తెలంగాణ దోశ వేసినంత సులభంకాదు

వయలార్‌ వేలాకోలపు మాటలు
న్యూఢిల్లీ, మార్చి 4 (జనంసాక్షి) :
తెలంగాణపై నిర్ణయం తీసుకోవడమంటే దోశ, అప్పడం వేసినంత సులభం కాదని కేంద్ర మంత్రి, ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల పరిశీలకుడు వయలార్‌ రవి అన్నారు. తెలంగాణ ఎక్కడుందంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, తర్వాత తాను అలా అనలేదంటూ వివరణ ఇచ్చుకున్న వయలార్‌ మళ్లీ నోరు జారాడు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతుండగా, కొందరు జర్నలిస్టులు తెలంగాణ అంశంపై ఏదైనా నిర్ణయం తీసుకున్నారా అని ప్రశ్నించారు. దీంతో వయలార్‌ పై విధంగా స్పందించారు. తెలంగాణపై రాజకీయ పార్టీలకన్నా మీడియాకే ఎక్కువ ఆసక్తి ఉందంటూ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణపై ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ రాజకీయ పక్షాలు, అన్ని ప్రాంతాల ప్రజలతో   సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రతిరోజూ చర్చలు జరగాలని ఏమీ లేదని, చర్చలు ఎంతకాలం కొనసాగుతాయో తాను చెప్పలేనన్నారు. సమస్య పరిష్కారానికి నిర్దిష్టమై గడువంటూ ఏమీ లేదని చెప్పాడు. గల్ఫ్‌ దేశాల్లో వీసా నిబంధనల కారణంగా చిక్కుకున్న వారి గురించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ఏదైన అభ్యర్థన వస్తే వారిని స్వదేశానికి రప్పించే అంశాన్ని పరిశీలిస్తామని సమాధానమిచ్చారు.