తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగులకు తీపీకబురు

1
– క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌,ఫిబ్రవరి 26(జనంసాక్షి):తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగులకు అసలు తీపి కబురును ప్రభుత్వం అందించింది. గతంలో ప్రకటించిన విధంగా వారి ఉద్యోగాలను  క్రమబద్ధీకరణకు ఉమ్మడి రాష్ట్రంలోని చట్టం వర్తింపచేస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2014 జూన్‌ 2 నాటికి పనిచేస్తున్న వారికే క్రమబద్ధీకరణ వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎక్కువ కాలం విధులకు గైర్హాజరైన వారికి ఈ క్రమబద్ధీకరణ వర్తించదు. ముఖ్యంగా విద్య, సంక్షేమ శాఖలు మినహా ఇతర శాఖల్లో ఎక్కువకాలం విధులకు గైర్హాజరైన వారికి ఇది వర్తించదు. రిజర్వేషన్ల సమస్య తలెత్తితే ఆయా శాఖల్లో పోస్టులను బ్యాక్‌లాగ్‌ పద్ధతిలో భర్తీ చేయాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఇందుకు ఏపీ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ 1994 యాక్ట్‌లో సవరణలు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్ట్‌ ఉద్యోగులతో భర్తీ చేయొచ్చని చట్టంలో ప్రభుత్వం చేర్చింది. ఫుల్‌టైమ్‌ కాంట్రాక్ట్‌ బేసిక్‌లో ఉద్యోగం చేస్తున్న వారికి అవకాశం కల్పించనుంది ప్రభుత్వం. 2014, జూన్‌ 2 కంటే ముందు నుంచి కాంట్రాక్ట్‌ ఉద్యోగంలో ఉన్న వారికి అవకాశం ఇవ్వనుంది.