ చేయాలన్న భావన ఆయనది.అసమాన్యుడైనప్పటికీ సామాన్యుడిగా కనిపించడం, అందరితో కలిసిపోయి.అందర్నీ మెప్పించే తత్త్వం ఆయనది. ఆయనే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ.
ప్రశ్న…. తెలంగాణ ఉద్యమంలోకి విూ ఎంట్రీ ఎట్లా జరిగింది..?
జవాబు…… నేను 1953లో పుట్టిన. మాది వ్యవసాయ కుటుంబం. నాకు ఊహ తెలిసేటప్పటికే ఆంద్రోళ్ల రాక మొదలైంది. మేం చదువుకునే రోజుల్లో ఖలీలుల్లా అనే ప్రిన్సిపాల్ ఉండేవారు. ఆయన ద్వారా ఆంద్రోళ్ల కుట్ర కొంత తెలిసేది. అట్లనే జలీల్ పాషా అనే ఒక రీడర్ ఉండేవారు. ఆయనతో ఎక్కువగా ఇలాంటి విషయాలు మాట్లాడేవాళ్లం. ఆయన సహకారంతోనే చర్చలు గానీ, విద్యార్థుల వైపు నుంచి నిరసనలు, ర్యాలీలు తీసేటోల్లం. తెలంగాణ ఉద్యమంలోకి రావడానికి అట్లా బీజాలు పడ్డయి.
ప్రశ్న…. ఏ విషయంలో తెలంగాణకు బాగా అన్యాయం జరిగినట్టు విూరు నిర్ధారించుకున్నరు..?
జవాబు…. 1956లో ఆంధ్రాలో విలీనం వరకు ఉర్దూ భాషనే అధికార భాషగా ఉండేది. 1958లో అనూహ్యంగా 6 నెలల్లో తెలుగు నేర్చుకోవాలని ఓ ఫర్మానా జారీ చేసిండ్రు. 6 నెలల్లో నేర్చుకోవడం కాదు… చదవడం, రాయడం, ఉద్యోగ విధులు నిర్వహించడం చేయాలె. లేకపోతే ఇంటికే. ఇదెట్ల సాధ్యమైతది. అప్పటిదాకా కొన్ని తరాలకొద్దీ ఉర్దూ భాషలో కొనసాగుతున్న వ్యవహారాలు 6 నెలల్లో ఎట్ల మారిపోతయి..? ఇది బయటికి కనిపించని పెద్ద కుట్ర. ఆ దెబ్బతోని 30 వేల మంది తెలంగాణ ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డువిూద పడ్డరు. అందులో ఎక్కువ మంది ముస్లింలే కావడం గమనించాలె. అక్కడ నిర్ణయించుకున్న. సొంత పరిపాలన కోసం పోరాడాల్నని. మన ఇంట్ల మన అధికారం ఉండాలె. పక్కింటోడు మనింటి విూద చెలాయిస్తే ఎట్లుంటదో ఇన్నేండ్లల్ల జూసినం గదా.
ప్రశ్న……. తెలంగాణ ఉద్యమ సమయంలో విూ కళ్లముందు జరిగిన దారుణ సంఘటనలేమన్నా ఉన్నయా..?
జవాబు……. 1970లో జరిగిన ఘటన. పోలీసుకాల్పులు జరుగుతున్నయి. డాబా విూదున్న ఓ 15 ఏళ్ల అమ్మాయికి తూటా తగిలి స్పాట్లనే చనిపోయింది. అది నా కళ్లముందే జరిగింది. అయినా నేనెక్కడా వెనుకడుగు వేయలేదు. అయితే మా అమ్మ మాత్రం వారించేది. ఉద్యమంతోని ప్రాణాలకే ముప్పొస్తది బిడ్డా అని హెచ్చరించేది.
ప్రశ్న…. కేసీఆర్ తోని విూ పరిచయం ఎప్పుడు మొదలైంది..? విూ మధ్య ఎటువంటి అనుబంధం ఉంది..?
జవాబు… కేసీఆర్ నాకు 2001లనే పరిచయం. అంతకుముందు ఆయనెవరో నాకు తెల్వది. కానీ 2001ల ఎంత శ్రద్ధతోని ఉన్నడో ఇప్పుడు గూడ అంతే శ్రద్ధతోని ఉన్నడు. కేసీఆర్ అంటే ఓ ఇంటికి తండ్రి లాంటోడు. ఉద్యమాన్ని గూడ అట్లనే తండ్రి లెక్కనే చూసుకున్నడు. మా అందరికి కూడా ఆయన తండ్రితోని సమానమే. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే.
ప్రశ్న…… విూకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడమే గాక, కీలకమైన రెవిన్యూ శాఖను అప్పగించిండ్రు. మరి ఆ పదవి విూరు అడిగిండ్రా..? ఆయనే ఇచ్చిండ్రా..?
జవాబు….. తెలంగాణకు తొలి ఉపముఖ్యమంత్రిని కావడం నా అదృష్టం. ఇగ రెవెన్యూ బాధ్యతలు ఇవ్వడం అనేది నా అర్హతగా కేసీఆర్ భావించిండ్రు. నేను కేసీఆర్ సాబ్ ను ఏ పదవి కావాలని అడగలేదు. అసలు నాకు వద్దన్న గూడ. కానీ నాకుండే కమిట్ మెంట్ జూసి దానికి నువ్వయితేనే అర్హుడివి. బాధ్యతలు తీసుకోవాలె అన్నడు. అంతేగానీ నేను అడగలేదు. గమ్మతేందంటే… ఎందరో ఎన్నో పదవులు అడిగిండ్రు. అడిగినోళ్లకు పదవులు రాలేదు.
ప్రశ్న…. వైఎస్ హయాంలో టీఆర్‌ఎస్ నుంచి వలసలు జరిగినై కదా. విూకెలాంటి ఆఫర్లు రాలేదా..?
జవాబు……. ఆఫర్లు మస్తుగ వచ్చినై. కీలకమైన పదవులు ఇస్తమన్నరు. పార్టీలకు, అనుబంధ సంఘాలకు ప్రెసిడెంట్ ను జేస్తమన్నరు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తమన్నరు. మంత్రి పదవిస్తమన్నరు. గా ఆఫర్ల లోగుట్టేందో నాకు తెల్సు గదా. తెలంగాణవాదం లేకుంట జేసుడో వాళ్ల ఉద్దేశం. అయితే నన్ను అడిగినప్పుడు నేనొకటే చెప్పిన. నేను పార్టీ మారుత గనీ తెలంగాణ విూద మాటిస్తవా అని. ఏ పార్టీ అయితే నాకెందుకు..? తెలంగాణ వస్తే అయిపాయె. కానీ ఎవరు గూడా తెలంగాణ కోసం మాటియ్యలేదు.
ప్రశ్న……… మరి గొప్ప అవకాశాలు కోల్పోతున్ననని ఆనాడు విూకు అనిపించలేదా..?
జవాబు… వలసపాలన ఎంత దారుణంగా ఉంటదో నాకు తెల్సు. నేను ఒక్కణ్ని బాగుండాలనే తత్వం నాది కాదు. ప్రజలందరి కష్టాలు తొలగిపోవాలె. మన ఇంట్ల మనం సంతోషంగా బతకాలె. ఈ బానిస బతుకులు వద్దు అనే కోరుకునేటోన్ని. అందుకే నేను ఏ పార్టీలకు పోలేదు. టీఆర్‌ఎస్ ల కాకుండా వేరే పార్టీలకు పోయుంటే కొనసాగి ఉండేవాణ్ని కాదు. సూర్య, చంద్రులు ఉదయించడం ఎంత సత్యమో, తెలంగాణ రావడం అంతే సత్యమని బలంగా నమ్మిన. దాన్నే ప్రచారం చేసిన. అందుకే వాళ్ల ఆఫర్లు నాకు అవకాశాలుగా కనపడలేదు.
ప్రశ్న….. కేసీఆర్ లో విూకు నచ్చిన అంశాలేంటి..?
జవాబు… కేసీఆర్ గొప్ప ముందుచూపున్న వ్యక్తి. సాహసవంతుడు, ధైర్యవంతుడు. తెలంగాణ తెచ్చుడు నీతోని అయితదా అని ఎంతమంది అవహేళన చేసిండ్రో. వేరేవాళ్లయితే ఐదారు నెల్లకే కనుమరుగయ్యేటోల్లు. మనం జూల్లేదా. కానీ కేసీఆర్ అట్ల గాదు. చివరిదాకా కొట్లాడిండు. 2001 నుంచి ఆయన పూర్తి సమయం తెలంగాణ కార్యకర్త. సొంత జీవితమే లేదు. టీ, టిఫిన్ అన్ని గూడా ఆఫీస్ లకే. ఆయనే కాదు. వాళ్ల కుటుంబం గూడా అట్లనే ఉన్నది. ఇదే విచిత్రం. ఆయన భార్య, పిల్లలు అందరూ కమిటెడే. ఆయనలో ఇంకో కోణమున్నది. ఆయన చాలా సున్నిత మనస్కుడు. గరీబోల్లు కనపడితే తల్లడిల్లిపోతడు. ఆయన కండ్లకు నీల్లస్తయి. ఉద్యమంల పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటాంటే ఎన్నిసార్ల ఏడ్సిండో లెక్కేలేదు. ఓసారి రైల్వే స్టేషన్ల బుర్ఖా ఏస్కున్న ఓ ముస్లిం మహిళ బిడ్డ పెళ్లి కోసం పైసలు తక్కువ పడ్డయని సాయం చేయమని అడిగింది. ఎంతకావాలే అన్నడు కేసీఆర్. ఆమె ఎన్క ముందయి ఐదు వేలు కావాలన్నది. ఐదువేలతోనే ఏంజేస్తవని పక్కనే ఉన్న సంతోష్ (కేసీఆర్ పీఏ)ను పిలిచి పదివేలు ఇచ్చిండు. ఇంకోసారి ఇంకో మహిళ గురించి టీవీల ఓ స్టోరీ వస్తాంటే దాన్ని జూసి ఆమెకు లక్ష రూపాయలు సాయం చేసిండు. ఇట్ల చెప్పుకుంట పోతే ఎన్నున్నయో.
ప్రశ్న… ఉద్యమంలో ఉన్నరోజుల్లో మరచిపోలేని ఘటనలు ఏవైనా ఉన్నయా…?
జవాబు… 2001లో ఓసారి జడ్చర్లకు పోయినం. ఐదురోజులు అక్కడే ఉండే ప్రోగ్రాం. పార్టీ అప్పుడే కొత్తగా ఏర్పడ్డది. ప్రచారం గూడా జరగాల్నని నా జీపుకు పెద్ద జెండా పెట్టుకున్న. జడ్చర్లల మా బంధువులు గూడా ఉంటరు. వాళ్లు రమ్మని ఒక్కతీర్గ తలిగిండ్రు. ఇగ ఎట్లయినా ఐదు రోజులుంటన్న గదాని ఓరోజు నా జీపేస్కోని పోయిన. నా జీపును చూడంగనే వాళ్ల ఇల్లంత పరేషాన్ అయిండ్రు. రాకూడని వ్యక్తి వచ్చినట్టు, ఏదో ప్రమాదం జరిగినట్టు అందరిలోపల అలజడి. నాకర్థం గాలే. ఏమైందని అడిగిన. తెలంగాణ జెండా పెట్టుకుంటే ఇబ్బందైతది. మమ్మల్ని వేరే అనుకుంటరు. ఆ జెండా తీసి రమ్మన్నరు. ఇగ మరో సందర్భంల పార్టీ ప్రచారం కోసం కరీంనగర్ పోయినం. మా జీపుకు కొందరు రాయలసీమ వ్యక్తులు అడ్డం వచ్చిండ్రు. సార్ విూ దగ్గరున్న నాలుగైదు కండువాలియ్యిండ్రి అన్నరు. విూరెవరు..? విూకేంగావాలె…? మా పార్టీ కండువాలతోని విూకేం పని అని నేనడిగిన. మాది రాయలసీమ గదా సార్. టీఆర్‌ఎస్ కండువా ఉంటే మాకు సేఫ్టీగుంటది అన్నరు. నాకు జడ్చర్ల ఘటన గుర్తొచ్చి నవ్వొచ్చింది. ఆనాడు గులాబీ జెండా అంటే భయం. ఇవాళ అదే రక్షణ.
ప్రశ్న…. విూకు ఆనందాన్నిచ్చిన సందర్భాలేవి..?
జవాబు… 2009లో కేసీఆర్ దీక్షకు దిగినప్పుడు ఆరోగ్యం క్షీణించింది. ఏడోరోజుకే ఆందోళన మొదలైంది. మృత్యుముఖంలోకి పోయిండు. ప్రకటన వచ్చేటట్టు గొడ్తలేదు. అందరి కండ్లల్ల నీల్లే తిరుగుతున్నయి. ఒకవేళ కేసీఆర్ కు ఏమన్న అయితే మల్ల అసోంటి నాయకుడు వస్తడా… ఉద్యమం ఏమైతదన్న ఆందోళనే అందరిలో కనపడ్తంది. మొత్తానికి ఆయనను ఒప్పించి ప్రొఫెసర్ జయశంకర్ నిమ్మరసం తాగిచ్చిండు. ఇగ కేసీఆర్ బతుకుతడు అని ఊపిరి పీల్సుకున్నం. కేసీఆర్ బతికినందుకు నేనైతే చాలా సంతోషించిన. ఇగ మల్లోసారి డిసెంబర్ 9 ప్రకటన. కేసీఆర్ దీక్ష ఫలితంగా ఆ రోజు రాత్రి పదకొండున్నర ప్రాంతంల తెలంగాణ ప్రక్రియ మొదలుపెడ్తున్నట్టు చిదంబరం ప్రకటించంగనే చాలా సంతోషమేసింది. దశాబ్దాల కల నెరవేరిందన్న ఆనందం కలిగింది.
ప్రశ్న… విూ సాదాసీదా జీవితానికి స్ఫూర్తి ఎవరు..?
జవాబు… మా తండ్రే. బాబుమియా ఆయన పేరు. ఆయన చెప్పిన విలువల్నే పాటిస్తూ ఇంతటోణ్ని అయిన. తండ్రి నుంచి నేను ఒక్క రూపాయి గూడ తీసుకోలేదు. నా వంతుగా ఖురాన్ మాత్రమే తీసుకున్నా. అదే నా జీవితాన్ని తీర్చిదిద్దింది. మా నాయన దగ్గర నుంచి మూడు విషయాలు నేర్చుకున్న. 1) జీవితంలో అబద్ధం చెప్పకూడదు. 2) ప్రతి ఒక్కరితో మర్యాదగా ఉండాలె, ఎవరినీ నొప్పించవద్దు. 3) ధర్మబద్ధమైన సంపాదనే అనుభవించాలె. ఆ జీవన సూత్రాల్నే ఇప్పటికీ ఆచరిస్తున్న. విూకు తెలుసో తెల్వదో. నా జేబుల 4, 5 వందల కంటే ఎక్కువ ఉంచుకోను. డాంబికాలు ప్రదర్శించడం నాకిష్టం ఉండది. సామాన్యుడు ఎట్లుంటడో నేను గూడ అట్లనే ఉంట. (అంటూ పర్సును ఓపెన్ చేశారు. అందులో వంద రూపాయల కాగితాలు 4, 5 మాత్రమే కనిపించినై)
ప్రశ్న…. విూ భార్యా పిల్లలు, ఉద్యమంలో విూకు వారి సపోర్టు గురించి..?
జవాబు… నాకు ఒక కొడుకు. ఇద్దరు బిడ్డలు. కొడుకు పేరు ఆజంఅలీ. బిజినెస్ చూసుకుంటున్నడు. రాజకీయాల విూద నాలాగే తనకు గూడా ఆసక్తి లేదు. మావాడు నాకంటే సున్నిత మనస్కుడు. న్యాయమైన, ధర్మమైన మార్గంలనే నడువాలని కోరుకుంటున్న. పైసలతోని పనేంది..? వాటినే తినం గదా. పైసల ప్రయోజనాలు పైసలకున్నై. అవేందనేది తెల్సుకున్నోడే మనిషి. ఇగ నా భార్య నస్రీన్. ఆమెలాంటి వారు లక్షలో ఒకరుంటే మహాఎక్కువ. చాలా ఓపిక. రాత్రి మూడింటికైనా సరే… ఇంతమంది మన ఇంటికి వస్తున్నరు.. భోజనం ప్రిపేర్ చేయమంటే ఓపిగ్గా చేస్తది. ఆమె లేకపోతే నేను ఉద్యమంలో కొనసాగేవాణ్నే కాదు.
ప్రశ్న…. విూది కీలకమైన రెవెన్యూ విభాగం. దాంట్లో విూ మార్కు ఎట్లా ఉంటదనుకోవచ్చు..?
జవాబు… రెవెన్యూ విభాగాన్ని అద్భుతంగా తయారుచేస్త. అద్భుతమైన పక్కా భవనాలు కడ్తం. ఫిర్యాదు రాంగానే అతితక్కువ టైమ్ లనే పరిష్కారం జేసే వ్యవస్థ ఏర్పాటు జేస్తం. అన్నీ ఆన్ లైన్ లనే పరిష్కరిస్తం. అధికారులి పాత్ర తగ్గిస్తం. లంచావతారులకు కళ్లెం వేస్తం. దీంట్ల అనేక సమస్యలున్నయి. దశాబ్దాలుగా భూములకు సంబంధించి సరైన రికార్డుల్లేవు. అందుకోసం సమగ్ర భూ సర్వే జేస్తం. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 200 కోట్లకు పైనే నిధులు కేటాయించినై. పేదల భూములు, అసైన్డ్ భూములు కబ్జాలకు గురైతున్నై. ఆ సమస్యలు చెప్పుకునేందుకు అవావిూ దర్బార్ నిర్వహిస్తం. వారంలో ఒకరోజు అవావిూ దర్బార్ నిర్వహించి ప్రజాసమస్యలు వింటం. వక్ఫ్, ఎండోమెంట్, ప్రభుత్వ భూముల కబ్జాదారులపై కొరడా ఝళిపస్తం. 2, 3 నెలల్లో యాక్షన్ మొదలైతది. ఆ మార్పులు విూరే జూస్తరు. రెవెన్యూ విభాగాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దుత.
ప్రశ్న…. విూ ప్రభుత్వ విధానాలకు అధికారులు పూర్తిగా సహకరించడం లేదన్న అభిప్రాయాలున్నయి.
జవాబు… నిజమే. వారిని దారికి తెచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నయి. వారికేం కావాల్నో సమకూర్చి వారి నుంచి పూర్తిస్థాయి పనితీరును ఆశిస్తున్నం. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేది సాధారణంగా అల్పాదాయవర్గాలు, పేదప్రజలే. లంచాల కోసం వారిని సతాయిస్తే ఏమాత్రం ఉపేక్షించేది లేదు. త్వరలో విూరే చూస్తరు.
థ్యాంక్యూ మహమూద్ అలీగారు… విూ ప్రయత్నంలో విూరు సఫలం కావాలని జనంసాక్షి కోరుకుంటున్నది.