తెలంగాణ జలవిద్యుత్ ఉత్పత్తిపై ఎపి అభ్యంతరం
కెఆర్‌ఎంబికి లేఖ రాసిన ఎపి ప్రభుత్వం
అమరావతి,సెప్టెంబర్23 (జనంసాక్షి) : తెలుగు రాష్టాల్ర మధ్య నీటి వివాదం ముదురుతోంది. కేఆర్‌ఎంబీకీ ఏపీ ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది. తెలంగాణలో జలవిద్యుత్ ఉత్పత్తిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. శ్రీశైలం, సాగర్, పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తి ఆపాలని విజ్ఞప్తి చేసింది. విద్యుత్ ఉత్పత్తితో నీరు వృథాగా సముద్రంలోకి పోతుందని లేఖ పేర్కొంది. విద్యుత్ ఉత్పత్తికోసం వాడిన నీటిని తెలంగాణ వాటాలో వేయాలని ఏపీ కోరింది. శ్రీశైలంలో 113, సాగర్‌లో 86, పులిచింతలలో 23 టీఎంసీల నీటిని వినియోగించారని, బోర్డు నిర్ణయాలు, ఒప్పందాలను తెలంగాణ ఉల్లంఘిస్తుందని ఏపీ ప్రభుత్వం విమర్శించింది. నిబంధనలు ఏకపక్షంగా ఉల్లంఘిస్తున్న తెలంగాణకు జరిమానా విధించాలని, వెంటనే అత్యవసరంగా బోర్డు విూటింగ్ ఏర్పాటు చేయాలని లేఖలో ఏపీ ప్రభుత్వం కోరింది.