తెలంగాణ పీఎస్సీ ఏర్పాటు చేయండి

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌
హైదరాబాద్‌, జూన్‌ 4 (జనంసాక్షి) :
ఏపీపీఎస్‌సీ ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాల నియామకాల్లో తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా తెలంగాణకు ప్రత్యేక సర్వీస్‌ కమిషన్‌ టీపీఎస్‌సీ ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కె.తారకరామారావు డిమాండ్‌ చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీపీఎస్‌సీ తెలంగాణ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆయన ఆరోపించారు. గతంలో ఏపీపీఎస్‌సీ నిర్వహించిన ఉద్యోగ నియామక ప్రక్రియల్లో ఈ విషయం స్పష్టంగా రుజువు అయిందని చెప్పారు. ఏపీపీఎస్‌సీ గ్రూపు`1 రాత పరీక్షల్లో తెలంగాణకు చెందిన శివలింగయ్య, చంద్రశేఖర్‌గౌడ్‌కు మొదటి, ద్వితీయ ర్యాంకులు రాగా, వారికి ఇంటర్వ్యూలో 90మార్కులకు గాను కేవలం 28మార్కులు వేసి ఆర్డీఓ కావాల్సిన వారిని అంతకన్నా తక్కువస్థాయి అధికారులుగా ఎంపిక చేశారని, రాత పరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన వారికి ఆర్డీఓ పోస్టులు ఇచ్చారని, ఇది వివక్ష కాదా అని ప్రశ్నించారు. ఫెస్టిఫైడ్‌ గెజిటెడ్‌ ఉద్యోగాల నిమాయకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయాలని నిబంధనలున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కచ్చితంగా ఈ నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ నియామకాలు జోనల్‌ స్థాయిలో నిర్వహించాలని కేటీఆర్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఏదేమైనా తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాల్సిందేనని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేపడుతామన్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న ప్రస్తుత తరుణంలోనే ఏపీసీఎస్‌సీలో ఇంత వివక్ష ఉంటే గతంలో పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవాలన్నారు. సీమాంధ్రుల ఆధిపత్యంలో నియామక బోర్డు ఉంటే తెలంగాణ నిరుద్యోగులు నిండా మునగడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు.