తెలంగాణ కథ ఒడవని దు:ఖం

తాడోపేడో తేల్చుకునే దిశగానే టీఆర్‌ఎస్‌ : కేసీఆర్‌
వరంగల్‌/జనగామ, ఏప్రిల్‌ 8 (జనంసాక్షి) :
తెలంగాణ కథ ఒడవని దు:ఖమని, ఇక తాడోపేడో తేల్చుకునే సమయం ఆసన్నమైందని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. ఈ తరుణంలో ప్రతి ఒక్కరు గట్టిగా నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నెల్లుట్ట రవీందర్‌ రావు ఉద్యోగ విరమణ సభ జిల్లాలోని జనగామలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేసీఆర్‌ తెలంగాణ ప్రజలు ఇంకెంతకాలం సీమాంధ్రుల కట్టడిలో బతకాలని ప్రశ్నించారు. అన్నీ దోచుకుని తెలంగాణ ప్రజలకు నిలువనీడ లేకుండా చేస్తున్న సీమాంధ్ర నేతలకు తగిన గుణపాఠం చెప్పాలని, ఇందుకు ప్రతిఒక్కరు ఉద్యమించాలని అన్నారు. తెలంగాణది ఇప్పటికీ డెప్యూటీ సీఎంల బతుకేనా అని ప్రశ్నించారు. 1956లో వీలన సమయంలోనే తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తే వారిని పిట్టల్లా కాల్చేసి విలీనం చేసుకున్నారని తెలిపారు. ఆనాటి సభకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ కాస్త ఆలస్యంగా    చేరుకున్నారని, అప్పటికే తొమ్మిది మందిని పాలకులు కాల్చి చంపారని తెలిపారు. ఆ రోజే తాను కూడా చనిపోతే ఈ అరాచకాలు చూడాల్సి వచ్చేది కాదని ఆయన చాలాసార్లు బాధపడినట్లు తెలిపారు. 12 ఏళ్ల క్రితం కొద్ది మందితో ప్రారంభమైన ఉద్యమం నేడు చీమల పుట్టలా మారినా కేంద్రం కళ్లు తెరవడం లేదన్నారు. ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజలను సీమాంధ్ర పెట్టుబడిదారులు, నేతలు కట్టుబానిసల్లా చూస్తున్నారని వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న రవీందర్‌రావును ఎమ్మెల్సీగా చేసి తీరుతానన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ, టీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు.