తెలంగాణ కోసం మరో బలిదానం

పురుగుల మందు తాగి విద్యార్థి ఆత్మహత్య
తన చావుతోనైనా తెలంగాణ రావాలంటూ సూసైడ్‌ నోట్‌
రామకృష్ణాపూర్‌ మే, 14 (జనంసాక్షి) :
తెలంగాణ కోసం మరో యువకుడు బలిదానం చేసుకున్నాడు. మందమర్రి మండలం కుర్మపల్లి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి మల్లేశ్‌ (24) తెలంగాణ ఏర్పాటులో జాప్యాన్ని నిరసిస్తూ మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రత్యేక రాష్ట్రం కోసం తన చావే చివరిది కావాలంటూ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. మల్లేశ్‌ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలు.. గ్రామానికి చెందిన అందుగుల రాములు (సింగరేణి కార్మికుడు)-పోసక్క దంపతుల మొదటి కుమారుడు మల్లేశ్‌. మంచిర్యాలలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. 2009లో నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నాడు. చేతకాని రాజకీయ నాయకుల వల్లే తెలంగాణ ఏర్పడడం లేదంటూ అనేక మార్లు మిత్రుల వద్ద ఆవేదన వ్యక్తం చేసేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం కూడా తెలంగాణ విషయమై మిత్రులతో చర్చించాడు. అనంతరం తమ మిర్చి చేను వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతదేహం వద్ద అంతకుముందు రాసి పెట్టుకున్న లేఖ కనిపించింది. తన చావుతోనైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణ ఏర్పాటు చేయాలని, తన చావే చివరిది కావాలని అందులో పేర్కొన్నాడు. మల్లేశ్‌ మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మమ్ములను వదిలి పోయావ కొడుకా..
పెద్ద పెద్ద చదువులు చదివి మమ్ములను సాదుతవనుకున్నం, అప్పుడే మమ్ములను వదిలిపోయావా కొడుకా అంటూ అతడి తల్లిదండ్రులు రోదించిన అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. తమ కుమారుని మృతితోనైనా తెలంగాణ ఏర్పాటు చేయాలని వారు వేడుకున్నారు. మల్లేశ్‌ మృతదేహాన్ని చూసేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి విలపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రామకృష్ణాపూర్‌ ఎస్సై బన్సీలాల్‌ తెలిపారు.
మల్లేష్‌ కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న మల్లేశ్‌ కుటుంబాన్ని ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని వారికి నచ్చజెప్పారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ నాయకులు కుమ్మం సురేందర్‌, యాకూబ్‌ అలీ, జిలకర మహేష్‌, మల్లయ్య, టీడీపీ నాయకులు గోపు రాజం, మల్లేష్‌, జింజిపెల్లి శశి, ఏలిగిరి కనకరాజు, సాగర్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.