తెలంగాణ ఉద్యోగులకు ఖుష్‌ ఖబర్‌

C

43 శాతం ఫిట్‌మెంట్‌

ఖజానాపై 6500 కోట్ల భారం

తెలంగాణ సాధనలో ఉద్యోగులది కీలక పాత్ర

సీఎం కేసీఆర్‌

ఉద్యోగ సంఘాల హర్షం

హైదరాబాద్‌,ఫిబ్రవరి5(జనంసాక్షి): ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న తీపికబురు ఉద్యోగులకు అందింది. పే రివిజన్‌ ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక్‌ భూమిక పోషించిన వీరి కోసం ప్రభుత్వం సానుకూల దృక్పథం ప్రకటించింది. ఏటా 6500 కోట్ల  భారాన్ని భుజాన వేసుకుంది. వారితో ఓ గంట ఎక్కువైన పనిచేయించుకున్నా ఫర్వాలేదు కానీ పిఆర్సీ మాత్రం గ్రాండ్‌గా ఉండాలని నిర్ణయించింది.  తెలంగాణ ఉద్యోగులకు వేతన సవరణ ను అంగీకరిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రకటన చేశారు. ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌ మెంట్‌ ను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. కిందటిసారి ప్రభుత్వం 39 శాతం ఇవ్వగా, ఈసారి దానిని మరో నాలుగు శాతం పెంచి ఉద్యోగులకు వేతన సవరణ ప్రకటించారు. గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంత మొత్తం పెరగలేదని అన్నారు. దీని అమలు గత ఏడాది జూన్‌ రెండో తేదీనుంచి, అంటే తెలంగాణ ఆవిర్భావం నుంచి ఉంటుందని ఆయన అన్నారు. బకాయిలను పి.ఎఫ్‌ లో జమ చేస్తామని అన్నారు. దీనికి సంబందించి నగదును మార్చి నెల నుంచి ఇస్తారని ఆయన చెప్పారు. ఇక్కడ కూడా కెసిఆర్‌ తన సెంటిమెంట్‌ ను బహిర్గతం చేశారు. ఈ రోజు గురువారం.. రేపు శుక్రవారం మంచి రోజు కనుక ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తుందని అన్నారు. ఇక అనామలీస్‌ కమిటీ ఉద్యోగులకు సంబందించి ఏవైనా తేడాలు ఉంటే కమిటీ పరిశీలిస్తుందని కెసిఆర్‌ తెలిపారు. ప్రకటించిన ఫిట్‌మెంట్‌ 2014 జూన్‌ 2 నుంచి అమలవుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించి ఉత్వర్వులు రేపు జారీ చేస్తామన్నారు. సచివాలయంలో సిఎం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక భ ఊమిక పోషించారని అన్నారు. ఎన్ని అవాంతరాలు, బెదిరింపులు ఎదురైన తట్టుకుని ఉద్యమంలో ముందున్నారని అన్నారు. అలాగే సకల జనుల సమ్మెలో పాల్గొని విజయవంతం చేశారని అన్నారు. వారికి పిఆర్సి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు భారమైనా భరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఓ గంట ఎక్కువైనా వారితో పనిచేయించి ఆదాయాన్ని పెంచుకుంటామని అన్నారు. ముఖ్యంగా రెవెన్యూ, వాణిజ్య శాఖ ఉద్యోగులు మరింతగా కష్టపడాల్సిఉంటుందన్నారు. జూన్‌లో పదవీ విరమణ పొందిన వారికి కూడా ఈ పెంపు వర్తిస్తుందని అన్నారు. అలాగే సర్వీస్‌ రూల్స్‌ కూడా మారుస్తామని అన్నారు. వాటిని ఉద్యోగులతో చర్చించి సరళీకరిస్తామని చెప్పారు. విూడియా సమావేశంలో ఆర్థికమంత్రి ఈటెల, శ్రీనివాసగౌడ్‌, దేవి ప్రాసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగ సంఘాల హర్షం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ ప్రకటించినందుకు సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగసంఘాలు కృతజ్ఞతలు ప్రకటించాయి. మిఠాయిలను పంచిబెట్టారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన వేతన సవరణపై తెలంగాణ ఉద్యోగుల సంఘం హర్షం ప్రకటించింది. ఇప్పటికే ప్రత్యేక ఇంక్రిమెంట్‌ ఇచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఇప్పుడు నలభై మూడు శాతం ఫిట్‌ మెంట్‌ ఇచ్చి ఉద్యోగుల పట్ల తన ఆదరణ కనబరిచారని ఉద్యోగుల సంఘం అద్యక్షుడు దేవి ప్రసాద్‌ వ్యాఖ్యానించారు. కెసిఆర్‌ కు, ఇతర మంత్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. గత పిఆర్సిలకు భిన్నంగా ఈ పీఆర్సి ఉందని, తద్వారా తన ప్రత్యేకతను కెసిఆర్‌ నిలబెట్టుకున్నారని అన్నారు.గతంలోనే ఇది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వమని కెసిఆర్‌ చెప్పారని , అదే ప్రకారం చేశారని దేవీ ప్రసాద్‌ అన్నారు.సకల జనుల సమ్మె నాటి బకాయిలను విడుదల చేయాలని కూడా కెసిఆర్‌ ఆదేశించారని ఆయన చెప్పారు.ఉద్యోగులకు కడుపు నిండా పెట్టాలని భావించి కెసిఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని, తాము కూడా కష్టపడి ప్రభుత్వం కోసం పనిచేస్తామని ఆయన చెప్పారు.